YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆరోగ్యం విదేశీయం

కరోనా వైరస్ మృతులపై అనుమానాలు

కరోనా వైరస్ మృతులపై అనుమానాలు

కరోనా వైరస్ మృతులపై అనుమానాలు
ముంబై, ఫిబ్రవరి 20 
కరోనా వైరస్ మరణాలు, బాధితుల విషయంలో చైనా వెల్లడిస్తున్న వివరాలపై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. చైనా అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం గతవారం రోజులుగా బాధితులతోపాటు మృతుల సంఖ్య తగ్గుముఖం పట్టింది. మంగళవారం 1,700 కొత్త కేసులు గుర్తించగా, బుధవారం నాడు కేవలం 349 కేసులే నమోదయినట్టు తెలిపింది. అయితే, ఇంత హఠాత్తుగా బాధితుల సంఖ్య తగ్గడంపై చైనా ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కానీ, కొత్తగా విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. అనుమానితులు, నిర్ధారించిన కేసులు వేర్వేరుగా పేర్కొవాలని సూచించింది. వారం రోజుల నుంచి హుబే ప్రావిన్సుల్లోని కరోనా వైరస్ నిర్దారణ పరీక్షల్లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. సీటీ స్కాన్ లేదా న్యూక్లియర్ యాసిడ్ టెస్ట్ ద్వారా బాధితులను నిర్ధారిస్తున్నారు. ఫిబ్రవరి 13న ఒక్క రోజే 15,000 మందిలో కొత్తగా కరోనా వైరస్ సోకినట్టు గుర్తించడంతో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఆ తర్వాత రోజే దీనిని సవరిస్తూ చైనా ప్రభుత్వం మరో ప్రకటన వెలువరించింది.న్యూక్లియిక్ యాసిడ్ పరీక్షల ఆధారంగా కరోనా వైరస్‌ను ధ్రువీకరించిన వారికి సీటీ ఇమేజింగ్ స్కాన్‌ పరీక్షలు నిర్వహించడం వల్లే బాధితుల లెక్కల్లో తేడాలు వచ్చినట్టు తెలిపింది. కాగా, బాధితుల సంఖ్య 70వేలు దాటడం, 2వేల మందికిపైగా మృతిచెందడంతో మరోసారి లెక్కింపుపై చైనా అధికారులు పునఃపరిశీలన చేసినట్టు తెలుస్తోంది.ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ బాధితులు, మృతుల సంఖ్య భారీగా ఉండటంతో చైనా అధికారిక సమాచారంపై అపనమ్మకం పెరుగుతోంది. అంతేకాదు, వైరస్ వ్యాప్తి అదుపులోకి వస్తోందనే ప్రకటనలు ఉద్దేశపూర్వకంగా చేస్తున్నట్టు అనుమానం వ్యక్తమవుతోంది. బాధితుల వివరాలపై గణాంకాలు గందరగోళానికి గురిచేస్తున్నాయని, అసలు సంఖ్యపై విశ్వసనీయత కోల్పోతున్నామని సింగ్‌పూర్‌కి చెందిన మార్కెటింగ్ విశ్లేషకుడు జెఫ్రీ హాలే వ్యాఖ్యాంచారు. అంతర్జాతీయంగా చైనాకు ఎదురువుతున్న ఇబ్బందుల కారణంగా వైరస్ బాధితుల సంఖ్య గణనీయంగా తగ్గుతున్నట్టు చూపడం శుభపరిణామం కాదని అన్నారు.కరోనా వైరస్ చైనా ఆర్ధిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపింది. ఆర్ధిక వ్యవస్థకు వెన్నుముకగా ఉన్న పలు విభాగాలు మూతబడ్డాయి. రిటైల్ నుంచి విమానయానం వరకు అన్ని పరిశ్రమలను సంక్షోభంలోకి నెట్టివేసింది. దీంతో చైనా పాలకులు వైరస్ వ్యాప్తి విషయంలో ఆశావాదాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించారు. పరిశ్రమలు, సంస్థలను తిరిగి ప్రారంభించాలని, వైరస్ విషయంలో భయపడాల్సిన అవసరం లేదని చైనా కీలక నేత లీ కీకియాంగ్ సోమవారం పేర్కొన్నారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో పరిశ్రమలు ప్రారంభించడానికి యాజమాన్యం అంతగా సముఖత వ్యక్తం చేయడంలేదు. ఈ నేపథ్యంలో పాలకులు వారిపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు.

Related Posts