YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు నేరాలు

అసలైన నిందితులు బయటకు వచ్చేనా? 

అసలైన నిందితులు బయటకు వచ్చేనా? 

 ఆయేషా కేసు పునర్విచారణపై కీలక తీర్పు 
 మొదలు కానున్న సిట్‌ దర్యాప్తు 
 డిసెంబర్ 26, 2007 నుంచి.....ఏం జరుగుతుంది..?
 రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆయేషామీరా హత్య కేసు మరో మలుపు తిరిగింది. ఈ కేసు పునర్విచారణకు సంబంధించి కీలకమైన తీర్పును హైకోర్టు శుక్రవారం వెలువరించింది. ఈ మేరకు కేసు విచారణ తిరిగి మొదలు కానుంది. ఇది న్యాయస్థానం పర్యవేక్షణలో సాగనుంది. పదేళ్ల తర్వాత ఇది ఎలా సాగుతుందన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కేసుకు సంబంధించి గత ఏడాది మార్చి 31న హైకోర్టు తీర్పు ఇచ్చింది. పోలీసు దర్యాప్తు సక్రమంగా జరగలేదని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. దర్యాప్తు అధికారులపై శాఖాపరమైన చర్యలకు తీసుకోవాలని కోరింది. సత్యం బాబును నిర్దోషిగా తీర్పు ఇచ్చింది. దీనిపై అప్పట్లో ఎలా ముందుకు వెళ్లాలన్న విషయమై అనేక తర్జనభర్జన అనంతరం అప్పీలుకు వెళ్లకూడదని నిర్ణయించింది. కేసును తిరిగి విచారించాలని నిర్ణయం తీసుకుంది. ఆయేషామీరా తల్లిదండ్రులు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును కలిసి అసలైన దోషులను గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసును తిరిగి దర్యాప్తు జరిపించాలని వినతి పత్రంలో కోరారు. కేసును తిరిగి విచారించాలని.. అసలు నేరస్తులను పట్టుకోవాలని ఆయేషా మీరా తల్లి గత ఏడాది హైకోర్టులో పిటిషన్‌ వేశారు. అనంతరం ప్రభుత్వం సిట్‌ వేశామని కోర్టుకు ప్రభుత్వం తెలిపింది. దర్యాప్తు హైకోర్టు పర్యవేక్షణలో జరగాలని ఆయేషా తల్లి షంషాద్‌ బేగం కోరింది. దీనికి సంబంధించి ప్రభుత్వం అంగీకరించలేదు. వాదనల తర్వాత.. సిట్‌ తమ పరిధిలోనే విచారణ చేపట్టాలని కోర్టు ఆదేశించింది. ప్రస్తుత దశలో తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేయడం సవాళ్లతో కూడిన పనేనని పోలీసులు అభిప్రాయపడుతున్నారు.

* కేసు పునర్విచారణ కోసం ఏర్పాటైన సిట్‌కు విశాఖపట్నం రేంజ్‌ డీఐజీ శ్రీకాంత్‌ నేతృత్వం వహిస్తారు. ఈ బృందంలో సభ్యులుగా డీఎస్పీలు శ్రీలక్ష్మి, హైమావతి, నున్న సీఐ సాహెరా బేగం ఉన్నారు. ఇది విజయవాడ కమిషనర్‌ గౌతం సవాంగ్‌ పర్యవేక్షణలో పనిచేస్తుంది. దీని ఏర్పాటుపై గత ఏడాది ఆగస్టులో నిర్ణయం తీసుకుంది. అప్పటి నుంచి రెండు, మూడు దఫాలు సమావేశమైంది. తిరిగి విచారణ చేపట్టేందుకు అనుమతి కోసం విజయవాడ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇది తమ పరిధిలో అంశం కాదని కొట్టేసింది. అనంతరం హైకోర్టులో వేశారు. తాజా తీర్పుతో సిట్‌ దర్యాప్తు మొదలు కానుంది.

* ఇది ఏ విధంగా సాగుతుందన్న అంశంపై ఆసక్తికరంగా మారింది. మాజీ మంత్రి బంధువు, మరికొంతమంది సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, బాధితురాలి తల్లి షంషాద్‌బేగం పలు సార్లు ఆరోపించింది.

నేరం జరిగిన ప్రాంతంలో హంతకుడి పాదం ముద్ర ఉన్నట్లు గుర్తించారు. ఇది డీఎన్‌ఏ తప్ప మరో ఆధారం లభించలేదు. మొదటి ఉన్నత స్థాయి పోలీసులు, వర్గాలు సైతం ఆయేషా బంధువుపై అనుమానం వ్యక్తం చేశారు. అక్కడే ఒక లేఖ కూడా దొరికినట్లు చెబుతున్నారు. వీటి ఆధారంగా పలువురిని అదుపులోకి తీసుకొని విచారించారు.

* 2007 డిసెంబరు 26 రాత్రి ఇబ్రహీంపట్నంలో మహిళల వసతి గృహంలో బి.ఫార్మసీ చదువుతున్న ఆయేషా మీరా హత్యకు గురైన విషయం తెలిసిందే. ఆమెపై అత్యాచారం జరిగినట్లు కూడా పోలీసులు అభియోగాలు మోపారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో రాజకీయంగా సంచలనాలు చెలరేగాయి. దాదాపు డజనుకు పైగా నిందితులను గుర్తించి విచారించి వదిలివేశారు. దర్యాప్తులో భాగంగా దాదాపు 150 మంది యువకుల వరకు అదుపులోకి తీసుకుని విచారించి వదిలివేశారు.

* సంఘటన జరిగిన తర్వాత అకస్మాత్తుగా సత్యంబాబు తెరమీదకు వచ్చారు. సరిగ్గా 2008 ఆగస్టు 17న సత్యంబాబును ఒక కేసులో అరెస్టు చేశారు. నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యంబాబు గతంలో అదేతరహా నేరాలు చేశారని ఆయేషా హత్య, అత్యాచారం తానే చేశానని అంగీకరించారని అరెస్టు చేశారు.

* పోలీసుల దర్యాప్తులో వసతి గృహం నిర్వాహకులపై కనీస చర్యలు తీసుకోలేదు. అత్యాచారం జరిపి హత్య చేస్తుంటే.. అరుపులు కేకలు లేకుండా ఎలా ఉంటాయని పోలీసులు ప్రశ్నించలేదు. దాదాపు మూడు అంతస్తులో ఉన్న దుర్గా లేడీస్‌ హాస్టల్‌లో దాదాపు 50 మందికి పైగా విద్యార్థినులు వసతి పొందుతున్నారు. నిందితుడు సత్యంబాబుకు ఆయేషాకు అసలు పరిచయం కూడా లేదు. రెండో అంతస్తు వరండాలో ఉన్న గ్రిల్‌కు తాళం వేసి ఉన్నా నిందితుడు ఎలా పైకి వచ్చారనేది పోలీసు దర్యాప్తులో తేలలేదు.

* హత్య కేసులో అసలు నిందితులు కోనేరు సతీష్‌, సురేష్‌, అబ్బూరి గణేష్‌, చింతా పవన్‌, రాజేష్‌, కవిత, సౌమ్య, ప్రీతి, వార్డెన్‌ కోనేరు పద్మ సహా ఆమె భర్త శివరామకృష్ణను అరెస్టు చేసి విచారించాలని షంషాద్‌ బేగం పలు సార్లు కోరారు. ఆమె విజ్ఞప్తి అప్పట్లో పట్టించుకోలేదు. ఇప్పుడు వీరిని విచారిస్తారా?
ఒకవేళ విచారిస్తే అసలు విషయాలు వస్తాయా? అన్నది ప్రశ్న.
నేరం జరిగి పదేళ్లు దాటినందున ఘటనా స్థలిలో ఆధారాలు ఇప్పుడు దొరికే అవకాశం లేదు. నిందితుడి వెంట్రుకలు, డీఎన్‌ఏ, వంటి శాస్త్రీయ ఆధారాలను పోలీసులు సేకరించారు. వీటిని మళ్లీ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లో పరిశీలించాల్సి ఉంది. వీటిపై హైకోర్టు అనుమానాలు వ్యక్తం చేసింది. మరి శాస్త్రీయంగా ఎలా నిరూపించాలన్నది సవాలుగా మారుతుంది. ‌హాస్టల్‌ గోడను సత్యం బాబు దూకి పై  అంతస్తులోకి వెళ్లాడని ప్రాసిక్యూషన్‌ వాదనను కోర్టు తీవ్ర అభ్యంతరం తెలిపింది. అతీంద్రియ శక్తులు ఉంటేనే దూకగలరని వ్యాఖ్యానించింది. తమ వాదనకు మద్దతుగా ఇప్పటికే పోలీసులు నడి వయస్కుడైన ఓ అధికారిని గోడ ఎక్కి సునాయాసంగా పైకి వెళ్లొచ్చనే విషయాన్ని ధ్రువీకరించుకున్నారు. గతంలో కేసు విచారణకు సంబంధించిన అన్ని దస్త్రాలను మళ్లీ పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు.

ఇకనైనా న్యాయం జరుగుతుంది
- పిచ్చుక శ్రీనివాస్‌, సత్యంబాబు తరఫున వాదించిన న్యాయవాది

సిట్‌ దర్యాప్తు అంతా హైకోర్టు పర్యవేక్షణలో సాగుతుంది. దీని వల్ల దర్యాప్తు అధికారులు ఎక్కడా తప్పు చేయడానికి అవకాశం ఉండదు. ఈ పరిస్థితుల్లో ఆయేషా తల్లికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం. దీనిపై న్యాయ పోరాట కమిటీని ఏర్పాటు చేశాం. తుది వరకు మా పోరాటం సాగుతుంది. ప్రభుత్వం దీనిపై అప్పీలుకు వెళ్లకూడదని నిర్ణయించింది. పోలీసులు కోర్టు నిర్ణయాన్ని గౌరవించి దర్యాప్తు చేయాలి. చాలా మందిని విచారించాల్సిందే. హాస్టల్‌ నిర్వాహకులతో పాటు మరికొందరిని కూడా విచారించాలని షంషాద్‌ బేగం తొలి నుంచి కోరుతోంది. దీన్ని పోలీసులు విస్మరించారు. వారిని తక్షణం అరెస్టు చేయాలి. లేనిపక్షంలో వారు సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉంది. సత్యం బాబుకు సంబంధించి పరిహారం విషయంలో ప్రభుత్వానికి నివేదించాం.

అసలైన దోషులను పట్టుకోవాలి - షంషాద్‌ బేగం, ఆయేషా మీరా తల్లి

ఈ కేసును అప్పటి పాలకులు, పోలీసు అధికారులు పక్కదారి పట్టించారు. హైకోర్టు పరిధిలో దర్యాప్తు ప్రక్రియ సాగుతుందని, దీని వల్ల నిజమైన దోషులు బయటకు వస్తారు. దీనికి సంబంధించి న్యాయమూర్తులకు కృతజ్ఞతలు చెబుతున్నాం. మాకు వారు చాలా సాయం చేశారు. మా పాప కేసులో న్యాయం జరుగుతుందని భావిస్తున్నాం. ఈ కేసులో సత్యం బాబు నిందితుడు కాదని అప్పట్లోనే మేం చెప్పాం. మాకు ప్రజా సంఘాలు అండగా నిలిచారు. ఇప్పుడు కేసును పక్కదారి పట్టించడానికి అవకాశం లేదు.

Related Posts