YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు వాణిజ్యం తెలంగాణ

స్మగ్లింగ్ లో ఐదో స్థానానికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్

స్మగ్లింగ్ లో ఐదో స్థానానికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్

స్మగ్లింగ్ లో ఐదో స్థానానికి శంషాబాద్ ఎయిర్ పోర్ట్
హైద్రాబాద్, ఫిబ్రవరి 19,
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పటిష్ట భద్రత దృష్టా అమెరికా, యూరోప్ దేశాలలోని విమానాశ్రయాల్లోని భద్రతా, తనిఖీ విధానాలను మార్గదర్శకంగా తీసుకున్న శంషాబాద్ ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రయాణీకుల స్వేచ్ఛకు ఎలాంటి విఘాతం కలుగకుండా బాడీ స్కానర్లను ఏర్పాటు చేశారు. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ సూచనల మేరకు ఈ స్కానర్లను అందుబాటులోకి తెచ్చినట్లు ఎయిర్ పోర్ట్ అధికారులు పేర్కొంటున్నారు. ఎయిర్‌పోర్ట్‌లోని ప్రయాణికుల తనిఖీల నిమిత్తం అధునాతన బాడీ స్కానర్లతో కేవలం మూడు సెకన్లలో పూర్తిగా తనిఖీ చేసే ఈ స్కానర్లను ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు ట్రయల్న్ పూర్తిచేశారు. ఎయిర్‌పోర్ట్‌లోని డొమెస్టిక్ టెర్మి నల్ వద్ద ఏర్పాటు చేసిన వీటిని పరిశీలించారు. ట్రయల్స్‌లో భాగంగా డిపార్చర్ గేట్ నం.3 వద్ద ఉన్న సెక్యూరిటీ చెక్ లేన్ వద్ద స్కానర్‌లను ఏర్పాటు చేశారు. ట్రయల్స్ విజయవంతమైతే సంబంధిత రెగ్యులేటరీ అనుమతుల మేరకు టెర్మినల్ అంతటా విస్తరించనున్నారు. ఇమేజ్ ఫ్రీ స్కానింగ్ టెక్నిక్ మీద పనిచేసే ఈ స్కానర్‌ల వల్ల ఎలాంటి హానీ ఉండదని, ప్రయాణికుల స్వేచ్ఛకు ఎలాంటి భంగం వాటిల్లదని ఎయిర్ పోర్ట్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రయాణికుల అనుమతితోనే వారిని స్కానింగ్ చేస్తారని అధికారులు వివరిస్తున్నారు.బంగారు స్మగ్లింగ్‌లో దేశవ్యాప్తంగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఐదవ స్థానానికి చేరుకోవడంపై డిఆర్‌ఐ, కస్టమ్స్, సిఐఎస్‌ఎఫ్ అధికారులు ఇకపై ఎయిర్ పోర్ట్‌లో ఐదంచెల తనిఖీలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈక్రమంలో బంగారం స్మగ్లింగ్ అత్యధికంగా యూనైటెడ్ అరబ్ ఎమరైట్స్ దేశాల నుంచే అధికంగా జరుగుతోందని డిఆర్‌ఐ,కస్టమ్స్, సిఐఎస్‌ఎఫ్ ఉన్నతాధికారులు గుర్తించి అడుగడుగునా తనిఖీలు చేపట్టనున్నారు. ఈ నేపథ్యంలో ఆయా దేశాల నుంచి వచ్చే విమానాలలో, ప్రయాణికులపై నిఘా అధికం చేయనున్నారు. అంతేకాకుండా శంషాబాద్ విమానాశ్రయంలో స్మగ్లింగ్‌ను నివారించేందుకు అత్యాధునిక టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఏడాదికాలంలో నమోదైన స్మగ్లింగ్ కేసుల వివరాలను పరిశీలించిన అధికారులు స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు వినూత్న నిర్ణయాలను తీసుకోనున్నారు.బంగారం, డ్రగ్స్ తరలింపు మార్గాలను గుర్తించి ఆయా ప్రదేశాలలో తనిఖీలు కట్టుదిట్టం చేయడంతో పాటు గతంలో స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడిన వారి పాస్‌పోర్ట్‌లను డిఆర్‌ఐ, కస్టమ్స్ అధికారులు సేకరించనున్నారు. స్మగ్లింగ్‌లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ముఠా ఉందా అన్ని విషయాలపై లోతుగా విచారణ జరపాలని నిర్ణయించారు. శంషాబాద్ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ నియంత్రణకు ప్రత్యేక సమావేశాలను నిర్వహించాలని కస్టమ్స్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈక్రమంలో విదేశాల నుంచి అంతర్జాతీయ సర్వీసుగా వచ్చి దేశంలోకి ప్రవేశించిన అనంతరం దేశీయ సర్వీసులుగా మారే విమానాలను ఎంచుకుని సాగుతున్న అక్రమ రవాణా సాగిస్తున్నారని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా దుబాయి, షార్జా, మలేషియా, సింగపూర్ ,మస్కట్, సౌదీ అరేబీయా తదితర దేశాల నుంచి భారత్‌లోకి ప్రవేశించే వరకు అంతర్జాతీయ సర్వీసుగా ఉండే విమానాలు దేశంలోకి రాగానే డొమెస్టిక్‌గా మారుతుండటం స్మగ్లర్లకు వరంగా మారిందన్న కోణంలో నిఘా సారించనున్నారు. విమానంలోని బాత్‌రూమ్స్‌లోని రహస్య ప్రదేశాల్లో బంగారం దాచేసి స్మగ్లర్లు విమానం దిగిపోతున్నారని, అపై బంగారం దాచిన ప్రదేశాన్ని దేశీయంగా  ప్రయాణించే తమ ముఠా సభ్యులకు సమాచారం అందిస్తున్నారని కస్టమ్స్ అధికారుల దర్యాప్తులో వెలుగు చూసింది. బంగారం స్మగ్లింగ్ ముఠాల సభ్యుల ఫోన్ నంబర్లు, వారి వాట్సప్ గ్రూపులను సేకరించడంతో పాటు వారి కదలికలపై స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చేందుకు డిఆర్‌ఐ, కస్టమ్స్, సిఐఎస్‌ఎఫ్ అధికారులు కసరత్తు ప్రారంభించారు. ఇకపై విమానాశ్రయంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి బయటకు వచ్చే దారుల్లో ఐదంచెల తనిఖీలు చేపట్టే దిశగా డిఆర్‌ఐ, కస్టమ్స్, సిఐఎస్‌ఎఫ్ అధికారులు అడుగడుగునా తనిఖీలు చేపట్టనున్నారు.

Related Posts