రూల్స్ మేకర్లే... బ్రేకర్లు..
హైద్రాబాద్, ఫిబ్రవరి 22, (న్యూస్ పల్స్)
మినిస్టర్ల కార్లు రూల్స్ను యథేచ్ఛగా బ్రేక్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతున్నాయి. కొందరి కార్లపై 2 నుంచి 6 చలాన్లు ఉన్నాయి. అవి నెలల తరబడి పెండింగ్‌లోనే ఉండిపోతున్నాయి. ఇవన్నీ ఓవర్ స్పీడ్ చలాన్లే. రాష్ట్రంలో సగం కంటే ఎక్కువ మంది మంత్రుల బండ్లపై చలానాలు ఉన్నాయి. ఒక్కొక్కరికి 2 నుంచి 6 వరకు ఉన్నాయి. ఇవన్నీ ఐజీ ఇంటెలిజెన్స్ తెలంగాణ పేరుతో ఉన్నాయి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి కారుపై అత్యధికంగా 9 చలానాలతో 9,315 జరిమానా ఉంది. అయితే ఈ వెహికల్ను జగదీశ్ ఉపయోగించడం లేదని తెలుస్తోంది. వైద్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ కారుపై 6 చలానాలతో 6,210 ఫైన్ ఉంది. ఎస్సీ, మైనార్టీ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సొంత వాహనంపై 5 చలానాలతో రూ.5,175 ఫైన్ పెండింగ్లో ఉంది. సబితా ఇంద్రారెడ్డి సొంత వాహనంపై 5 చలానాలతో 2,775 జరిమానా ఉంది. పువ్వాడ అజయ్ వాహనంపై కూడా మూడు పెండింగ్ చలానాలు ఉన్నాయి. గంగుల కమలాకర్ కార్లపై మూడు, శ్రీనివాస్‌గౌడ్ సొంత వాహనంపై రెండు, సత్యవతి రాథోడ్, వేముల ప్రశాంత్ రెడ్డి కార్లపై ఒక్కోటి చొప్పున పెండింగ్ చలానాలు ఉన్నాయి.కొందరు ప్రజాప్రతినిధులు ఉపయోగించే వెహికల్స్పైనా చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. వీరు ఉపయోగించే కార్లు కొన్ని కంపెనీల పేరు మీద రిజిస్టర్ అయి ఉండగా, మరికొన్ని కుటుంబ సభ్యుల పేర్ల మీద ఉన్నాయి. రూల్స్కు విరుద్ధంగా నంబర్ ప్లేట్ వాడటంతోపాటు, పరిమితికి మించిన వేగంతో కారు వెళ్లడంతో ఎక్కువగా చలానాలు నమోదయ్యాయి. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి తన ఆఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలు ప్రకారం నాలుగు చలానాలు పెండింగ్‌లో ఉన్నాయి. రూ.3,405 జరిమానా చెల్లించాల్సి ఉంది. ఈ వాహనం దీపికారెడ్డి పేరు మీద ఉంది. సబితా ఇంద్రారెడ్డి వాహనం నంబర్ ప్లేట్‌పై జరిమానాలు ఉన్నాయి.ఈ మధ్య రాష్ట్ర మంత్రులు వాహనాలు, కాన్వాయ్‌లకు తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఓవర్ స్పీడ్‌తో వెళ్తుండటంతో బండ్లు అదుపు తప్పుతున్నట్లు ఎక్స్పర్టులు చెబుతున్నారు. ఇటీవల పంచాయతీ రాజ్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు వాహనం అదుపు తప్పడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాన్వాయ్‌కి కూడా ప్రమాదం జరిగింది. గతంలో ఈటల రాజేందర్ కాన్వాయ్‌లో ఓ వెహికల్ బోల్తా పడింది.