గాంధీలో విచారణకు సిద్ధం
హైద్రాబాద్,ఫిబ్రవరి 24
కొద్ది రోజులుగా సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. కొవిడ్-19 (కరోనా వైరస్) వ్యవహారంతో, ప్రత్యేక వార్డుల ఏర్పాటు విషయం నుంచి దాదాపు తరచూ ఈ ఆస్పత్రి వార్తల్లో ఉంటోంది. గాంధీలో అక్రమాలు జరుగుతున్నాయని అందులోని వైద్యుడు వసంత్ తీవ్ర వీరంగం సృష్టించిన అనంతరం ఇక్కడి వాతావరణం మరింత వేడెక్కింది. మరోవైపు, స్వైన్ ఫ్లూ లక్షణాలతో వచ్చిన వారిని జనరల్ వార్డులో పడకలు కేటాయించడం, కరోనా అనుమానితులకు పరీక్షలు నిర్వహించకుండా ఇళ్లకు పంపడం వంటి నిర్వాకాలు కూడా ప్రభుత్వాన్ని తీవ్ర అసహనానికి గురి చేశాయి.తాజాగా, గాంధీ ఆస్పత్రి గురించి గుర్తు తెలియని ఓ వ్యక్తి మీడియాకు లేఖ రాయడం కలకలం రేపుతోంది. ఏడాదిగా 20 మంది సర్జన్లు విధులకు హాజరుకావడం లేదని, అయినా సూపరింటెండెంట్ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని లేఖలో పేర్కొన్నాడు. ఇక్కడ ఇంటర్న్‌షిప్ లేకుండానే డాక్టర్స్ అవుతారని తెలిపాడు. ఆస్పత్రిలోని హౌస్ సర్జన్లు ఆస్పత్రికి డుమ్మా కొట్టేలా సహకరిస్తున్నారని.. దీంతో కష్టపడుతున్న హౌస్ సర్జన్లపై పని భారం పెరిగిపోయిందని లేఖలో వివరించాడు. త్వరలో పేర్లతో సహా మరో లేఖ పంపుతానంటూ వ్యక్తి లేఖలో పేర్కొన్నాడు. అయితే, ఈ ఆకాశరామన్న లేఖపై గాంధీ ఆస్పత్రిలో తీవ్ర చర్చ జరుగుతోంది.కొద్ది రోజుల క్రితం స్వైన్‌ఫ్లూతో గాంధీ ఆస్పత్రిలో చేరిన గర్భిణి సోమవారం మృతి చెందింది. చికిత్స జరుగుతున్న సమయంలో హఠాత్తుగా గుండెపోటు రావడంతో గర్భిణి చనిపోయిందని వైద్యులు వెల్లడించారు. ఆమె చనిపోయిన వెంటనే ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీశామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం బిడ్డ ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పారు. కరీంనగర్‌కు చెందిన షహనాజ్‌కు స్వైన్ ఫ్లూ వ్యాధి లక్షణాలు కనిపించడంతో తొలుత వరంగల్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీకి తీసుకొచ్చారు.గాంధీ వైద్యుడు డాక్టర్ వసంత్ ఆస్పత్రి ఆవరణలోనే ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో గాంధీ వ్యవహారం రచ్చకెక్కిన సంగతి తెలిసిందే. ప్రతి విభాగంలో ఆస్పత్రిలో అక్రమాలే జరుగుతున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. పెట్రోలు బాటిళ్లు చొక్కాలో ఉంచుకొని లైటర్‌తో అంటించుకొనేందుకు ప్రయత్నించారు. ఈ అక్రమాలను గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని, ఆయన చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు.డాక్టర్ వసంత్ మతిస్తిమితం లేకుండా అనవసర వ్యాఖ్యలు చేస్తున్నాడని తర్వాత గాంధీ సూపరింటెండెంట్ కొట్టిపారేశారు. ఇక్కడ ఎలాంటి అక్రమాలు జరగడం లేదని వివరణ ఇచ్చారు. వసంత్ ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమేనని శ్రావణ్ వెల్లడించారు. గాంధీలో అన్ని వ్యవస్థలు పద్ధతి ప్రకారం నడుస్తున్నాయని చెప్పారు. సిబ్బంది బయోమెట్రిక్ పక్కా ప్రణాళిక ప్రకారమే నడుస్తోందని, నాలుగు దశల్లో పరిశీలన జరుగుతుందని వివరించారు. ఇదే సమయంలో డాక్టర్ వసంత్‌కు సంబంధించిన ఫోన్ ఆడియో టేపులను బయటపెట్టడం మరో వివాదానికి దారి తీసింది. డాక్టర్ వసంత్ ఎవరో కాంట్రాక్టర్‌ను బెదిరిస్తున్నట్లుగా ఆ టేపుల్లో ఉంది.