ఆంధ్ర బోర్డర్ దాటేసిన కార్పొరేట్ కాలేజీలు
హైద్రాబాద్, ఫిబ్రవరి 24
ఆంధ్రాలో ప్రధాన కార్యాలయాలతో నడుస్తున్న అనేక కార్పొరేట్ కాలేజీలు తెలంగాణకు తరలివస్తున్నాయి. ఆంధ్రాలో కాలేజీల నిర్వహణపై ప్రభుత్వం కఠిన ఆంక్షలు విధించడానికే పరిమితం కాకుండా తరచూ పర్యవేక్షణ చేయడంతో అక్కడి నిబంధనలను పాటించలేకపోతున్న కార్పొరేట్ కాలేజీలు, కార్పొరేట్ కాలేజీల అనుబంధ హాస్టళ్లు తెలంగాణకు వస్తున్నాయి. ఇప్పటికే అడ్మిషన్లు చేపట్టి, క్లాసులు నిర్వహిస్తున్న కాలేజీలు సైతం ఆంధ్రా బోర్డర్ దాటి తెలంగాణ బోర్డర్‌కు తమ కాలేజీలను మార్చుకుంటున్నాయి. పరీక్షలు ఆంధ్రాలో రాయించినా, కాలేజీలు తెలంగాణ బోర్డర్‌లో ఉండటం వల్ల తనిఖీల బెడదను తప్పించుకోవచ్చని భావిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విద్యా కమిషన్‌ను నియమించడం కమిషన్‌కు విశేష అధికారాలను అప్పగించడంతో పాటు ఫీజుల నియంత్రణ, అడ్మిషన్ అధికారాలు కూడా ఇవ్వడంతో వచ్చే విద్యాసంవత్సరం నుండి జూనియర్ కాలేజీల్లో ఆన్‌లైన్‌లోనే అడ్మిషన్లు చేపట్టాలని నిర్ణయించారు. కేవలం అడ్మిషన్లతో సరిపెట్టు కోకుండా అన్ని కాలేజీల్లో ఒకే ఫీజును అమలు చేయడం, 20 శాతం సీట్లు ప్రైవేటు విద్యాసంస్థల్లో పేదలకు ఉచితంగా ఇవ్వాలన్న సుప్రీంకోర్టు తీర్పును సైతం అమలు చేయాలని నిర్ణయించడంతో కార్పొరేట్ కాలేజీలు బెంబేలెత్తుతున్నాయి. ఇంతకాలం ఇష్టానుసారం ఎలాంటి నిబంధనలు పాటించకుండా కాలేజీలు నిర్వహించడమేగాక, ఫీజులు సైతం ఇష్టమొచ్చినట్టు వసూలు చేస్తున్న కాలేజీల యాజమాన్యాలు వచ్చే ఏడాది నుండి ఇంటర్మీడియట్‌కు సౌకర్యాలకు అనుగుణంగా కేవలం పది వేల లోపు ఫీజు మాత్రమే వసూలు చేయాల్సి వస్తే ఎలా అనే మీమాంసలో పడ్డాయి. హాస్టళ్లలో అడ్మిషన్లకు జూనియర్ కాలేజీలు 1.5 లక్షలు మొదలు మూడు లక్షల వరకూ ఫీజు వసూలు చేస్తున్నాయి. ఇక మీదట పది వేలకు పరిమితం కావాలంటే కష్టమని భావిస్తున్నాయి. నిబంధనలు ఉల్లంఘిస్తే ఇంతకాలం సాగినట్టు మున్ముందు వ్యవహారాలు సాగవని పసిగట్టిన యాజమాన్యాలు ఈ బెడద నుండి తప్పించుకునేందుకు కాలేజీలను తెలంగాణకు తరలిస్తున్నాయి. కొన్ని కాలేజీలు కేవలం క్లాసులను ఆంధ్రాలో నిర్వహించి, హాస్టళ్లను మాత్రం తెలంగాణ భూ భాగంలోకి మారుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో విధించిన ఆంక్షలనే తెలంగాణలో ప్రభుత్వం ఎందుకు అమలు చేయలేకపోతోందనే ప్రశ్న విద్యార్థి సంఘాలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల అధ్యాపకుల సంఘాలు వేస్తున్నాయి. తెలంగాణలోనూ ప్రైవేటు కాలేజీల పర్యవేక్షణపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు