YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

జన్మానికో శివరాత్రి – మహాశివరాత్రి* 

జన్మానికో శివరాత్రి – మహాశివరాత్రి* 

జన్మానికో శివరాత్రి – మహాశివరాత్రి* 
ప్రతి సంవత్సరం మాఘమాసంలో వచ్చే 'మహాశివరాత్రి' పర్వదినానికే ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. శివరాత్రి వ్రతంలో ఇమిడి ఉన్న ఎన్నో ఆధ్యాత్మికమైన మరియు పౌరాణికపరమైన అంశాలు ఉన్నాయి. శివరాత్రి అంటే శివునకు ప్రీతిరకమైన రోజు అని, మాఘమాసం, కృష్ణపక్షంలో 14వ రోజున వచ్చె శివరాత్రి, శివపూజ గురించి ఎన్నో పురాణేతిహాసాలు సూచించాయి. సంవత్సరమంతయూ శివపూజ వేయుట వలన ఏ ఫలమును పొందెదమో, అంతటి ఫలముని శివరాత్రినాడు శివార్చనవలన పొందగలము. లింగరూప శివార్చనచే సాలోక్య, సామిప్య, సారూప్య, సర్ష్టి, సాయుజ్యమను పంచక్రియల ఫలము లభించును. సృష్టి, స్థితి, సంహార, తిరోభావ, అనుగ్రహాలను ఐదు జగత్కార్యములు శివునకు సిద్ధములు. భూమియందు సృష్టి, నీటియందు స్థితి, అగ్నియందు సంహారము, వాయువునందు తిరోభావము, ఆకాశమునందు గ్రహము కలవు. మానవ శరీరము పంచభూతాత్మకము. ఆ పంచభూతాత్మకమగు శక్తిననుసరించియే ఈశ్వరుడు ప్రపంచమును నడుపుచున్నాడు. అందుచేతనే పరమాత్మునెన్నడును విడిచి పోరాదు. 'నా రుద్రో రుద్రమర్చయేత్' అనగా రుద్రుడు కాకుండా రుద్రుని అర్చింపరాదని, సోహం భావముతో శివార్చన చేయాలని అది శంకరాచార్యులు సెలవిచ్చిన విషయాన్ని మరువరాదు.
శివాకృతి – చిహ్నం
శివుడు అంటే మంగళస్వరూపుడు. సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపమే. సర్వవ్యాపకుడు, సర్వమునకు మూలకారణమైనవాడు శివుడు. శివునకు భిన్నమైనదేదీ లేదు. శివుణ్ణి నిరాకారిగాను, సాకారిగాను ఆరాధిస్తారు. శివుని అర్చామూర్తియే లింగము. లింగము అంటే చిహ్నం.
లింగరూపధారియగు ఈశ్వరునియందు కోట్ల బ్రహ్మాండ గోళకములు పరమాణువులవలె విలీనమై పోవుచున్నవి. సగుణోపాసన నుండి నిర్గుణోపాసన వైపు మరల్చుటకు చేసే ఆకార, నిరాకార రూపం శివలింగం. త్రిశూలం సత్వరజస్తమో గుణాలకు ప్రతిరూపమైతే, డమరుకం శబ్ద బ్రహ్మ స్వరూపం. శిరస్సున ధరించిన నెలవంక మనోనిగ్రహానికి, గంగాదేవి శాశ్వతత్వానికి, దేహంపై ధరించిన సర్వరూపాలు భగవంతునిలోని జీవాలుగా, భస్మం పరిశుద్ధతకి, ధరించిన ఏనుగు చర్మం అహంకారాన్ని త్యజించటానికి, ఆసనంపై గల పులి చర్మం కోరికలకు దూరంగా ఉండమని, శివుడు పట్టుకున్న నాలుగు జింకా కాళ్ళు నాలుగు వేదాలని సూచిస్తున్నాయి. సత్సాంగత్యానికి నందీశ్వరుడు, ధర్మ దేవతగా ఎద్దు, మూడవనేత్రం జ్ఞానానికి ప్రతిరూపాలు. మనం నిర్వర్తించే అభిషేకం మోక్షప్రాప్తికి, అయన పాదాల ముందుంచిన పంచామృతాలు పంచ జ్ఞానేంద్రియాల నివేదన. తనని తాను అర్పణగావించుకొనుటలో సాష్టాంగం. తనలోని అహాన్ని త్యజించడానికి ఆరతి. ఆత్మనివేదన లేక జీవాత్మ పరమాత్మలో లీనం కావడం. చివరగా శివతాండవం శక్తిస్వరూపానికి, ఆనంద పారవశ్యానికి ప్రతిరూపాలు.
శివరాత్రినాడు చేయవలసిన విధులు
1.  ఉపవాసం - భక్తి లేకుండా నిరాహారంగా రోజు గడిపివేస్తే అది ఉపవాసం కాదు. జీవాత్మను పరమాత్మ సన్నిధిలోకి తీసుకుని వెళ్ళాలి. అంటే, మన మనస్సు, మాట, చేష్టలు ఆ పరమశివుని కోసమే ఉండాలి. మనస్సులో మరో భావనకు చోటులేకుండా, జీవాత్మ పరమాత్మల ఐక్యవాసమే ఉపవాసం.
2.  జాగరణం - బాహ్యంగా పరమశివుడు మహావిషాన్ని సేవించిన రోజు శివరాత్రి. విషం మ్రింగి నిదురపోతే శరీరమంతా త్వరగా వ్యాపించి, సమస్త భువన మండలాలకు వ్యాపిచి, ప్రళయం సంభవిస్తుంది. అందువలన భక్తులందరు శివస్తుతులతో ఆ పరమ శివుణ్ణి మేలుకొనేటట్లుగా చేసిన, సమస్త లోకాలకు మేలు చేకూరుతుంది. అంతర్గతంగా శివభక్తి సాధనలో మోక్షాన్ని సాధించాలంటే మనో-బుద్ధి-అహంకార-చిత్తములనే అంతఃకరణల్ని శివభావాత్మకాలుగా జాగృతం చేసి, జీవ చైతన్యాన్ని విశ్వ చైతన్యంతో ఐక్యం చెయ్యాలి. అంటే, కామ-క్రోధాది అరిషడ్వర్గ బంధనాలనుంచి 'జీవాహంత'ను విడిపించి, 'విశ్వ అహంత' అయిన శివతత్వంలోనికి ఐక్యం చెయ్యటమే జాగరణ.
3.  అభిషేకం - పరమేశ్వర జ్యోతిర్లింగం అర్ధరాత్రి సమయంలో సంభవించిందని పురాణాలు చెబుతున్నవి. అందుచేతనే అర్ధరాత్రి సమయంలో అభిషేకవిధిని నిర్వహిస్తారు. పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు.
రుద్రం, మహారుద్రం, లఘురుద్రం, అతి రుద్రంలో తేడాలు ఉన్నాయి. యజుర్వేదంలోని మంత్రభాగమైన 11 అనువాకాల 'శతరుద్రీయా'నికి 'రుద్రం' అని పేరు. దానికి ఒకసారి పఠిస్తూ చేసే అభిషేకం రద్రాభిషేకం అంటారు. దానికి 'రుద్రం', 'ఏకరుద్రం' అని పేర్లు కూడా ఉన్నాయి. ఈ 11 అనువాకాల 'రుద్రం' పదకొండుసార్లు చెబుతూ చేస్తే 'ఏకాదశ రుద్రాభిషేకం' లేదా 'రుద్రి' అంటారు. రుద్రాన్ని 121 సార్లు పఠిస్తూ చేసే అభిషేకం 'లఘురుద్రాభిషేకం'. 11 లఘురుద్రాలు ఒక 'మహారుద్రం' అంటే, ఈ అభిషేకంలో రుద్రం (మొత్తం 116 అనువాకాలు) 1331 సార్లు పఠించబడుతుంది. ఈ మహారుద్రాలు పదకొండయితే 'అతిరుద్రం', దీనిలో 14641 మారులు రుద్రం చెప్పబడుతుంది. ఈ రుద్రమంత్రాలను అభిషేకానికి వాడితే 'రుద్రాభిషేకం' హోమంలో వినియోగిస్తే 'రుద్రయాగం'. ఈ అభిషేక తీర్థాన్ని భక్తితో గ్రహించటం ద్వారా జీవాత్మను ఆశ్రయించి ఉన్న సమస్త మాయాదోషాలు తొలగి, జీవుడు మరమాత్మలోనికి ఐక్యం చెందుతాడు.
శివ నిర్మాల్యం స్వీకరించవచ్చా లేదా?
శివ నైవేద్యం కంటితో చూస్తే చాలు పాపాలన్నీ దూరమవుతాయి, స్వీకరిస్తే చాలు, అనేక కోట్ల పుణ్యాలు మానవు
నికి సంప్రాప్తమవుతాయి. శివ నైవేద్యాన్ని భక్తితో స్వీకరించి శివ స్మరణ చేస్తుబక్షించాలి.
నర్మదా బాణలింగం (సాలగ్రామ లింగము), ధాతు లింగం (పాదరస లింగము, పాషాణ లింగము, వెండి లింగము, బంగారు లింగము),  పురాణ ప్రసిద్ధి లింగం (దేవతలచేత, సిద్ధులచేత ప్రతిష్ఠించబడిన లింగము), స్వయంభూ లింగం, కుంకుమ పువ్వులతో నిర్మించిన లింగము, స్ఫటిక లింగము, రత్నమయ లింగం, మరియు ద్వాదశ జ్యోతిర్లింగాలకు సమర్పించబడిన నైవేద్యమును లేక నిర్మాల్యాన్ని స్వీకరించినచో చాంద్రాయణ వ్రతాన్ని ఆచరించిన ఫలితం సంప్రాప్తమవుతుంది, పాపాలు తక్షణమే తొలిగిపోతాయి మరియు బ్రహ్మహత్యా పాతకం కూడా నశిస్తుంది అంతే కాకుండా చండీశ్వరునికి వీటిపై ఎట్టి అధికారము లేదు. మిగతా శివలింగములందు శివలింగాలపై ఉంచిన వస్తువులను వదిలివేసి లింగమునకు దూరంగా ఉంచబడిన ఏ వస్తువునైన ప్రసాదంగా స్వీకరించవచ్చు. నిషిద్ధములైన శివ నిర్మాల్యమును కూడా సాలగ్రామ శిలాస్పర్శ చేసి పవిత్రమైన వాటిగా గ్రహించవచ్చునని శాస్త్రం చెబుతున్నది.
శివరాత్రి వ్రతం మరియు శివ తత్వం.
శివం అంటే ప్రపంచమంతా వ్యాప్తి చెంది, మార్పులేని, కష్టాలను తొలగించి, అజ్ఞాంధకారాలను పోగొట్టి, ఆనందాన్ని ప్రసాదించే తత్వం. శివతత్వం అనంతం. శివుడు అనేకరూపాలలో వివిధ ఆకారాలలో స్థుతింపబడుతూ ఉంటాడు. ఈశ్వరుడు సగుణాకారుడని, నిర్గుణ నిరాకారుడైన బ్రహ్మమని వేదం చెబుతోంది. శివతత్వం వర్ణింపనలవికానిది. అయినప్పటికీ, ఇది మానవకోటియొక్క పాపాల భారాన్ని తొలగించి, జీవన సమరంలో కొట్టుమిట్టాడుతున్న సమాజానికి ఊరట కలిగించే పరతత్వం.
సకల శాస్త్రాలకు నిలయమైన ఈశ్వరుడే విశ్వపరిపాలకుడు, శంభు, మయోభు, మయస్కర, రుద్రా, శివ, శివతర, శంకర అని యజుర్వేద వాక్యం (ఈశానః సర్వ విద్యానాం ఈశ్వరః సర్వభూతానం....) శివతత్వం మానవ మేధస్సుకు అందని విషయం.
శివరాత్రిలో రాత్రికి గల విశిష్టత - రాత్రి అనే పదానికి మూలం 'రా', అనగా శాంతిని, సౌఖ్యాన్ని కలిగించేది లేక ఇచ్చేదని అని అర్థం.
ఆధ్యాత్మిక చింతనతో పంచభూతాత్మకమైన ఈ శరీరాన్ని అంటిపెట్టుకునే కలవరపాట్లు, భ్రమ, భ్రాంతి వదిలి పెట్టి కైవల్య ప్రాప్తికి సాధకుడు చేసే ప్రయత్నమే 'శివరాత్రి జాగరణ'. వక్రమార్గంలో నడిచే మనసును అదుపులో ఉంచుకొని, మనసులో అంతర్లీనమైన పరమాత్మ తత్వాన్ని మేలు కొల్పడమే ఉద్దేశ్యం. బహిర్ముఖ వృత్తి నుండి అనగా భౌతికమైన ప్రాపంచిక సుఖాలనుండి పంచేంద్రియాలను అదుపులో ఉండేలా నిగ్రహమైన మనసుతో 'అంతర్ముఖ' సాధనకై నిర్వర్తించే ప్రవృత్తి, అనగా ఆధ్యాత్మిక పరంగా ఆత్మనివేదన గావించడమే నిజమైన శివరాత్రినాడు చేసే ఉపవాస దీక్ష.
అమావాస్య అంటే అర్థం - అమ - యుగప్తుః వాస - కలిసి ఉండడం. ఖగోళ శాస్త్రం ప్రకారం, సూర్య-చంద్రులు కలిసి ఉండడం. ఆధ్యాత్మిక పరంగా సూర్య-చంద్రులు పరమాత్మ-జీవాత్మల రూపాలు. వేదాంత శాస్త్రంలో అమావాస్య అంటే సమాధి యోగస్థితి. ఇక్కడ జీవాత్మ పరమాత్మలో లీనం చెందడం. కృష్ణచతుర్థశి నాడు జీవాత్మ పరమాత్మలో లీనమయి, అద్వైతానుభూతిలో సమాధి చెంది ఏకత్వం సిద్ధించే రోజే శివోపాశనకి శుభముహూర్తం. అదే 'నిత్య, శుద్ధ, బుద్ధ, ముక్త, సచ్చిదానంద మూలస్వరూపం'.
పురాణేతిహాసాలు.
స్కాందపురాణం ప్రకారం పవిత్ర స్నానాలు, శుచిగా ఉండుట, ధూపసంస్కారం, పుష్పాలతో పూజ గావించుట, చివరకు ఉపవాస దీక్షలు శివునికి తృప్తి కలిగించేవి కావు.
ఈశ్వర సంహితలో శివరాత్రి పర్వదినాన్ని విస్మరించి, శివారాధన లేక శివునికి కాకుండా విష్ణువును గాని, లేక మరేదేవతను పూజించినప్పటికి ఫలితం శూన్యం.
విష్ణువుకి, శివునకు మధ్యం బేధం లేదని, నేనెక్కడ ఉంటే శివుడు అక్కడ ఉంటాడని విష్ణువు, విష్ణువు ఎక్కడ ఉంటే నేను అక్కడేనని శివుడు అంటారు. భూదేవిని ప్రార్థిస్తూ శివారాధన చేసినవారు, విష్ణువును కూడా పూజించినట్లేనని వారాహావతారమెత్తిన విష్ణుమూర్తి సూచించాడు.ఇంకా భక్తులు నన్ను కేశవుడు, శివుడు, దేవి, అంబిక అనే నామాలతో పిలుస్తారని వరాహమూర్తి అంటాడు. నారాయణుని పూజించినా, మోక్ష ప్రాప్తిని పొందినా సరే శివ ద్వేషం పనికిరాదు.
సమాజంలో అన్ని వర్గాలవారు చేయదగినది 'శివరాత్రి వ్రతం'. రాత్రి సమయంలో నాలుగు భాగాలలో అభిషేకంతో శివారాధన జరగాలి. రాత్రి తోలి జాములో క్షీరాభిషేకంతోను, రెండవజాములో దధి అభిషేకంతోను, మూడవజాములో నేతితోను, నాల్గవజాములో తేనెతోను శివాభిషేకం జరిపించాలని 'సంవత్సర ప్రదీప' లో సూచించారు. రాత్రి నాలుగు భాగాలలో, మొదటి జాములో శివుడు 'ఈశానుడు'గాను, రెండవ జాములో 'అఘోరుడు'గాను, మూడవ జాములో 'వామదేవుడు'గాను, నాల్గవ జాములో 'సద్యోజాత'గాను ఆరాధింపబడతాడు.
పూజా క్రమంలో గౌతమ మహాముని కొన్ని నియమాలను సూచించారు. పూజలు, దేవతా కార్యక్రమాలను రాత్రి సమయంలో ఉత్తరాభిముఖంగా నిర్వర్తించాలి. కాని 'శివారాధన' అన్ని వేళలా ఉత్తరాభిముఖంగానే నిర్వర్తించాలని నిర్దేశించారు. పంచముఖ లింగాకృతిలో ప్రధానముఖం తూర్పుదిశను సూచిస్తున్నట్లు ప్రతిష్థించాలని సూచిస్తుంది లింగపురాణం. శివపూజ విధానంలో ఫాలభాగంపై మూడు విభూది రేఖలు, మెడలో రుద్రాక్షమాల ధరించకుండా చేసిన శివపూజ నిష్ప్రయోజనం అని నందిపురాణంలో వివరించబడింది. శివారాధనలో సైకత లింగాన్ని పూజించడం అత్యుత్తమం. సైకత లింగారాధనతో పుత్ర, పౌత్ర, ధన, ధాన్య, వస్తు సంపదలతోబాటు దీర్ఘాయుష్షు సిద్ధిస్తుందని విజ్ఞుల అభిప్రాయం.ఆయా పదార్థాలతో చేసిన లింగాకృతులను బట్టి ఫలసృతులు వేర్వేరుగా ఉంటాయి. శివలింగాన్ని ఇసుకతో, హోమభస్మంతో, ఆవుపేడతో, రాగి, ఇత్తడి లోహాలతో రూపొందించవచ్చు. లింగాక్రుతి ప్రమాణంగా సాధారణ మనిషి బొటనవ్రేలు ఊర్ధ్వభాగం కన్నా తక్కువగను ఒక 'అక్ష' అనగా 16 ధాన్యపు గించల బరువుకన్నా తక్కువుగాను ఉండరాదని 'భవిష్యపురాణం' సూచిస్తోంది. దారిద్ర దుఃఖ నాశిని అయిన బిల్వపత్రాలతో పూజ పరమేశ్వరునకు ఎంతో ప్రీతి. మరే ఇతర పదార్థాలు లేకున్నపటికీ, మారేడుదళాలతో శివుని ఆరాధిస్తే ఎంతగానో ప్రసన్నుడవుతాడని పురాణాలలో సూచించారు. మూడు ఆకులు కలిగి ఉన్న బిల్వపత్రం అడుగుభాగం శివలింగాన్ని స్ప్రుశించేలా అలంకరించాలని స్కాందపురాణం సూచిస్తోంది.నిశ్చలమైన దృష్ఠితో శివాలయానికి మూడు పర్యాయాలు ప్రదక్షిణ, అభిషేక జలాన్ని స్ప్రుశించకుండా తొలుత సమరీతిగాను, తిరుగు ప్రయాణంలో అసమరీతిలోను చేయాలని దేవీపురాణం సూచిస్తుంది. శివారాధనలో సాష్టాంగ దండ ప్రణామం చేయుట వలన సకల కోరికలు సిద్ధిస్తాయి. పరమశివునకు అర్పించిన పుష్ప, పత్రాలను భక్తి ప్రపత్తులతో శిరమున ధరించినవారు సకల పాపముల నుండి విముక్తులవుతారు. ప్రతి సంత్సరం శివరాత్రి వ్రతాన్ని స్త్రీ-పురుషులు ఇరివురు 24 సంవత్సరాలు నిర్వహించిన వారి కోరికలు నెరవేరుతాయని 'పద్మ పురాణం'లో చెప్పబడింది. మనసులో కోరికలు లేకుండా భక్తులు శివరాత్రి పర్వదినాన ఆరాధించాలని 'లింగపురాణం' సూచిస్తోంది. ప్రాతఃకాల సమయంలో స్నానాదికాలు ముగించుకొని నిష్ఠతో నిత్యకర్మలనాచరించి, ఉపవాస దీక్షతో, శివ మంత్రోచ్ఛారణతో 'పార్థివలింగాన్ని' (మట్టితో చేసిన శివలింగం) ఆరాధించడం శ్రేష్ఠం. శివపూజ నిర్వహణలో ముఖ్య ఘట్టాన్ని 'దేవీ పురాణం'లో వివరించారు. ఉపవాస దీక్షతో పాటు ఏకాగ్రత, స్నానం, జపం, శివ సంబంధమైన పురాణ-ప్రవచనాలు వినడం, మొదలైన నియమాలను నిర్దేశించారు. శివ పంచాక్షరీ జపం తప్పనిసరి.
అష్టమూర్తులు
శివుడు లేక రుద్రుడు సర్వ భూత స్వరూపుడు. అయన స్థాన విశేషాలు:
(1) రుద్రుడు – సూర్యుడు. చరాచర జగత్తు యొక్క పుట్టుటకు కారణభూతుడు.
(2) భవుడు - నీరు. సర్వ సృష్టి, సమస్త లోకములు జలమునందే ప్రతిష్ఠితమైనవి. ఈ జగత్తంతా నీటిలోని నావలాగా తేలియాడుతున్నది.జలము పవిత్రము మరియు ప్రాణాధారము అయిన భవత్స్వరూపము.
(3) శివుడు - భూమి. సమస్త ప్రాణి నివాసమునకు ఆధారము.
(4) పశుపతి - అగ్ని. సమస్త ప్రాణికోటి యందు జఠరాగ్ని రూపంలో ప్రకాశిస్తూ భుజించిన ఆహారాన్ని జీర్ణం చేస్తూ ఉంటాడు.
(5) ఈశ్వరుడు - పంచభూతములలోని వాయువు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సామాన అను ఐదు వాయు రూపాలతో ప్రాణుల శరీరములోపల ఉండి జీవరాశిని బ్రతికిస్తూ ఉంటాడు.
(6) భీముడు - ఆకాశము. ప్రాణుల శరీరములోని రంధ్రములు అను ఆకాశములో వ్యాపించి ఉంటాడు.
(7) ఉగ్రుడు - యజ్ఞదీక్షితుడైన యజమాని. యజమాని యజ్ఞమును పరిపూర్తిగా నిర్వర్తించి, సమస్త దేవతలను తద్వారా సర్వాంతర్యామి అయిన భగవంతుని తృప్తి పరుచును.
(8) మహాదేవుడు - చంద్రుడు. ఓషధులకు అధిపతి అయి (అన్నదాత అయి) ఓషధులను (సస్యములను) అభివృద్ధి చేయును.
శివుని అష్టమూరి తత్వము ఎరిగిన వారేభగవద్విలాసమును తెలిసినవారంటారు జ్ఞానులు.
శివుని పంచ ముఖాలు
1. సద్యోజాతం
2. వామనం
3. తత్పురుషం
4. అఘోరం
5. ఈశానం
ఈ పంచముఖ శివుని ఆకృతి కాశీ క్షేత్రమున విశ్వనాధుని గర్భాలయము ఎదురుగా నొక కుడ్యముపై రూపొందించబడినది.

Related Posts