ఛిధ్రమవుతున్న పర్యావరణం
విశాఖపట్టణం, ఫిబ్రవరి 20,
దశాబ్దాలుగా నీడనిస్తున్న చెట్లను నరకొద్దని స్థానికులు వారిస్తున్నా విద్యుత్ సిబ్బంది మెయింటెనెన్స్ పేరుతో అడ్డగోలుగా నరికేస్తున్నారు. హరిత విశాఖను నిర్మించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నా.. తమకేమీ పట్టదన్నట్లుగా ఈపీడీసీఎల్ సిబ్బంది ఇష్టం వచ్చినట్లు నగరంలోని చెట్లను నరికేస్తున్నారు.ఓవైపు పచ్చదనాన్ని పెంచి.. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించేందుకు మహా విశాఖ నగర పాలక సంస్థ విశ్వ ప్రయత్నాలు చేస్తుంటే.. మరోవైపు ఈపీడీసీఎల్ ఇలా పర్యావరణాన్ని ఛిద్రం చేస్తుండటంపై జీవీఎంసీ అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై మూడేళ్లుగా ఈపీడీసీఎల్ ఇంజినీరింగ్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నా ఫలితం శూన్యమనే చెప్పాలి. 2017 నుంచి ఈ విషయంలో జీవీఎంసీతో సమన్వయం చేసుకొని పనిచేయాలని అప్పటి కమిషనర్ హరినారాయణన్ విద్యుత్ అధికారులకు పలుమార్లు లేఖలు రాశారు. గత ఏడాది ఆగస్టులో ప్రస్తుత కమిషనర్ సృజన సైతం అధికారులకు విజ్ఞప్తి చేశారు. హుద్‌హుద్ విలయంతో విశాఖలో పచ్చదనం 23 శాతం నుంచి 14 శాతానికి పడిపోయిందనీ.. ఇప్పుడిప్పుడే దాన్ని పెంచే ప్రయత్నాలు చేస్తున్నామంటూ అధికారులకు వివరించినా ఫలితం లేకపోయిందని జీవీఎంసీ ఉద్యానవన విభాగం అధికారులు వాపోతున్నారు.పర్యావరణ పరిరక్షణకు 2002లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన వాల్టా చట్టంపై అదే ప్రభుత్వ సంస్థలు గొడ్డలి వేటు వేస్తున్నాయి. వాల్టా చట్టం సెక్షన్–2 ప్రకారం నగరాలు, పట్టణాల్లో స్థానిక సంస్థలు మొక్కలు నాటాలి. ఉన్న వాటిని సంరక్షించాలి. కానీ ఆ సెక్షన్లను కాలరాస్తూ దశాబ్దాలుగా నీడనిస్తూ.. పర్యావరణాన్ని కాపాడుతున్న భారీ వృక్షాలను నరికేస్తున్నారు. విద్యుత్, టెలికాం, రహదారులు – భవనాలు వంటి శాఖలు విధి నిర్వహణ పేరుతో చెట్లు, వాటి కొమ్మలను ఇష్టారాజ్యంగా నరికేయకూడదు. ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలకైనా అనుమతి తప్పనిసరంటూ వాల్టా చట్టంలోని సెక్షన్–29 చెబుతోంది. ఒక చెట్టును కొట్టాల్సి వస్తే.. దానికి ప్రత్యామ్నాయంగా రెండు మొక్కలు నాటాల్సి ఉంది. వాటి సంరక్షణకు అవసరమైన ఖర్చును సంబంధిత శాఖలు ముందుగానే చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇవేమీ పట్టించుకోకుండా ఎవరికి నచ్చినట్లు వారు పర్యావరణాన్ని విచ్ఛిన్నం చేసేస్తున్నారు. ఇటీవలే జీవీఎంసీ జోన్–3 పరిధిలో దుకాణానికి అడ్డంగా ఉందని చెట్టును నరికేయడంతో సదరు షాపును అధికారులు సీజ్ చేశారు. కానీ ప్రభుత్వ సంస్థ విషయంలో మాత్రం జీవీఎంసీ ఆ తరహా సాహసం చేయలేకపోతోంది. అయితే గతంలో ఇదే తరహాలో చెట్లను నరికివేయడాన్ని సహించలేకపోయిన జీవీఎంసీ అధికారులు.. నరికేసిన కొమ్మలను ఈపీడీసీఎల్ కార్యాలయాల్లోనే పడేశారు. అయినా వారిలో మార్పు రావట్లేదని జోనల్ అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సమన్వయంతో మెయింటెనెన్స్ పనులు చేపడితే.. పర్యావరణానికి విఘాతం కలగకుండా నిర్వహించవచ్చని జీవీఎంసీ అధికారులు చెబుతున్నారు.చెట్లు పెరిగి.. వాటి కొమ్మలు విద్యుత్ తీగలను తాకితే ప్రమాదాలు సంభవిస్తాయనే ఉద్దేశంతో ఏటా మూడు నాలుగుసార్లు ఈపీడీసీఎల్ అధికారులు మెయింటెనెన్స్ పనులు చేపడుతున్నారు. కరెంటు తీగలకు తగులుతున్న చెట్ల కొమ్మలను గుర్తించి వాటిని కత్తిరించాలి. వాస్తవంగా అయితే.. కరెంట్ తీగలకు 6 నుంచి 10 అడుగుల దిగువ వరకు కొమ్మలను నరికాలి. కానీ నగరంలో మాత్రం నేల నుంచి 3–5 అడుగుల వరకు ఉంచి.. మిగిలిన చెట్టు కొమ్మలన్నింటినీ నరికేస్తున్నారు. దీంతో ఏపుగా పెరిగి పచ్చదనంతో కళకళలాడిన చెట్లన్నీ మోడులవుతున్నాయి.