YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

ప్రజాచైతన్య యాత్రతో  ఉత్సాహం

ప్రజాచైతన్య యాత్రతో  ఉత్సాహం

ప్రజాచైతన్య యాత్రతో  ఉత్సాహం
ఒంగోలు, ఫిబ్రవరి 20
తెలుగుదేశం పార్టీ ప్రజా చైతన్య యాత్రలు తొలి రోజు… ఊహించిన దాని కంటే ఎక్కువ సక్సెస్ కావడం.. ఆ పార్టీ నేతల్ని సంతోష పరుస్తోంది. కొత్త ప్రభుత్వంపై పోరాటానికి ప్రజల నుంచి ఇంత మద్దతు వస్తుందని.. టీడీపీ నేతలు ఊహించలేకపోయారు. ప్రభుత్వంపై గూడుకట్టుకున్న అసంతృప్తి బయట పడుతోందని అంటున్నారు. ప్రభుత్వంపై సమరభేరి మోగిస్తూ..తొమ్మిది నెలల పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రజాచైతన్యయాత్ర చేపట్టారు ప్రతిపక్షనేత ఎన్నికల్లో ఘోరపరాజయం తర్వాత టీడీపీ శ్రేణులు డీలా పడ్డాయి. స్థానిక ఎన్నికల కారణంగా… గ్రామ స్థాయిలో టీడీపీ నేతలు తీవ్ర ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. కేసుల పేరుతో బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు పర్యటన ఎలా సాగుతుందో.. అని టీడీపీ నేతలు కాస్త ఆందోళనకు గురయ్యారు. కానీ.. చంద్రబాబు పర్యటన ప్రారంభమైన కాసేపటికే.. ఆ ఆందోళన పటాపంచలైంది. ప్రకాశం జిల్లాకు వెళ్లే దారిలో ప్రతీ చోటా.. పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికారు.ప్రజా చైతన్య యాత్రల పేరిట ప్రజల్లోకి వెళ్లేందుకు సంకల్పించింది. దీని ఫలితం సంగతి పక్కనపెడితే అసలు ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లేందుకు అనువైన వాతావరణం ఉందా? అనే సందేహాలున్నాయి. ఇందులోని రాజకీయ కోణాలు ప్రస్తావనకు వస్తున్నాయి. సార్వత్రిక ఎన్నికల దెబ్బతో ఒకవైపు పార్టీ పూర్తిగా నిస్తేజమై పోయి ఉంది. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. పార్టీ శ్రేణులను సంఘటిత పరిచి ఎన్నికలకు సమాయత్తం చేయాలి. వైసీపీని దీటుగా ఎదుర్కొనేందుకు సిద్ధం చేయాలి. ఇది పార్టీ పరంగా టీడీపీకి అత్యంత అవసరమైన లక్ష్యం. వైసీపీపై ప్రజల్లో అక్కడక్కడ కనిపిస్తున్న వ్యతిరేకతను పెంచి పెద్దది చేసేలా ప్రచారం నిర్వహించి ప్రభుత్వ వ్యతిరేకతకు వేదికను కల్పించాలి. తద్వారా రాజకీయంగా బలపడాలి. ఇది టీడీపికి రెండో లక్ష్యం. చైతన్య యాత్రలను స్థూలంగా చూస్తే ఈ రెండు కోణాలు కనిపిస్తాయి. అయితే అందుకు అనువైన సమయం ఆసన్నమైందా? అన్నదే రాజకీయంగా ఎదురయ్యే ప్రశ్న.వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది పూర్తి కాలేదు. పూర్తిగా పరిపాలనపై పట్టు సాధించకుండానే అనేక వివాదాస్పద నిర్ణయాల్లో కూరుకునిపోయిన మాట వాస్తవమే. అయితే విధానపరమైన నిర్ణయాలను ఏడాదిలోపుగానే పూర్తి చేసి, మిగిలిన పదవీకాలంలో వాటిని అమల్లోకి తీసుకురావడం ప్రాధాన్యంగా పెట్టుకోవాలనేది ముఖ్యమంత్రి జగన్ వైఖరిగా ఆ పార్టీ పెద్దలు చెబుతున్నారు. పరిపాలన పరంగా చూస్తే ఇది ఉపయోగకరమైన ధోరణిగానే కనిపిస్తుంది. కానీ తొందరగా అజెండా పూర్తి చేయాలనే హడావిడిలో తడబాట్లు కనిపిస్తున్నాయి. దీనివల్ల అనేకసార్లు ప్రతిపక్షానికి రాజకీయ విమర్శలకు అవకాశం కలుగుతోంది. అనేక సందర్భాల్లో సాధ్యాసాధ్యాలు , లాభనష్టాలు బేరీజు వేసుకోకుండా ప్రకటనలు చేయడం కూడా ప్రభుత్వ ప్రతిష్ఠను దెబ్బతీస్తోంది. ఏదేమైనా సర్కారు ఇంకా బాలారిష్టాలను ఎదుర్కొంటోంది. పక్కాగా ఒక పద్ధతి ప్రకారం పనిచేసుకుని పోయేందుకు ఇంకొంత సమయం పట్టవచ్చు. ఈలోపుగానే ప్రతిపక్షాలు విరుచుకుపడుతున్నాయి. రాజకీయంగా వచ్చే ఆయుధాలను ఏ పార్టీ వదులుకోదు. ఈ తొమ్మిది నెలల కాలంలో అయిదారు అంశాలు తీవ్రమైన ప్రభావం కలిగినవిగా భావించి టీడీపీ ప్రజాచైతన్య యాత్రకు శ్రీకారం చుట్టింది.వైసీపీ సర్కారుకు సంక్షేమమే మొదటి ప్రాధాన్యం. ఇందులో మరోమాటకు తావు లేదు. పార్టీ మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలు, పాదయాత్రలో ఇచ్చిన హామీలకు అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తోంది. మౌలిక వసతుల ప్రాజెక్టులను సైతం పునస్సమీక్ష పేరిట పక్కనపెట్టి సంక్షేమ పథకాలకు నిధులను సర్దుబాటు చేశారు. ముఖ్యంగా అమ్మ ఒడి పథకానికి ఆరువేల కోట్ల రూపాయలు సమకూర్చడానికి వివిధ శాఖల నుంచి నిధుల సమీకరణ పెద్ద ఎత్తున సాగింది. ప్రజలకు నేరుగా వ్యక్తిగత లబ్ధి చేకూర్చే సంక్షేమ పథకాలే ఈ ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలుగా వైసీపీ భావిస్తోంది. వీటిపై నేరుగా దాడి చేసేందుకు ప్రతిపక్షాలకు పెద్దగా ముడిసరుకు లేదు. స్కీముల అమలులో కొన్ని లోపాలున్నప్పటికీ సంక్షేమం వద్దని ఏ పార్టీ చెప్పలేదు కాబట్టి వాటి జోలికి వెళ్లడం లేదు. రేషన్ కార్డుల తొలగింపు, పింఛన్ల క్రమబద్ధీకరణ వంటివి సరైన పద్ధతిలో చేస్తే ప్రజలకు ఉపయోగకరమే. ప్రభుత్వ ఖజానాకు కూడా మంచిది. రాజకీయంగా విమర్శలు వచ్చినప్పటికీ అర్హులకే అసలైన లబ్ధి చేకూరాలనే విషయంలో కఠినంగా ఉండటమే మేలు.ఇసుక పాలసీలో మార్పులు, మద్యనియంత్రణ చర్యలు , రాజధానులు ఈ మూడు అంశాల్లో వైసీపీ సర్కారు కుదుపునకు గురవుతోంది. ఇసుక పై కొత్త విధానం అమల్లోకి తెచ్చినప్పటికీ ఇంకా కొరత వెన్నాడుతున్నట్లు క్షేత్రస్థాయిలో వైసీపీ వర్గాలే అంగీకరిస్తున్నాయి. ముఖ్యంగా భవన నిర్మాణ రంగం ఇంకా పుంజుకోలేదు. లక్షలాదిమంది జీవనోపాధిపై ప్రత్యక్షంగా, పరోక్షంగా దీని ప్రభావం పడుతోంది. మద్యం విక్రయాల సమయాలు క్రమబద్ధీకరించడం, రేట్లు పెంచడం సరైన చర్యగానే తొలుత భావించారు. అయితే బార్లలో, షాపుల్లో విక్రయించే మద్యం రేట్లు వేర్వేరుగా ఉండటంతో కొన్ని చోట్ల షాపుల మద్యం బార్లకు తరలిపోతోందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడక్కడా బెల్టు షాపులకు కూడా ఆస్కారం ఏర్పడుతోందని చెబుతున్నారు. పైపెచ్చు గిరిజన ప్రాంతాల్లో నాటుసారా మళ్లీ విజృంభించేందుకు అవకాశాలు కలుగుతున్నాయంటున్నారు. వీటిని ప్రభుత్వం వెంటనే పరిశీలించి నిఘా పెంచాలి. మద్యం సొమ్ము రుచి మరిగితే అక్రమార్కులు చెలరేగిపోవడమే కాదు, ప్రభుత్వానికే సవాల్ విసురుతారు. ఇది ప్రభుత్వంతోపాటు పార్టీలు కూడా గమనించాల్సిన అంశం. ఎందుకంటే గ్రామగ్రామాన విస్తరించిన కార్యకర్తలు పార్టీలకు ఉంటారు. రాజకీయ పార్టీలు విధానపరమైన అంశాల్లో లోపాలను పట్టుకుంటే ప్రజలకు ప్రయోజనం సమకూరుతుంది. ప్రతిపక్షంగా టీడీపీ ప్రజల్లోకి వెళ్లడం తప్పుకాదు. అది రాజకీయ అవసరమే కాదు, అధ్యయనానికి కూడా తోడ్పడుతుంది. అయితే పూర్తిగా రాజకీయాలకే పరిమితం కాకుండా ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసేందుకు, ప్రజల్లో నిజమైన చైతన్యం రగిలేందుకు తమ పర్యటనలు, ప్రచారాన్ని వినియోగించుకుంటే సహజంగానే పార్టీకి కూడా మేలు చేకూరుతుంది.

Related Posts