కర్నూలు, ఫిబ్రవరి 17, కుటుంబ నియంత్రణలో ట్యూబెక్టమీ, వ్యాసెక్టమీ వంటి రెండు పద్ధతులు ఉన్నాయి. ట్యూబెక్టమీ మహిళలకు, వ్యాసెక్టమీ పురుషులకు చేస్తారు. అయితే ఈ కు.ని ఆపరేషన్ల లెక్కల్లో పురుషుల సంఖ్య జీరో కావడం ఆశ్చర్యపరిచే అంశం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం గత మూడు సంవత్సరాల్లో జరిగిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు అన్నీ మహిళలకే జరిగాయి. పురుషులు ఆసక్తి చూపకపోవడంతో 100 శాతం మహిళలే ఒకటి, రెండు కాన్పుల అనంతరం కు.ని ఆపరేషన్లు చేయించుకుంటున్నారు. 2016-17లో ట్యూబెక్టమీ ఆపేరషన్లు మొత్తం 20,492 జరిగాయి. 2017-18లో 19,528 జరిగాయి. 2018-19లో 17,926 కు.ని ఆపరేషన్లు జరిగాయి. పిల్లలు కలగకుండా మహిళలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకుంటే ప్రభుత్వం రూ.850 ప్రోత్సాహ కానుక రూపంలో చెల్లించేది. ఈ మొత్తంలో కేంద్రం రూ.600, రాష్ట్ర ప్రభుత్వం రూ.250 ఇస్తుంది. కొన్ని నెలలుగా మన రాష్ట్రం నుంచి నిధులు రావట్లేదు. కేంద్రం ఇచ్చే సాయమే అందిస్తున్నారు. ప్రస్తుతం మహిళల్లో కుటుంబ నియంత్రణపై అవగాహన పెరిగిందని.. స్వచ్ఛందంగా పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుం టున్నారని ప్రోత్సాహ కానుక ఇవ్వడం పూర్తిగా మానేశారు. వేసక్టమీ చేయించుకునే పురుషులకు రూ.1100 చెల్లించే వారు. అనేక అపోహల వల్ల పురుషులు కు.ని చికిత్సలకు సుముఖత చూపడం లేదు. కుటుంబ నియంత్రణలో పురుషుల సంఖ్య పెంచడానికి వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉంది.కుటుంబ నియంత్రణ ఆపరేషన్ల విషయంలో ప్రస్తుతం అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ కొత్త విధానం వల్ల కోతలు, కుట్టు వంటి సమస్యలు ఉండవు. రక్తస్త్రావం జరిగే అవకాశం ఉండదని వైద్యులు పేర్కొంటున్నారు. వాస్తవానికి ట్యూబెక్టమీకన్నా వ్యాసెక్టమీ చాలా సులువు. కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స జరిగిన గంట తర్వాత పురుషులు తమ పనులను యథావిధిగా చేసుకోవచ్చు. కానీ చాలా మంది వ్యాసెక్టమీ చేయించుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. దగ్గరుండీ మరీ భార్యలకు ట్యూబెక్టమీ చేయిస్తున్నారు. కంప్యూటర్ యుగంలో కూడా మూఢనమ్మకాలు, భయం పురుషులను వీడడం లేదు. జిల్లాలోని ఏరియా ఆస్పత్రుల్లో కుటుంబ నియంత్రణకు చేపడుతున్న ఆపరేషన్లకు అన్నీ అడ్డంకులే. శస్త్ర చికిత్స చేసేందుకు సరైన వసతులు లేకపోవడంతో వైద్యలు లక్ష్యం చేరుకోలేకున్నారు. నంద్యాలలోని జిల్లా స్థాయి ఆస్పత్రిలోని పిపి(పోస్ట్‌పార్ట్) యూనిట్‌లో కు.ని ఆపరేషన్లు చేస్తారు. అక్కడ ఆపరేషన్లు చేయించు కోవడానికి నంద్యాల నుంచే కాకుండా వెలుగోడు, గడివేముల, బండి ఆత్మకూరు, పాణ్యం, మహానంది, గోస్పాడు మండలాల పరిధిలోని మహిళలు ఇక్కడికి వస్తారు. కు.ని ఆపరేషన్లకు అవసరమైన పరికరాలు అందుబాటులో లేకపోవడంతో అందరికీ అపరేషన్లు చేయలేక చాలా మందిని వెనక్కు పంపుతున్నారు. పరికరాలతో పాటు సిబ్బంది కొరత వేధిస్తోంది. పిపి యూనిట్‌లో ఇద్దరు డాక్టర్లు, ఇద్దరు స్టాఫ్ నర్సులు, ఇద్దరు ఏఎన్‌ఎంలు, ఉండాల్సి ఉండగా ఒక్కొక్కరే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో కు.ని ఆపరేషన్ల విషయంలో అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు.