శ్రీలంక-బంగ్లాదేశ్-జింబాబ్వే మధ్య ఢాకాలో జరుగుతున్న ముక్కోణపు కప్‌లో బంగ్లాదేశ్ చేతిలో శ్రీలంక చిత్తుచిత్తుగా ఓడింది. శుక్రవారం ఈ రెండు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్, ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ దెబ్బకు నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. 102 బంతులు ఎదుర్కొన్న తమీమ్ 7 ఫోర్లు, రెండు సిక్సర్లతో 84 పరుగులు చేశాడు. షకీబల్ హసన్ 67, ముష్పికర్ రహీం 62 పరుగులతో రాణించడంతో ప్రత్యర్థి శ్రీలంక ఎదుట 321 పరుగుల భారీ విజయ లక్ష్యాన్ని ఉంచింది. భారీ లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాట్స్‌మెన్ బోల్తా పడ్డారు. 32.2 ఓవర్లలో 157 పరుగులకే ఆలౌటయ్యారు. ఫలితంగా 163 పరుగుల భారీ తేడాతో బంగ్లాదేశ్ విజయం సాధించింది. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌లలో థిసారా పెరీరా చేసిన 29 పరుగులే అత్యధిక కావడం గమనార్హం. ఇటీవలి కాలంలో తమకు ఇదే అతిపెద్ద విజయమని బంగ్లాదేశ్ కెప్టెన్ మష్రాఫ్ మోర్తాజా పేర్కొన్నాడు. తమీమ్ సెంచరీ చేస్తాడని భావించానన్నాడు. షకీబల్ హసన్ కూడా బాగానే ఆడాడని ప్రశంసించాడు. 67 పరుగులు చేసి, మూడు వికెట్లు తీసిన షకీబల్ హసన్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. కాగా, అంతకుముందు జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లోనూ శ్రీలంక 12 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.