.ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే రాష్ట్రం విడిచి పెట్టి వెళ్లిపోవాలి
కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలకు విద్యా శాఖ మంత్రి హుకూం జారీ
అమరావతి,ఫిబ్రవరి 20,
ఆంధ్రప్రదేశ్ లో నడుస్తున్నది ప్రభుత్వమూ లేక ముఠా నాయకుల శిబిరమో అర్ధం కాక అక్కడి కార్పొరేట్ విద్యా సంస్థలు తల్లడిల్లి పోతున్నాయి. ఇప్పటికే అమరావతిని, ఐటి పరిశ్రమను, రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని తరిమి కొట్టిన ఆంధ్రప్రదేశ్ నాయకులు ఇప్పుడు విద్యా రంగంపై పడ్డారు.తాజాగాఆంధ్రప్రదేశ్ లోని కార్పొరేట్ కాలేజీ యాజమాన్యాలు ప్రభుత్వ విధానాలు నచ్చకపోతే రాష్ట్రం విడిచి పెట్టి వెళ్లిపోవాలని సాక్షాత్తూ ఆ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ హుకూం జారీ చేశారు. సాధారణంగా ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా అధికారులు అయినా ప్రభుత్వ నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం అని హెచ్చరిస్తారు.అయితే ఆంధ్రప్రదేశ్ మంత్రులు మాత్రం రాష్ట్రం వదిలిపెట్టి పోవాల్సిందేనని చెబుతున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇంటర్ అడ్మిషన్లు ఆన్ లైన్ లోనే జరుగుతాయని అందులో 25 శాతం సీట్లు బడుగు వర్గాలకు కేటాయించాలని చెబుతూ ఈ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నవారు రాష్ట్రం వదిలిపెట్టి పోవాలని మంత్రి హుకూం జారీ చేశారు.నిన్న విజయవాడ సిద్ధార్ధకాలేజీలో ప్రయివేటు, కార్పొరేటు కాలేజీల యాజమాన్యాలతో మంత్రి సమావేశం నిర్వహించారు. విద్యాసంస్థల యాజమాన్యాలతో జరిపిన సమావేశంలో ఈ హెచ్చరిక జారీ చేయడంతో వివిధ విద్యా సంస్థల యాజమాన్యాలు ఆంధ్రా వదిలిపెట్టి వెళ్లేందుకు సిద్ధపడుతున్నాయి.తెలంగాణ లోని ఆంధ్రా బోర్డర్లలో భవనాలు నిర్మించుకోవడానికి లేదా అక్కడ పెద్ద భవనాలు అనువైన స్థలం ఉంటే అద్దెకు తీసుకోవాలని వెతుకులాట మొదలు పెట్టాయి. తమ విద్యార్ధులను తెలంగాణ కు తరలించి తెలంగాణ ఇంటర్ బోర్డులో అడ్మిషన్లు తీసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాయి.తెలంగాణ భూ భాగంలో ఆంధ్రా బోర్డర్ లో కాలేజీలు పెట్టి ఆంధ్రా విద్యార్ధులను చేర్చుకుంటారు. అక్కడ నుంచి ఆంధ్ర ప్రాంతానికి బస్సులు నడుపుతారు. అలా కాకపోతే తెలంగాణ భూ భాగంలోనే అధునాతన హాస్టళ్లు నిర్మించుకోవాలని ప్లానింగ్ చేస్తున్నారు. ఆంధ్ర ప్రాంతంలో ఇక కాలేజీలు నడిపేందుకు వీలు ఉండకపోవచ్చునని వారు అనుకుంటున్నారు. తెలంగాణ భూభాగంలో కాలేజీలు ఏర్పాటు చేసి ఆంధ్ర ఏరియాలో కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటున్నారు. హాస్టళ్లలో ఉండలేని విద్యార్ధులకు ఈ కోచింగ్ సెంటర్లు ఉపయోగపడేలా ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు.