టాలీవుడ్ టాప్ లో భీష్మ
హైద్రాబాద్, ఫిబ్రవరి 25,
నితిన్ తన దాహాన్ని తీర్చుకుంటున్నారు. ఇన్నాళ్లు దేని కోసమైతే ఆయన ఎదురుచూశారో దాన్ని ప్రేక్షకులకు కాస్త గట్టిగానే ఇస్తున్నారు. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్లోనూ ‘భీష్మ’ బాక్సాఫీసును కుమ్మేస్తున్నాడు. నితిన్ మార్కెట్‌కు మించి వసూళ్లు వస్తున్నాయి. అంతలా ఈ సినిమాతో ఆకట్టుకున్నారు నితిన్. దర్శకుడు వెంకీ కుడుముల ఒక మంచి ఎంటర్టైనర్తో ప్రేక్షకులను కట్టిపడేశారు. కామెడీతో నవ్వులు పువ్వులు పూయించారు. అందుకే, ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు.శుక్రవారం విడుదలైన ‘భీష్మ’ చిత్రం మూడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా రూ.18.80 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. తొలిరోజు మంచి కలెక్షన్లు రాబట్టిన ఈ చిత్రం, ఆ తరవాత దూసుకుపోయింది. శని, ఆదివారాల్లో కాసుల వర్షం కురిపించింది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.6.30 కోట్ల షేర్ వసూలు కాగా.. రెండు రోజుల్లో రూ.10.52 కోట్ల షేర్ రాబట్టింది. ఇక మూడు రోజుల్లో రూ. 14.80 కోట్ల షేర్ వసూలు చేసింది. ఓవర్సీస్లో కూడా కలెక్షన్లు అదిరిపోయాయి. ఇప్పటికే అక్కడ బ్రేక్ ఈవెన్ పాయింట్‌ను ‘భీష్మ’ దాటేసింది.భీష్మ’ ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో వసూలు చేసిన డిస్ట్రిబ్యూటర్ షేర్ మొత్తం రూ.18.80 కోట్లు కాగా.. ప్రాంతాల వారీగా కలెక్షన్లు ఇలా ఉన్నాయి..నైజాం - రూ. 5.92 కోట్లు, సీడెడ్ - రూ. 2.10 కోట్లు, ఉత్తరాంధ్ర - రూ. 1.78 కోట్లు, గుంటూరు - రూ. 1.35 కోట్లు, తూర్పు గోదావరి - రూ. 1.21 కోట్లు, కృష్ణా - రూ. 1.08 కోట్లు, పశ్చిమ గోదావరి - రూ. 88 లక్షలు, నెల్లూరు - రూ. 48 లక్షలు, ఏపీ/తెలంగాణ మొత్తం - రూ. 14.80 కోట్లు, రెస్టాఫ్ ఇండియా - రూ. 1.50 కోట్లు, ఓవర్సీస్ - రూ. 2.50 కోట్లు, ప్రపంచ వ్యాప్తంగా - రూ. 18.80 కోట్లు.‘భీష్మ’ బ్రేక్ ఈవెన్‌ను దాటడానికి కూతవేటు దూరంలో ఉంది. విడుదలైన అన్ని సెంటర్లలో మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 17.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ (పబ్లిషిటీ ఖర్చులతో కలుపుకుని రూ.19.10 కోట్లు) చేయగా ఇప్పటికే రూ. 14.80 కోట్లు వసూలైంది. మరో ఒకటి, రెండు రోజుల్లో బ్రేక్ ఈవెన్‌ను దాటేసి లాభాల బాట పడుతుంది. ఓవర్సీస్లో అయితే ఇప్పటికే బ్రేక్ ఈవెన్‌ను దాటేసింది. ఓవర్సీస్లో ‘భీష్మ’ థియేట్రికల్ రైట్స్‌ను రూ. 2.40 కోట్లకు విక్రయించగా ఇప్పటికే రూ.2.50 కోట్ల షేర్ వసూలైంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.23.50 కోట్లు. ప్రస్తుతానికి వసూలైన షేర్ రూ.18.80 కోట్లు. అంటే, బ్రేక్ ఈవెన్‌కు ఎంతో దూరంలో లేదు.తన సినిమా ఇంత మంచి విజయం సాధించడంతో నితిన్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.