ఫిబ్రవరి 20న 10 వేల మంది విద్యార్థులతో మహాసరస్వతియాగం
తిరుపతి ఫిబ్రవరి 17,
ధర్మప్రచారంలో భాగంగా టిటిడి హిందూ ధర్మప్రచార పరిషత్, విద్యా విభాగం సంయుక్తాధ్వర్యంలో ఫిబ్రవరి 20న తిరుపతిలోని గీతాజయంతి మైదానంలో(ఎస్వీ హైస్కూల్ మైదానం) సుమారు 10 వేల మంది విద్యార్థులతో మహాసరస్వతి యాగం నిర్వహించనున్నారు. ఉదయం 6 నుండి 11 గంటల వరకు అనుజ్ఞ పుణ్యాహం, సరస్వతీ దేవి ఆరాధన, కలశారాధన, మహాసరస్వతీ యాగం, పూర్ణాహుతి తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. త్వరలో జరుగనున్న వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థిని విద్యార్థులు విజయం సాధించాలని శ్రీ సరస్వతి అమ్మవారిని ప్రార్థించేందుకు ఈ యాగం తలపెట్టారు.టిటిడి విద్యాసంస్థలు, ప్రభుత్వ విద్యాసంస్థలు, ధార్మిక సంస్థల్లో 8, 9, 10 తరగతులు, ఇంటర్, డిగ్రీ చదువుతున్న విద్యార్థిని విదార్థులు ఈ యాగంలో పాల్గొనవచ్చు. పూర్ణాహుతి సమయంలో పఠించేందుకు వీలుగా విద్యార్థులకు సరస్వతి మంత్రం కాపీలను సరఫరా చేస్తారు. ఈ సందర్భంగా ప్రముఖ పండితులతో ఉపన్యాస కార్యక్రమం ఉంటుంది. పాల్గొన్న విద్యార్థులందరికీ విద్యాకంకణం, పుస్తకం, పెన్ను అందజేస్తారు.