YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ఆంధ్రోళ్లకు ఏమైంది...ఈ నిశ్శబ్దం వెనుక

ఆంధ్రోళ్లకు ఏమైంది...ఈ నిశ్శబ్దం వెనుక

విజయవాడ, ఫిబ్రవరి 18,  ఏపీలో ఇపుడు పెద్ద ఎత్తున జరుగుతున్న రెండు ఉద్యమాల విషయంలో జనం రియాక్షన్ చూసిన వారు ఖంగు తింటున్నారు. అసలు ఆంధ్రుల మనోగతం ఏంటి? వారు ఎందుకు ఇలా సైలెంట్ అయిపోయారన్నది విశ్లేషకులకు కూడా అంతుపట్టని తీరుగా ఉంది.నిజానికి ఉద్యమాల చరిత్ర ఆంధ్రులకు మెండుగా ఉంది. ఉమ్మడి మద్రాస్ నుంచి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుకున్నపుడు ఏళ్ళకు ఏళ్ళు ఉద్యమాలు నడిపింది ఆంధ్రులే. ఓ వైపు స్వాతంత్ర పోరాటం సాగుతూంటే దానికి సమాంతరంగా ఈ పోరాటం నడించింది. దేశమంటే మట్టి కాదు, మనుషులు అని ఏనాడో గురజాడ అప్పారావు చెప్పారు. ఒక ప్రాంతం అభివృధ్ధి చెందాలన్నా, ముందుకు సాగాలన్నా అక్కడి ప్రజల ఆలోచనలు, కదలిక చాలా ముఖ్యం. రాదు అనుకున్న తెలంగాణా వచ్చిందంటే అందుకు అక్కడి ప్రజల ఉద్యమ స్పూర్తే కారణం. మరి ఏపీలోని జనాలకు అటువంటి చురుకుదనం లేదా. ప్రజలు వీటిని పట్టించుకోరా? అన్నది ఒక చర్చగా ఉంది.. ఇక విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అంటూ చేసిన పోరాటం చరిత్రలో పదిలంగా ఉంది. ఇదే తీరున అనేక ఉద్యమాలలో ఆంధ్రుల పాత్ర గర్వకారణంగా నిలుస్తుంది. మూడు దశాబ్దాల‌ క్రితం మధ్య‌పాన నిషేధం కోరుతూ ఆంధ్రులు చేసిన పోరు కూడా వినుతికెక్కినదే. మరి ఇంతటి చరిత్ర ఉన్న ఆంధ్రులు గత ఆరేళ్ళుగా మాత్రం స్తబ్దుగా ఉంటున్నారు.సమైక్య ఆంధ్ర ప్రదేశ్ కోసం చేసిన ఆంధ్రుల పోరు తుస్సుమంది. మొక్కుబడి తంతుగానే ఈ పోరు సాగింది తప్ప జిల్లాల గడప దాటలేదు, అందుకే ఢిల్లీ కూడా దీన్ని పట్టించుకోలేదు. అడ్డంగా ఏపీని విడగొట్టేసింది. ఆ తరువాత ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రులకు మోసం జరిగింది. దాన్ని అయినా సీరియస్ గా తీసుకుని పోరాటం చేస్తే ఫలితం ఉండేది, కానీ అలా జరగలేదు. దాంతో మరింతగా ఆంధ్రులు నష్టపోయారు. ఇక ఏపీకి రాజధాని విషయంలో ఇపుడు రెండు పార్టీలూ జనంలోకి వస్తున్నాయి. తమ అనుకూల నినాదాలతో హడావుడి చేస్తున్నాయి. జనం మద్దతు తమకే ఉందని చెప్పుకుంటున్నాయి, కానీ ఎప్పటిమాదిరిగానే ఆంధ్రుల నుంచి స్పందన లేదు.ఏపీ జనం ఎందుకిలా తయారయ్యారన్నది పెద్ద చర్చగా ఉంది. మూడు రాజధానులు కావాలంటూ ఓ వైపు వైసీపీ అనుకూల ర్యాలీలు తీస్తే అందులో ఆ పార్టీ నాయకులు తప్ప జనం లేరు. మరో వైపు అమరావతినే రాజధానిగా ఉంచాలని దాదాపు రెండు నెలలుగా అక్కడ ఆందోళనలు జరిగితే సగటు జనం మద్దతు అసలు లేదు. ఈ రెండు పరిణామాలను చూసినపుడు ప్రజల ఆలోచనల మీద కొన్ని అభిప్రాయాలు కలుగుతున్నాయని సామాజికవేత్తలు అంటున్నారు. వారు స్వార్ధ చింతనతో తమ బాగు తాము చూసుకుంటున్నారని, ఏపీని గాలికి వదిలేశారని ఒక భావంగా ఉంటే. ఎవరు నాయకులుగా ఉన్నా ఏపీ బాగుపడదని నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చి వైరాగ్యంతో స్తబ్దుగా ఉన్నారని మరో మాట వినిపిస్తోంది. ఏది ఏమైనా ఒకనాడు చైతన్యానికి మారుపేరుగా ఉన్న ఆంధ్రులు ఇపుడు ఏపీ రాష్ట్రం అనేక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతూంటే బాధ్యత తీసుకోకుండా క్రియాశీల రహితంగా ఉండడం తగదని సామాజికవేత్తలు, మేధావులు హెచ్చరిస్తున్నారు. జనం కలసివస్తే రాష్ట్రమైనా, దేశమైనా బాగుపడేది అంటున్నారు.

Related Posts