లారీ కంటైనర్ సహా కోటిరూపాయలు విలువచేసే గుట్కా బస్తాలు స్వాధీనం.
చిత్తూరు ఫిబ్రవరి 24
సత్యవేడులో గుట్కా సరుకుతో అక్రమంగా తరలిపోతున్న కంటైనర్ లారిని స్థానిక పోలీసులు పట్టుకున్నారు.దీంతో భారీ స్థాయిలో గుట్కా అక్రమ వ్యాపారానికి సత్యవేడు కేంద్రంగా మారిందనే విషయం బట్టబయలయ్యాయి. వివరాలు ఇలా. జిల్లా ఎస్పీ సెంథిల్ కుమార్ ఆదేశాల మేరకు స్థానిక సిఐ బీవీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఎస్సై నాగార్జున్ రెడ్డి తమ సిబ్బందితో మండల పరిధిలోని వెంకట రాజులకండ్రిగ తనిఖీ కేంద్రం వద్ద ఆదివారం తెల్లవారుజామున వాహనాల తనిఖీ చేపట్టారు. ఇందులో భాగంగానే సత్యవేడు నుంచి వచ్చిన కారుతో పాటు కంటైనర్ లారిని పోలీసులు తనిఖీ చేశారు. దీంతో కంటైనర్ లో బస్తాలకు బస్తాలు అక్రమంగా తరలిపోతున్న గుట్కా సరుకు బయటపడింది. ఈ నేపథ్యంలో సరుకు వాహనాల డ్రైవర్లు, క్లీనర్ను అదుపులోకి తీసుకొని విచారించడంతో గుట్కా అమ్మకాలు భారీ స్థాయిలో జరుగుతున్నట్టు బయటపడింది. ఈ క్రమంలోనే సత్యవేడు పట్టణంలో ఆర్టీసీ గ్యారేజ్ రోడ్డు, గంగ మెట్ట వీధి తదితర ప్రాంతాల్లో గుట్కా సరుకును అక్రమంగా నిల్వ ఉంచిన గోదాములపై పోలీసులు దాడులు నిర్వహించి గుట్కా సరుకును స్వాధీనం చేసుకున్నారు. తదనంతరం గుట్కా గోదాములను సీజ్ చేయడం జరిగింది. అలాగే తమిళనాడు బూదూరు గ్రామంలోనూ, ఊతుకోటలోనూ నిల్వ ఉంచిన కేంద్రాలపై కూడా దాడులు నిర్వహించి సరుకును స్వాధీనం చేసుకున్నారు. మొత్తం ఐదు గుట్కా గోదాములను సీజ్ చేసినట్టు సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ బీవీ శ్రీనివాసులు పేర్కొన్నారు.ఇందుకు సంబంధించి 14 మందిలో ఏడుగురిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో సత్యవేడు కు చెందిన ముత్తు కుమార్, ముని కుమార్, తమిళనాడుకు చెందిన వెంకటేశులు, వినోద్ కుమార్, రాజు, పాల్ రాజ్, ముత్తుపాండి తదితరులు ఉన్నట్టు ఆయన వివరించారు. మిగిలిన సెంథిల్ కుమార్, ముత్తువేలు, రాము, ప్రదీప్, అంజిబాబు, కన్నన్, సెంథిల్ కుమార్ తదితరులను త్వరలో పట్టుకుంటామన్నారు.స్వాధీనం చేసుకున్న గుట్కా కంటైనర్ లారిని, కారును పోలీస్ స్టేషన్కు తరలించారు. కర్ణాటక నుంచి గుట్కా సరుకును ఇక్కడ గోదాములలో నిల్వ ఉంచుకొని పరిసర ప్రాంతాలైన నాగలాపురం, వరదయ్యపాలెం, సత్యవేడు, పిచ్చాటూరు, నెల్లూరు జిల్లా తడ, తమిళనాడు మాధరపాకం, ఊతుకోట వంటి పట్టణ ప్రాంతాల దుకాణాలకు గుట్కా అక్రమ వ్యాపారస్తులు సరఫరా చేస్తున్నట్టు సమాచారం. స్వాధీనం చేసుకున్న గుట్కా సరుకు విలువ కోటి రూపాయలు ఉంటుందని ఈ సందర్భంగా సిఐ బీవీ శ్రీనివాసులు చెప్పారు. కాగా గుట్కా వినియోగం వల్ల అనారోగ్యం పై తీవ్ర ప్రభావం చూపడంతో ప్రభుత్వం ఐదేళ్ల క్రితమే గుట్కా అమ్మకాలపై నిషేధం విధించింది. అయితే అక్రమార్కులు దీన్ని ఆసరా చేసుకుని గుట్టుచప్పుడు కాకుండా గుట్కా అమ్మకాలను కొనసాగిస్తూ జేబులు నింపుకుంటున్నారు. అయితే గతంలో పనిచేసిన పోలీస్ అధికారులు మామూళ్ల మత్తులో ఉన్న కారణంగా గుట్కా అక్రమ రవాణా, అమ్మకాలు యథేచ్ఛగా కొనసాగుతున్న అరికట్టలేక పోయారన్న ఆరోపణలు లేకపోలేదు.కానీ ప్రస్తుత సి ఐ శ్రీనివాసులు దీనిపై దృష్టి సారించడంతో గుట్కా ఆక్రమ అమ్మకాల బాగోతం బట్టబయలయ్యాయి.ఈ దాడుల్లో ఏఎస్ఐ షణ్ముఖం, హెడ్ కానిస్టేబుల్ కుమార్ స్వామి, కానిస్టేబుల్స్ దేవరాజులు, ప్రశాంత్, మురళి, మునికృష్ణ, హోంగార్డ్స్ ప్రవీణ్ కుమార్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు.