ఏజెన్సీ లో మారని ఆరోగ్యం ఆ ఏజెన్సీ గ్రామాల్లో శిశుమరణాలు
రాజమండ్రి, ఫిబ్రవరి 21 కాకినాడ, ఫిబ్రవరి 20,
తూర్పు గోదావరి జిల్లా ఏజన్సీలో శిశుమరణాల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతూనే ఉంది. అనారోగ్యంతో బాధపడుతున్న శిశువులకు సరైన వైద్య సహాయం అందకే ఎక్కువమంది మరణిస్తున్నారు. నాలుగు నెలలుగా మండలంలో మరణించిన శిశువుల సంఖ్య 20కి చేరుకుంది. కాగా వారం రోజుల వ్యవధిలోనే మండలంలో ఇరువురు శిశువులు, ఒక బాలింత మరణించారు. ఎక్కువ శిశుమరణాలు మారుమూలన ఉన్న లోదొడ్డి పంచాయతీలోనే కేశవరం, పూదేడు, పాకవెల్తి, లోదొడ్డి గ్రామాల నుండే సంభవించడం గిరిజనులను కలవరపరుస్తోంది. వైద్యపరంగా ఎంతో అభివృద్ధి చెందుతున్న నెల రోజుల వయస్సున్న బిడ్డలను వైద్యులు కాపాడలేకపోతున్నారనేది నగ్నసత్యం. ఈ ప్రాంతంలో జన్మించిన బిడ్డలను ప్రత్యేక వైద్య సహాయం అందించేందుకు ఇప్పటి వరకు సరైన ప్రణాళికను ఉన్నతాధికారులు చేపట్టకపోడం గర్భవతుల్లో ఉన్న రక్తహీనతే శిశువుల అనారోగ్యానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. మండలంలో కేశవరం గ్రామానికి చెందిన గిరిజన మహిళ గోము బుజ్జమ్మకు చెందిన మూడు నెలల ఆడ శిశువు శ్వాసకోశ వ్యాధితో బాధపడుతూ కాకినాడ జనరల్ ఆసుపత్రికి అంబులెన్సులో తరలించారు ఆ శిశువుకు ఆసుపత్రిలో వైద్యులు రాత్రి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న సమయంలోనే ప్రాణాలు విడిచింది.జిల్లా కలెక్టర్ తోపాటు పలువురు అధికారులు తరచు ఏజన్సీలో పర్యటిస్తున్నా ఈ మరణాలు తగ్గకపోడం విచారించాల్సిన విషయం. ముక్కు పచ్చలారని, నిండునూరేళ్లు జీవించాల్సిన చిన్నారులు నెలల వయస్సులోనే కన్నుమూయడం మన్యం వాసులను కలచివేస్తోంది. చిన్న పిల్లల స్పెషలిస్టులు, గర్భకోశ వ్యాధి నిపుణుల కొరత మన్యాన్ని వేధిస్తోంది. కనీసం ఈ మరణాలు ఎక్కువగా ఉన్న జడ్డంగి, రాజవొమ్మంగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిపుణులైన వైద్యులను నియమించాల్సిన అవసరం ఎంతైనావుంది. వ్యాధులు సోకిన బిడ్డలకు, తల్లులకు స్థానికంగా వైద్య సహాయం లేకపోడం, వంద కిలోమీటర్లు పైనే ఉన్న కాకినాడకు వెళ్లడం నిరుపేదలైన గిరిజనులకు చాలా కష్టమైపోతోందనే చెప్పాలి. వైద్య నిపుణులను నియమిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చి నాలుగు నెలలైనా నేటికీ ఫలితం కనిపించలేదు. ఉన్నతాధికారులు తగు చర్యలు చేపట్టనంతకాలం శిశు మరణాలు తగ్గే అవకాశం లేదని స్పష్టంగా చెప్పవచ్చు. తమ బిడ్డల పరిస్థితి ఎలా ఉంటుందోనని పసి బిడ్డల్ని కన్న బాలింతలు ఆందోళనతో తల్లడిల్లిపోతున్నారు.