YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

గులాబీలో రాజ్యసభ లొల్లి

గులాబీలో రాజ్యసభ లొల్లి

గులాబీలో రాజ్యసభ లొల్లి
హైద్రాబాద్, ఫిబ్రవరి 19, 
టీఆర్ఎస్ లో రాజ్యసభ సీట్ల పంచాయతీ మొదలైంది. చాన్స్ కోసం కొందరు ప్రయత్నాలు చేస్తుంటే.. వారికి చెక్ పెట్టేందుకు ఇంకొందరు గట్టిగా ట్రై చేస్తున్నారు. తమకు ఇచ్చిన హామీ నెరవేర్చాలని వారు కోరుతుంటే.. అలా ఇస్తే జిల్లాల్లో గ్రూపులు పెరిగిపోతాయని, కేడర్ నిరాశ చెందుతుందని అవతలివారు ఫిర్యాదులు చేస్తున్నారు. దీంతో రాజ్యసభ అవకాశం ఎవరికి వస్తుందన్న దానిపై పార్టీలో చర్చ జరుగుతోంది. పార్టీలో పరిస్థితి పైకి కనబడుతున్నంత సైలెంట్ గా లేదని సీనియర్లు అంటున్నారు. ఏప్రిల్ రెండో వారంలో రాజ్యసభ ఎంపీలు గరికపాటి రామ్మోహన్రావు, కేవీపీల పదవీకాలం ముగియనుంది. ఆ రెండు సీట్లకు ఎన్నిక నిర్వహించేందుకు ఈసీ ఈ నెలాఖరులో నోటిఫికేషన్ విడుదల చేసే చాన్స్ ఉంది. దీంతో ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రాజ్యసభ సీటు కోసం ఏపీ సీఎం జగన్ ద్వారా లాబీయింగ్ చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి. దీనిపై జగన్ ఇప్పటికే సీఎం కేసీఆర్తో మాట్లాడారని.. పొంగులేటి ప్రయత్నాలు ఫలిస్తాయా, లేదా అన్నది ఆసక్తిగా మారిందని అంటున్నాయి. 2019 లోక్సభ ఎలక్షన్లలో ఖమ్మం సిట్టింగ్ టికెట్ కోసం పొంగులేటి జగన్ ద్వారా రాయబారం నడిపారు. కానీ కేసీఆర్  నామా నాగేశ్వర్రావుకు చాన్స్ ఇచ్చారు. భవిష్యత్తులో రాజ్యసభ సీటు ఇస్తానని పొంగులేటికి హామీ ఇచ్చారని ప్రచారం జరిగింది. తాజాగా రాజ్యసభ ఎన్నిక దగ్గర పడటంతో అందరి దృష్టి పొంగులేటి వైపు మళ్లింది. అయితే ఖమ్మం జిల్లాకు చెందిన మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామా నాగేశ్వరరావు ఇద్దరూ పొంగులేటికి రాజ్యసభ సీటు ఇవ్వొద్దంటూ కేటీఆర్ ను కోరారని పార్టీలో ప్రచారం జరుగుతోంది.పొంగులేటిని ఎంపీ చేస్తే జిల్లాలో గ్రూపు రాజకీయాలు మొదలవుతాయని ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలోనే పొంగులేటి ఇటీవల ఏపీ సీఎం జగన్ ను కలిసి గోడు వెళ్లబోసుకున్నారని టీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ ఒకరు తెలిపారు. ఈసారి పొంగులేటికి చాన్స్ వస్తుందని ఆయన అనుచరులు నమ్మకంతో ఉన్నారు.మాజీ ఎంపీ కవితకు రాజ్యసభ సీటు ఇవ్వాలని నిజామాబాద్ జిల్లా నేతలు కోరుతున్నారు. ఆమెకు కాకుండా జిల్లా నుంచి వెరెవరికి ఇచ్చినా జిల్లాలో పార్టీ కేడర్ ఆందోళనకు గురయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. 2019 లోక్సభ ఎలక్షన్లలో ఓడిపోయినప్పటి నుంచి కవిత యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉంటున్నారు. మున్సిపల్ ఎన్నికల టైంలోనూ జిల్లాకు వెళ్లలేదు. ఈ జిల్లా నుంచి మాజీ స్పీకర్ సురేశ్రెడ్డి, మాజీ మంత్రి మండవ వెంకటేశ్వర్రావు రాజ్యసభ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పటికే పార్టీ కేడర్ లో నిరాశ ఉందని, అలాంటి సమయంలో కవితకు కాకుండా వేరేవారికి రాజ్యసభ చాన్స్ ఇస్తే కేడర్కు తప్పుడు సంకేతాలు వెళ్తాయని నేతల్లో చర్చ జరుగుతోంది.2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మాజీ స్పీకర్ మధుసుదనాచారి పెద్దల సభకు వెళ్లాలని ఆశగా ఉన్నారు. ఆయన ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ కు చేరవేశారు. అయితే మధుసూదనాచారికి అవకాశం ఇవ్వొద్దని ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్తున్నట్టు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో ఇప్పటికే ఇద్దరు మంత్రులు, ఒక చీఫ్ విప్, మండలి విప్ ఉన్నారు. మరోవైపు ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్ రెడ్డి, పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి జిల్లా రాజకీయాల్లో తమ ముద్ర కోసం ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరొకరికి రాజ్యసభ సీటిస్తే మరో పవర్ సెంటర్ ఏర్పడుతుందని కొందరు నేతలు అడ్డుచెప్తున్నట్టు తెలిసింది.టీఆర్ఎస్ నుంచి ఇప్పటివరకు ఎస్సీ, ఎస్టీలకు రాజ్యసభ చాన్స్ ఇవ్వలేదు. ప్రస్తుతం బీసీలు కేకే, బడుగుల లింగయ్య యాదవ్, బండా ప్రకాశ్, డీఎస్.. ఓసీల నుంచి సంతోష్, కెప్టెన్ లక్ష్మీకాంతరావు రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. దీంతో తమకు ఈసారి అవకాశం ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ లీడర్లు కోరుతున్నారు. ఎస్సీలకు రాజ్యసభ సీటు ఇవ్వకపోతే మాదిగలు పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని ఓ నేత అభిప్రాయపడ్డారు. రాజ్యసభ సీటు కోసం ఎస్సీ వర్గం నుంచి మందా జగన్నాథం, ఎస్టీల నుంచి మాజీ ఎంపీ సీతారాం నాయక్ ప్రయత్నాలు చేస్తున్నారు.అసెంబ్లీ, లోక్సభ ఎలక్షన్లలో ఓడిన వారిని రాజ్యసభకు పంపొద్దని టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. ప్రజలు తిరస్కరించిన వారికి మళ్లీ పట్టం ఎలా కడతారని అంటున్నారు. ఓడిపోయిన బూర నర్సయ్య గౌడ్, వినోద్, కవిత, మందా జగన్నాథం, తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి, మధుసుదనాచారి తదితరులు రాజ్యసభ సీటు రేసులో ఎలా ఉంటారని ప్రశ్నిస్తున్నారు.

Related Posts