YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం తెలంగాణ

ప్లాట్లుగా హౌసింగ్ బోర్డు స్థలాలు

ప్లాట్లుగా హౌసింగ్ బోర్డు స్థలాలు

ప్లాట్లుగా హౌసింగ్ బోర్డు స్థలాలు
నిజామాబాద్, ఫిబ్రవరి 19,
హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములను అమ్మేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నది. దీని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని చూస్తున్నది.  రాష్ట్రవ్యాప్తంగా హౌసింగ్ బోర్డు పరిధిలో దాదాపు 871 ఎకరాల భూమి ఉంది. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోనే దాదాపు 638 ఎకరాల భూములు ఉన్నాయి. ఈ 638 ఎకరాలు అమ్మితేనే దాదాపు రూ. 30 వేల కోట్ల ఆదాయం వస్తుంది. జిల్లాలవి కూడా కలిపితే మరో రూ. 10 వేల కోట్లు వస్తుంది. ముందుగా రాజీవ్ స్వగృహ ఇండ్లను అమ్మేసి.. ఆ తర్వాత హౌసింగ్  బోర్డు భూములను వేలానికి పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు అధికార వర్గాల టాక్. రాష్ట్ర ప్రభుత్వానికి ఆశించినట్టుగా ఆదాయం రాకపోవడంతో భూముల అమ్మకంపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.హైదరాబాద్ శివారులోని కోకాపేటలో రెవెన్యూ శాఖ పరిధిలో ఉన్న దాదాపు వంద ఎకరాల భూమిని అమ్మేస్తే   రూ. 10 వేల కోట్ల ఆదాయం వస్తుందని గత ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో భాగంగా 2019––20 బడ్జెట్లో స్పెషల్  డెవలప్మెంట్ ఫండ్ ను కూడా ఏర్పాటు చేసింది. కానీ కోకాపేట భూములపై కోర్టు కేసులు పడటంతో అప్పట్లో అమ్మకం వాయిదా పడింది. ఇప్పుడు ఆ కేసులు క్లియర్ కావడంతో కోకాపేట భూములను వేలం వేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలిసింది. వీటితో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో హౌసింగ్ బోర్డు పరిధిలోని భూములను కూడా అమ్మేసి మరింత ఆదాయం రాబట్టుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.హౌసింగ్ బోర్డు పరిధిలో విలువైన భూములు ఉన్నాయి. కేవలం ఉమ్మడి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా పరిధిలోనే దాదాపు 638 ఎకరాల భూములు ఉన్నాయి. మిగతా ఉమ్మడి జిల్లాల పరిధిలో 233 ఎకరాల భూములు ఉన్నాయి. నల్గొండలో  75 ఎకరాలు, వరంగల్లో 52 ఎకరాలు ఉంటాయి.  భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు రాష్ట్రవ్యాప్తంగా భూములను సేకరించాయి. ప్రస్తుతం ఆ భూములకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. గతంలో ప్రభుత్వాలు హౌసింగ్ బోర్డు ద్వారా గృహాలు నిర్మించి, అమ్మడం ద్వారా లాభాల కంటే నష్టాలే ఎక్కువగా వచ్చాయని అధికార వర్గాలు అంటున్నాయి. ఇండ్ల నిర్మాణాల కోసం బ్యాంకుల నుంచి వందల కోట్లు అప్పులు తెచ్చి అనుకున్న టైంలో ఆ ఇండ్లను అమ్మకపోవడంతో వడ్డీల చెల్లింపులు పెద్ద సమస్యగా మారాయని ఓ ఆఫీసర్ చెప్పారు. దీంతో భూములను ప్లాట్లుగా చేసి అమ్మడం వల్ల ఎలాంటి సమస్యలు రావని,  ఆదాయం కూడా మంచిగా వస్తుందని అధికారులు అంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇదే  ప్లాన్ను అమలు చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.
 

Related Posts