స్కాంలతో ఈఎస్ఐకి కష్టాలు
హైద్రాబాద్, ఫిబ్రవరి 25
ఈఎస్‌ఐ ఆస్పత్రులను సమస్యలు ఇప్పట్లో వీడేలా కనిపించడం లేదు. పైపెచ్చు క్షేత్రస్థాయిలో సమస్యలపై అవగాహన లేకుండా ఉన్నతాధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు మరిన్ని సమస్యలను తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికీ ఔషధాల కొరతను తీర్చలేకపోయారు. అదే సమయంలో లబ్దిదారుల సంఖ్యకు తగినట్టు డాక్టర్లు, నర్సులు, పారామెడికల్, నాల్గవ తరగతి సిబ్బందిని పెంచకపోగా తగ్గించేలా నిర్ణయాలు తీసుకోవడం వివాదాస్పదమైంది. దీంతో ఇప్పటికే వైద్యసిబ్బంది కొరతతో కునారిల్లుతున్న డిస్పెన్సరీలు ఉత్సవ విగ్రహాలుగా మారే పరిస్థితి నెలకొన్నది. డిప్యూటేషన్ రద్దు చేసి, వెంటనే నియామకాలు చేపట్టాల్సిన అవసరమున్నది. ఏడేండ్ల క్రితం ఉన్న సిబ్బందితోనే పెరిగిన లబ్దిదారులకు సేవలందించడం సాధ్యం కావడం లేదు.తెలంగాణ రాష్ట్రావిర్భావం నాటికి 10 లక్షలలోపు ఉన్న లబ్దిదారులు ప్రస్తుతం 17 లక్షలను దాటారు. కుటుంబ సభ్యులతో కలుపుకుని దాదాపు 70 లక్షల మంది ఉన్నారు. బీమా సేవల కోసం ప్రతి నెలా తమ ఆదాయం నుంచి వాటా చెల్లిస్తున్నారు. 2940 పోస్టులు మంజూరు కాగా కేవలం 1542 మంది మాత్రమే ఉన్నారు. మిగిలిన 1398 పోస్టులు గత ఏడేండ్లుగా ఖాళీ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న సిబ్బందికి తోడు 250 మంది వరకు డాక్టర్లు, 150 మంది వరకు నర్సులు, కనీసం 20 మంది ఫార్మాసిస్టులు, ఇతర సిబ్బందిని నియమిస్తే తప్ప రోగులకు సంతృప్తికర సేవలనందించలేమని సిబ్బంది అంటున్నారు. ఈ పోస్టులు కూడా గతంలో ఉన్న లబ్దిదారుల సంఖ్య ఆధారంగా మంజూరు చేసినవే. పెరిగిన లబ్దిదారులను కూడా కలుపుకుంటే మరిన్ని పోస్టులు మంజూరు చేయాల్సి ఉంటుంది. అవసరమైన నియామకాలు చేపట్టకుండా డిప్యూటేషన్లు రద్దు చేస్తే రోగులకు ఎలాంటి ప్రయోజనం చేకూరదనే అభిప్రాయం వ్యక్త మవుతున్నది.క్షేత్రస్థాయి అవసరాలపై అవగాహనలేకుండా ఉన్నతస్థాయిలో ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలతో సమస్యలు తీరడం లేదని ఈఎస్‌ఐ జేఏసీ చైర్మెన్ డాక్టర్ చీమ శ్రీనివాస్‌రావు అభిప్రాయపడ్డారు. డిప్యూటేషన్ రద్దుతో ప్రయో జనం ఉండదనీ, తక్షణం నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. డాక్టర్లు, నర్సులు, పారామెడికల్ ఇతర సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు.