వ్యాఘ్ర వాహనంపై శ్రీ కపిలేశ్వరస్వామివారి విహారం
తిరుపతి ఫిబ్రవరి 19
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజైన బుధవారం ఉదయం శ్రీకపిలేశ్వరస్వామివారు వ్యాఘ్ర వాహనంపై భక్తులకు అభయమిచ్చారు. వాహనసేవ ఆలయం నుండి మొదలై కపిలతీర్థం రోడ్, అన్నారావు సర్కిల్, వినాయకనగర్ ఎల్ టైప్ క్వార్టర్స్, హరేరామ హరేకృష్ణ ఆలయం, ఎన్‌జిఓ కాలనీ, అలిపిరి బైపాస్ రోడ్ మీదుగా తిరిగి ఆలయానికి చేరుకుంది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు ఆకట్టుకున్నాయి. భక్తి వ్యాఘ్రం వంటిది. భక్తితో ఏ జీవుడి హృదయం శివునికి వేదికవుతుందో ఆ జీవుడి క్రూరపాపకర్మలు, మదమోహ, మాత్సర్యాదులు సంహరింపబడుతాయి. శాస్త్రోక్తంగా స్నపనతిరుమంజనం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజూ ఉదయం 9 నుండి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం(పవిత్రస్నానం) వైభవంగా జరుగుతోంది. కంకణభట్టార్ శ్రీ మణిస్వామి ఆధ్వర్యంలో ఈ క్రతువు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీ సోమస్కందమూర్తి, శ్రీ కామాక్షి అమ్మవారికి ఛత్రం, చామరాలు, అద్దం, సూర్యచంద్రులు, విసనకర్ర, ధ్వజంతో ఉపచారాలు చేశారు. ముఖ ప్రక్షాళన, ధూపదీప నైవేద్యం చేపట్టారు. అర్ఘ్యపాద నివేదనలో భాగంగా క్షీర(పాలు), దధి(పెరుగు), మది(తేనె), నారికేళం(కొబ్బరినీళ్లు), హరిత్రోదకం(పసుపు), గంధోధకం(గంధం), పన్నీరు, విభూదితో స్నపనం నిర్వహించారు. దీపారాధనలో భాగంగా రథహారతి, నక్షత్రహారతి, సద్యజాతాది దీపారాధన, కుంభహారతి నిర్వహించారు. ఆ తరువాత అదేవిధంగా రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణవేదాల్లోని మంత్రాలను
పఠించారు.