ప్రభాస్ ఇంకో ఏడాది ఆగాల్సిందే
హైద్రాబాద్, ఫిబ్రవరి 28,
టాలీవుడ్‌లో తిరిగేస్తున్న హాలీవుడ్ హీరోలాంటోడు ప్రభాస్. తన స్టామినా గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. బాహుబలి తరవాత ప్రభాస్ నుంచి వచ్చిన సినిమా సాహో మాత్రమే. రాధాకృష్ణ సినిమా 2021లో గానీ రాదు. అంటే… 2020లోనూ ప్రభాస్ నుంచి సినిమా చూడలేం. రాధాకృష్ఱ సినిమా తరవాత.. నాగ అశ్విన్‌తో సినిమా సెట్స్‌పైకి వెళ్తుంది. ఇది కూడా భారీ హంగులున్న సినిమానే. 2023లో ఈ సినిమా విడుదలయ్యే అవకాశాలున్నాయి. ఈమధ్యలో ఏం జరుగుతుందో చెప్పలేం. రాధాకృష్ణ సినిమాకీ, నాగ అశ్విన్ సినిమాకీ మధ్య తను మరో ప్రాజెక్టు చేసే అవకాశమే లేదు. ఎందుకంటే.. నాగ అశ్విన్ సినిమా కూడా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిస్తున్న చిత్రమే. దాదాపు యేడాదిన్నర శ్రమిస్తే గానీ సినిమా పూర్తవ్వదు. అంటే.. 2022లోనూ ప్రభాస్ నుంచి సినిమా రాదు. అంటే రెండు మూడేళ్లకు ఓ సినిమా చేసుకుంటూ పోతే… ప్రభాస్ తన కెరీర్‌లో 25 సినిమాలకు మించి చేయడేమో..? ఓ స్టార్ హీరో, అందునా పాన్ ఇండియా క్రేజ్ ఉన్న హీరో, వందల కోట్ల రూపాయలు బాక్సాఫీసుని కొల్లగొట్టే హీరో – ఇలా రెండేళ్లకో, మూడేళ్లకో ఓసినిమా చేస్తాననడం పరిశ్రమకు మంచిది కాదు. ప్రతీ సినిమానీ పాన్ ఇండియా స్థాయిలో ప్లానింగ్ చేసుకోవడం వరకూ బాగానే ఉంది. కానీ.. అందుకోసం ఏళ్లకు ఏళ్లు నిరీక్షించడం మాత్రం కరెక్ట్ కాదు. రాధాకృష్ణ సినిమా ఓ లవ్ స్టోరీ. దానికి పాన్ ఇండియా ట్యాగ్ అవసరం లేదు. కానీ.. ప్రభాస్ మార్కెట్ ని క్యాష్ చేసుకోవాలన్న ఉద్దేశంతో ఆ సినిమానీ బాలీవుడ్‌కి తీసుకెళ్తున్నారు. దర్శకుల ఎంపికలో ప్రభాస్ అనుసరిస్తున్న వైఖరి కూడా అభిమానులకు అంతగా రుచించడం లేదు. బాహుబలి తరవాత సుజిత్‌తో సినిమా ఏమిటని చాలామంది ఆశ్చర్యపోయారు. ప్రభాస్‌ని మెప్పించగల స్క్రిప్టుతో సుజిత్ వెళ్లుంటాడులే అని నమ్మారు. కానీ తీరా చూస్తే… `సాహో`లో కథలో మెరుపులేం కనిపించలేదు. ఫలితం ఎలా ఉందో మనమంతా చూశాం. రాధాకృష్ణ ప్రాజెక్టు విషయంలోనూ ఇంతే. కేవలం ఒకే ఒక్క సినిమా (జిల్) తీసిన అనుభవం రాధాకృష్ణకు ఉంది. అది కూడా బాక్సాఫీసుని షేక్ చేసిన సినిమా ఏం కాదు. జస్ట్ ఏవరేజ్ అంతే. ప్రభాస్ లాంటి హీరో కోసం ఎలాంటి దర్శకుడైనా దిగిరాక తప్పదు. అలాంటప్పుడు… రాధాకృష్ణని నమ్మాడు ప్రభాస్. ఇప్పటికే ఈ ప్రాజెక్టు చాలా ఆలస్యమైపోయింది. కథలో మార్పులు చేసుకుంటూ వెళ్తున్నారని, తీసిన కొంత సినిమాని పక్కన పెట్టారని నెగిటీవ్ వార్తలు ఈ సినిమాపై చాలా ప్రచారంలో ఉన్నాయి. అవన్నీ ఈసినిమా క్రేజ్ ని తగ్గించేవే. ఇప్పుడు నాగ అశ్విన్ సినిమాని అంగీకరించాడు ప్రభాస్. అశ్విన్ మంచి దర్శకుడు. క్లాస్ టచ్ ఉన్న దర్శకుడు. కాదనలేని సత్యం ఇది. కానీ ప్రభాస్ ఇమేజ్‌కి మ్యాచ్ చేయగల కథ రాసుకోగలడా, దాన్ని తెరపై తీసుకురాగలడా? అనే భయాలు ప్రభాస్ అభిమానులకు ఉన్నాయి. మహానటితో జాతీయ అవార్డు సాధించాడు నాగ అశ్విన్. తనకంటూ ఓ బ్రాండ్ ఉంది. కానీ.. మాస్ సినిమా తీయగలడా? ప్రభాస్ మార్కెట్ రేంజు, స్టామినాకు సరితూగగల కమర్షియల్ సినిమా ఇవ్వగలడా? అని ఎవరైనా అనుమానిస్తే అది వాళ్ల తప్పేం కాదు. బహుశా ఇక్కడ కూడా ప్రభాస్ కథకే బౌల్డ్ అయిపోయి ఉంటాడు. అది ఎలాంటి కథ అనేది… తెరపై బొమ్మ పడేంత వరకూ తెలీదు. నాగ అశ్విన్‌కి ఛాన్స్ ఇచ్చాడన్న సంగతి పక్కన పెడితే… ఈ సినిమా కోసం కూడా రెండేళ్ల కాల్షీట్లు కేటాయించాల్సిరావడం మాత్రం కాస్త కఠినమైన నిర్ణయమే. ఇలా ఏళ్లకు ఏళ్లు ఒక్కో సినిమాకూ కేటాయించడం వల్ల ప్రభాస్‌పై మరింత ఒత్తిడి పెరిగే ప్రమాదం ఉంది. రెండేళ్లకు మూడు సినిమాలు చేయాలని ప్రభాస్ స్థాయి ఉన్న వాళ్లంతా పరుగులు తీస్తుంటే.. ప్రభాస్ మాత్రం నిదానమే ప్రదానం అనే సూత్రాన్ని నమ్ముకుంటున్నాడు. మరి ఈ స్ట్రాటజీ ప్రభాస్‌కి ఏమాత్రం ఉపయోగపడుతుందన్నది కాలమే సమాధానం చెప్పాలి.