ఆక్రమణలలో ఫుట్ పాత్ లు
హైద్రాబాద్, ఫిబ్రవరి 24,
మహానగరంలో పాదచారుల సౌకర్యార్థం ఆశించిన స్థాయిలో ఫుట్‌పాత్‌లు లేవు. ఉన్న చోట అవి ఎక్కువగా అక్రమ వినియోగానికి గురవుతున్నట్లు ఓ ప్రైవేటు సంస్థలో వెల్లడైంది. దీంతో బల్దియా దిద్దుబాటు చర్యలకు సిద్దమవుతోంది. 625 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కల్గిన నగరంలో సుమారు 6వేల కిలోమీటర్ల పొడువున సీసీ రోడ్లు, మరో మూడు వేల కిలోమీటర్ల పొడువున బీటీ రోడ్లు ఉన్నా, పాదచారుల కోసం కనీసం 300 కిలోమీటర్ల మేరకు కూడా ఫుట్‌పాత్ అందుబాటులో లేదు. పాదచారుల సౌకర్యార్థం, ఉదయం నగరవాసులు వాకింగ్ చేసేలా ఫుట్‌పాత్‌లను ఏర్పాటు చేయాలన్న సర్కారు ఆదేశాల మేరకు జీహెచ్‌ఎంసీ ఫుట్‌పాత్‌లపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. ముఖ్యంగా ఎక్కువ వెడల్పుతో ఫుట్‌పాత్‌లు ఉన్న రోడ్డులో వాహానాలు, పాదచారుల రాకపోకలు వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని అవసరమైన చోట వెడల్పు పెంచటం, లేక కుదించటం వంటి చర్యలు చేపట్టాలని జీహెచ్‌ఎంసీ యోచిస్తోంది.మహానగరంలో ఫుట్‌పాత్‌లు ఎందుకు అందుబాటులో లేవు, ఉన్న చోట ఎంత వరకు వాటిని పాదచారులు సద్వినియోగం చేసుకుంటున్నారన్న అంశంపై ఇటీవలే ఓ ప్రైవేటు సంస్థ హైటెక్‌సిటీ జంక్షన్‌లో సర్వే నిర్వహించింది. నగరంలోని కొన్ని రోడ్లలో మూడు, నాలుగు లేన్లు ఉన్నా, వాహానాలు సక్రమంగా రాకపోకలు సాగించటం లేదని, ఇందుకు ఫుట్‌పాత్‌పై నడవాల్సిన పాదచారులు అవి లేకపోవటంతో రోడ్లపై నడవటం ఒక కారణంగా కాగా, మరికొన్ని చోట్ల ఫుట్‌పాత్‌లు తక్కువ వెడల్పుతో అందుబాటులో ఉండటం, ఇంకొన్ని చోట్ల పాదచారుల సంఖ్యకు సరిపోయే స్థాయిలో ఫుట్‌పాత్‌లున్నా, వాటిపై అక్రమ పార్కింగ్‌లు, వ్యాపారాలు నిర్వహించటం వల్ల పాదచారులు వినియోగించుకోకపోవటానికి ప్రధాన కారణంగా ఆ సంస్థ గుర్తించింది. మొత్తానికి నగరంలోని రద్దీ ప్రాంతాల్లోని రోడ్లలో ఏర్పాటు చేసిన లేన్లలోనే వాహానాలు, ఫుట్‌పాత్‌లపైనే పాదచారులు సక్రమంగా రాకపోకలు సాగించేందుకు వీలుగా చర్యలు చేపట్టనున్నారు. కొన్ని రద్దీ ప్రాంతాల్లోని రోడ్లు కేవలం రెండు లేన్లుగా ఉండటం, అక్కడ ఫుట్‌పాత్‌లు ఎక్కువ వెడల్పుతో ఉన్నట్లు ఆ సంస్థ గుర్తించింది. ఇలాంటి ప్రాంతాల్లో ఫుట్‌పాత్ వెడల్పును ఇరువైపులా తగ్గించి, రోడ్డుపై మరో లేన్‌ను ఏర్పాటు చేయగలిగితే వాహానాలు సక్రమంగా ప్రయాణిస్తాయని ఆ సంస్థ చేసిన సిఫార్సుల మేరకు జీహెచ్‌ఎంసీ చర్యలు చేపట్టనుంది. ఇండియన్ రోడ్డు కాంగ్రెస్(ఐఆర్‌సీ) ప్రకారం కనీసం రెండున్నర అడుగుల వెడల్పుతో ఫుట్‌పాత్‌లు అందుబాటులో ఉన్న నిబంధనను పాటిస్తూ అవసరమైన చోట విస్తరించటం లేక రెండున్నర అడుగుల వెడల్పుకు కుదించేందుకు బల్దియా సిద్దమైంది. ఇక నాలుగు లేన్లున్న కొన్ని ప్రధాన రహదారిలో ఇరువైపులా రోడ్డును కుదించి, ఫుట్‌పాత్‌ను కనీసం మూడు అడుగుల వరకు అందుబాటులో ఉండేలా అధికారులు చర్యలు తీసుకోనున్నారు.