పృథివీ మీద శివ లింగముల రకములు, వాటి ఫలితాలు - శ్రీ శివ మహా పురాణం ఆధారంగా సంకలనం .
1. స్వయం భూలింగము మొదటిది.
2. బిందులింగము రెండవది.
3. ప్రతిష్ఠిత లింగము మూడవది.
4. చర లింగము నాల్గవది.
5. గురులింగము అయదవది.
స్వయంభూ లింగములు :
శివుడు దేవతల, ఋషుల తపస్సునకు మెచ్చి, వారికి తన సాన్నిధ్యము నీయ తలంచి, పృథివిలోపల నాదరూపములో నున్నవాడై చెట్లు యొక్క బీజము భూమిని భేదించి అంకురించిన తీరున, ప్రకటమగును. ఇట్లు తనంత తానుగా ప్రకటమైన లింగమునకు స్వయంభూలింగమని పేరు. అట్టి లింగమును పూజించిన వానికి జ్ఞానము తనంత తానుగా వర్థిల్లును.
బంగరురేకుపై గాని, వెండిరేకుపై గాని, భూమియందు గాని, వేది యందు గాని శుద్ధమగు ప్రణవమంత్ర రూపములో నున్న లింగమును సాధకుడు తన చేతులతో వ్రాసి దాని యందు శివుని ప్రతిష్ఠించి, ఆవాహన చేయవలెను.
బిందు, నాదలింగములు :
బిందు లింగ, నాదలింగములు స్థిర, చర భేదముతో నుండును. వాటి యందు శివుని దర్శించుట భావనారూపము మాత్రమే అనుటలో సందియము లేదు.
సాధకునకు ఏ లింగము నందు శ్రద్ధ ఉండునో, ఆ రూపముగనే శివుడు ఫలము నిచ్చును. భక్తుడు తన చేతులతో లిఖించిన యంత్రము నందు, కృత్రిమముగాని వృక్షాదుల యందు శివుని ఆవాహన చేసి షోడశోపచారములతో పూజించవలెను. అట్లు చేసిన భక్తుడు తాను ఈశ్వరత్వమును పొందును. పునః పునః పూజించిన భక్తుడు జ్ఞానమును పొందును.
పౌరుష, ప్రాకృత, ప్రతిష్ఠిత లింగములు :
దేవతలచే, మరియు ఋషులచే ఆత్మ సిద్ధి కొరకు మంత్రపూర్వకముగా పవిత్రమగు మండలము నందు తమ చేతులతో పవిత్రమగు మనస్సుతో స్థాపింపబడిన శ్రేష్ఠలింగమునకు పౌరుష లింగమనియు, ప్రతిష్ఠిత లింగమనియు పేరు.
ఆ లింగమును నిత్యము పూజించినచో, పౌరుషైశ్వర్యము లభించును. మహాత్మలగు బ్రాహ్మణులచే, మరియు సుసంపన్నులగు రాజులచే సమంత్రకముగా స్థాపింపబడిన శిల్పి నిర్మిత లింగము ప్రతిష్ఠిత లింగమనియు, ప్రాకృతలింగమనియు అనబడును. అట్టి లింగమును పూజించినచో, ప్రాకృతైశ్వర్యము, భోగములు లభించును. బలమైనది, నిత్యమైనది పౌరుషమన బడును. బలము లేనిది, అనిత్యమైనది ప్రాకృతమనబడును.
ఆధ్యాత్మిక, చర లింగములు :
నాభి, జిహ్వా, నాసికాగ్రము, శిఖా అను క్రమములో కటి, హృదయము, శిరస్సు అను మూడు స్థానములలో భావన చేయబడిన లింగము ఆధ్యాత్మిక లింగంమనియు, చర లింగమనియు చెప్పబడును.
సహజ లింగములు :
పర్వతము పౌరుష లింగమనియు, భూతలము ప్రాకృత లింగమనియు, వృక్షాదులు పౌరుష లింగమ లనియు, గుల్మాదులు ప్రాకృత లింగములనియు తక్కువ నాణ్యము గల ధాన్యము ప్రాకృత మనియు, విలువైన ధాన్యము, గోధుమలు పౌరుషమనియు తెలియవలెను.
అణిమా మొదగలు అష్టసిద్ధులనిచ్చు ఐశ్వర్యము పౌరషమనియు భార్య, ధనము మొదలగు ఐశ్వర్యము ప్రాకృతమనియు ఆస్తికులు చెప్పుచున్నారు.
చర లింగములలో రసలింగము శ్రేష్ఠమని చెప్పబడినది.
రసలింగము పూజించిన బ్రాహ్మణులకు కోర్కెలనన్నిటినీ ఈడేర్చును.
మంగళకరమగు బాణలింగము క్షత్రియులకు సామ్రాజ్యము నిచ్చును.
బంగరు లింగము వైశ్యులకు గొప్పధనమును ఇచ్చును. మంగళకరమగు రాతి లింగము శూద్రులకు గొప్ప పవిత్రత కల్గించును.
స్ఫటికముతో చేసిన బాణలింగము అందరికీ అన్ని కోర్కెలను ఇచ్చును. భక్తుడు తన వద్ద లింగము లేనిచో ఇతరుల లింగమును పూజించుట నిషేదము కాదు.
భర్త గల స్త్రీలకు మట్టితో చేసిన లింగము మిక్కిలి ప్రశస్తము. ప్రవృత్తి మార్గములో నున్న భర్తృహీనలకు స్ఫటికలింగము శ్రేష్ఠము.