పల్లెకు వరం (పశ్చిమగోదావరి)
ఏలూరు, ఫిబ్రవరి 27: గ్రామీణ స్థాయిలో ప్రతి పేదవాడికి మెరుగైన వైద్యం అందించాలనే సంకల్పం దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. అందులో భాగంగా నాడు-నేడు కార్యక్రమంలో పక్కా భవనాలు నిర్మించేందుకు దృష్టి సారించింది. జిల్లాలో 425 ఆరోగ్య ఉపకేంద్రాలకు ఒక్కో దానికి రూ. 23 లక్షలు చొప్పున రూ. 97.75 కోట్లు కేటాయించింది. వీటికి సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ టెండర్లు పిలిచింది. త్వరలో నూతన భవన నిర్మాణాలు మొదలవుతాయి. జిల్లాలో 638 ఆరోగ్య ఉప కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 158 సొంత భవనాల్లో నిర్వహిస్తుండగా మిగిలిన చోట్ల పంచాయతీ కార్యాలయ భవనాలు, ఇతర ప్రభుత్వ భవనాలు, అద్దె భవనాల్లో నడుస్తున్నాయి. ఉదాహరణకు పాలకొల్లు మండలం లంకలకోడేరు ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలో తొమ్మిది వరకు ఉపకేంద్రాలు ఉండగా మూడు మాత్రమే సొంత భవనాల్లో కొనసాగుతున్నాయి. మిగిలిన ఆరింటిలో పూలపల్లి, శివదేవునిచిక్కాలలోని కేంద్రాలు పంచాయతీ కార్యాలయాల్లో, దగ్గులూరులో వీవర్స్‌కు చెందిన భవనంలో, లంకలకోడేరులో అద్దె భవనంలో, వెంకటాపురంలో సామాజిక భవనంలోనూ నడుస్తున్నాయి. ఆగర్రు కేంద్రాన్ని ఓ చర్చిలో నిర్వహిస్తున్నారు. జిల్లాలో అన్ని మండలాల్లో ఇలా పరాయి పంచన నడిచే ఉపకేంద్రాలే ఎక్కువగా ఉన్నాయి. ఆయా కేంద్రాలకు సొంత భవనాలను నిర్మించేందుకు అవసరమైన స్థల సేకరణపైనా దృష్టి పెట్టారు. కొన్నింటికి సొంత స్థలాలు ఉండగా మరికొన్నిచోట్ల ఆయా పంచాయతీల పరిధిలో స్థలాలను సేకరిస్తున్నారు. జిల్లాలో ఏడు సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీ)లను పటిష్ఠ పరిచేందుకు రూ. 26.72 కోట్లు మంజూరు చేసింది. దీనిలో భాగంగా ఆచంట, పెనుగొండ, ఆకివీడు, భీమడోలు, దెందులూరు, పోలవరం, నరసాపురం ప్రాంతాల్లో భారతీయ ఆరోగ్య ప్రమాణాలకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ అభివృద్ధి చేయనుంది. జిల్లాలో 10 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు భవనాల నిర్మాణంతోపాటు మిగిలిన చోట్ల మరమ్మతులు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నడుస్తున్న ప్రతి ఆరోగ్య ఉపకేంద్రంలో ఏఎన్‌ఎం, మగ ఆరోగ్య కార్యకర్తతోపాటు ప్రతి వెయ్యి మంది జనాభాకు ఒక ఆశా కార్యకర్త విధులు నిర్వహిస్తుంటారు. వీరు జాతీయ ఆరోగ్య కార్యక్రమాలతో పాటు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అత్యవసర సమయాల్లో ప్రథమ చికిత్స సేవలను అందిస్తున్నారు. ఉపకేంద్రాల్లో కొన్నిచోట్ల టెలీ వైద్య సేవలు అందుతున్నాయి. ఆయా కేంద్రాలు గుంటూరులోని ప్రభుత్వాసుపత్రికి అనుసంధానంగా పనిచేస్తున్నాయి. ఇక్కడ ప్రత్యేకంగా ఎంఎల్‌హెచ్‌ఓ అదనంగా విధులు నిర్వహిస్తుంటారు. ఏలూరు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రితో పాటు తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, తణుకు ప్రాంతీయ ఆసుపత్రుల్లోనూ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను సమకూర్చనున్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల అవసరమైన నూతన వైద్య పరికరాలు సమకూరుతుండగా మరికొన్నిచోట్ల ఎదురు చూస్తున్నాయి. ఆరోగ్యశ్రీ పథకంలో 2,059 వ్యాధులకు చికిత్స అందించనున్నారు.