ఏపీలో ఏసీబీ టెన్షన్
విజయవాడ, ఫిబ్రవరి 20,
ఏపీ లో ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏసీబీ దడపట్టుకుంది. ఏ ప్రభుత్వ కార్యాలయంపై అవినీతి శాఖాధికారులు ఎప్పుడు దాడులు చేస్తారో తెలియడం లేదు. రాష్ట్రం లో ఏసీబీ పనితీరుపై ముఖ్యమంత్రి జగన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన తరువాత ఆ డిపార్ట్ మెంట్ ఒక్కసారిగా యాక్టివ్ అయ్యింది. అనంతపురం మొదలుకొని శ్రీకాకుళం వరకు ఏసీబీ జరుపుతున్న దాడులతో ఇప్పుడు అవినీతిపరుల గుండెల్లో రైళ్ళు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా మునిసిపల్ కార్యాలయాలు టార్గెట్ గా ఈ దాడులు తీవ్రం అయ్యాయి.ఐదేళ్ళలో చంద్రబాబు సర్కార్ అవినీతి గేట్లు ఎత్తేసిందన్న విమర్శలు వున్నాయి. వారిపై అరకొర దాడులు తప్ప చేసిందేమి లేదనే అంటారు. ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా చెయ్యి తడపందే పని జరిగేదే లేదు. మరీ ముఖ్యంగా మునిసిపల్ శాఖలోని టౌన్ ప్లానింగ్ విభాగంలోని అవినీతికి అంతు పొంతూ లేకుండా అవినీతి సాగుతూ వచ్చింది. కార్పొరేటర్ స్థాయి నుంచి మంత్రుల వరకు ఇష్టారాజ్యంగా వ్యవహారం నడిచేదన్నది బహిరంగ రహస్యం. అయితే జగన్ సర్కార్ రాబోయే మునిసిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పాత విధానానికి చెరమగీతం పాడాలని నిర్ణయించింది. అందులో భాగంగా ఏసీబీ అస్త్రాన్ని బయటకు తీసి కొరడా జుళిపిస్తుంది. పారదర్శకంగా తమ ప్రభుత్వం ఉందని అవినీతి సర్కార్ అనే ముద్ర చెరుపుకునేందుకు జగన్ పై వున్న మచ్చలు తుడిచేందుకు సర్కార్ గట్టి ప్రయత్నాలే చేస్తుంది.ప్రస్తుతం ఏపీలోని కడప, ఒంగోలు, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కదిరి ప్రాంతాల్లోని కార్పొరేషన్ లు, మునిసిపాలిటీలపై తాజాగా ఏసీబీ దాడులు చేపట్టింది. ఈ దాడులు ప్రధానంగా టౌన్ ప్లానింగ్ పై జరగడం గమనార్హం. ఈ దెబ్బతో మునిసిపల్ శాఖలో ఉన్న ఉద్యోగుల్లో దడ మొదలైంది. ఇప్పటికే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లోని పెద్ద చేపలను ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో ఏసీబీ దాడులు జరిపి నిందితుల్ని కటకటాల వెనక్కి పంపింది. ఇదే దూకుడు మరికొన్నాళ్లు సాగితే నెమ్మదిగా మార్పు తధ్యమని చర్చ మొదలైంది.