మకర వాహనంపై కపిలతీర్థ విభుడు
తిరుపతి ఫిబ్రవరి 17,
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో నాలుగో రోజైన సోమవారం ఉదయం శ్రీ కపిలేశ్వరస్వామివారు సోమస్కందమూర్తిగా కామాక్షి అమ్మవారి సమేతంగా మకర వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయకనగర్ ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ గుడి, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. వాహనసేవలో భక్తజన బృందాల చెక్కభజనలు, కోలాటాలు ఆకట్టుకున్నాయి. మకరం గంగాదేవికి నిత్యవాహనం. గంగ పరమశివుని శిరస్సుపై నివసిస్తోంది. గంగాదేవి వాహనమైన మకరం తపమాచరించి శివానుగ్రహాన్ని పొంది ఆ పరమశివునికి వాహనమైందని శైవాగమాలు తెలియజేస్తున్నాయి. మకరం జీవప్రకృతికి ఉదాహరణ. భగవంతుని ఆశ్రయించినంత వరకు జీవుడు నీటిలో మొసలిలా బలపరాక్రమంతో జీవించవచ్చు. నంతరం ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు అర్చకులు స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షిదేవి అమ్మవారికి పాలు, పెరుగు, తేనె, పండ్లరసాలు, చందనంతో అభిషేకం చేశారు. శేష వాహనం : బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి 7 నుండి రాత్రి 9 గంటల వరకు శేష(నాగ) వాహనంపై స్వామివారు భక్తులకు కనువిందు చేస్తారు. వేంకటాచలంపై శిలలన్నీ ఆదిశేషుని పడగలే. శ్రీకూర్మం మీద ఆదిశేషుడు - ఆ ఆదిశేషునిపై భూమండలం - ఆ భూమిని ఛేదించుకుని పైకి వచ్చిన పాతాళ మహాలింగం కపిలమహర్షిచే పూజింపబడింది. ఆ లింగం వెలసిన ఈ ప్రదేశం కైలాసం వంటి మహిమాన్విత దివ్యక్షేత్రం. ఆదిశేషుని పడగలపైనున్న మణులతో కపిలలింగం, నిరంతరం దీపకైంకర్యాన్ని అందుకుంటోంది.