ఓఐసీ ఆగ్రహం.. భారత్ కౌంటర్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28
ఢిల్లీ హింసపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ (ఓఐసీ), యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రెలిజియస్ ఫ్రీడమ్ (యూఎస్‌సీఐఆర్ఎఫ్) చేసిన వ్యాఖ్యలను భారత్ తీవ్రంగా ఖండించింది. విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ కుమార్ స్పందిస్తూ.. కొన్ని అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తులు బాధ్యతారహిత ప్రకటనలు చేయడం మానుకోవాలని ఆయన కోరారు. ప్రపంచవ్యాప్తంగా మత స్వేచ్ఛను పర్యవేక్షించే యూఎస్‌సీఐఆర్ఎఫ్ తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేయకూడదని, సమస్యను రాజకీయం చేయడం తగదని హితవు పలికారు.అలాగే భారత అంతర్గత వ్యవహారంపై ఓఐసీ బాధ్యతారహిత ప్రకటన చేయడం ఏంటని ప్రశ్నించారు. ఢిల్లీలో చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలపై యూఎస్‌సీఐఆర్ఎఫ్ సహా కొన్ని మీడియా సంస్థలు, కొంత మంది వ్యక్తులు చేసిన ప్రకటనలు తమ దృష్టికి వచ్చాయని, ఇవి వాస్తవంగా సరికాదని, తప్పుదారి పట్టించేందుకే ఉద్దేశపూర్వకంగానే సమస్యను రాజకీయం చేస్తున్నారని రవీశ్ కుమార్ మండిపడ్డారు.‘క్షేత్రస్థాయిలో హింసను నిరోధించి, బాధితుల్లో విశ్వాసం కల్పించి పరిస్థితులను చక్కదిద్దడానికి చట్టాలను అమలు చేసే తమ సంస్థలు పనిచేస్తున్నాయి.. ప్రభుత్వం తరఫున ఉన్నతస్థాయి ప్రతినిధులు ఇప్పటికే పనిచేస్తున్నారు.. ప్రజానీకం కూడా శాంతి, సోదరభావంతో మెలగాలని ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభ్యర్థించారు.. సున్నితమైన ఇలాంటి సమయంలో బాధ్యతారహిత ప్రకటనలు చేయడం మానుకోవాలని అర్ధిస్తున్నాం’ అని అన్నారు.ఓఐసీ కూడా దీనిపై తప్పుడు ప్రచారం చేస్తోందని, క్షేత్రస్థాయిలో పరిస్థితులను చక్కదిద్ది బాధితుల్లో విశ్వాసం నెలకొల్పడానికి ప్రయత్నిస్తున్నామని రవీశ్ వ్యాఖ్యానించారు. గతంలోనూ ఓఐసీ ఇలాంటి ప్రచారం చేసి, భారత అంతర్గత విషయాలలో జోక్యం చేసుకునే ప్రయత్నం చేసిందన్నారు. భారత్‌లోని ముస్లింలపై ఇటీవల జరిగిన హింసాత్మక ఘటనల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోయారు.. గాయపడ్డారు.. మసీదులు, ముస్లింల ఆస్తులను ధ్వంసం చేశారని ఓఐసీ వ్యాఖ్యలు చేసింది.అటు, అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్న డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి బెర్నీ శాండర్స్.. భారత పర్యటనకు వెళ్లిన ట్రంప్ ఢిల్లీ ఘటనలపై మాట్లాడలేదని, ఇది ఆయన నాయకత్వ వైఫల్యంగా అభివర్ణించారు. దీనిపై భారత్ స్పందిస్తూ కొన్ని అంతర్జాతీయ సంస్థలు, వ్యక్తులు బాధ్యతా రహితంగా ప్రకటనలు చేయడం మానుకోవాలని కోరింది.