YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

*సంభాషణం*

*సంభాషణం*

*సంభాషణం*
సత్యం మాట్లాడాలి. ప్రియంగా మాట్లాడాలి. సత్యమే అయినా అప్రియంగా బాధించేదిగా మాట ఉండకూడదు. ఇది వేదసూక్తి. మాట భగవంతుడి వరం. మనిషికి తప్ప మరే ప్రాణికీ మాట్లాడే శక్తిలేదు. ఈ కారణంగానే మనిషికి విశేష ప్రాధాన్యం కలిగింది సంభాషణ ఒక చాతుర్యం. అది సంస్కారాన్ని తెలియజేసే సాధనం. మంచిమాట హృదయాన్ని శాంతపరుస్తుంది. ఓదార్పు కలిగిస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆశలు రేకెత్తించి విజయానికి బాటలు పరుస్తుంది.మాట రెండువైపులా పదునుగల కత్తివంటిది. అది వికటిస్తే బాధిస్తుంది. నిరాశకు గురిచేస్తుంది. వినాశనానికి దారితీస్తుంది. కొంతమంది మాట వినాలనిపిస్తుంది. కొంతమంది మౌనం వహిస్తేనే బాగుంటుందనిపిస్తుంది! మాటలతో భగవంతుణ్ని ప్రసన్నం చేసుకోవడానికే ప్రార్థన. స్తోత్రాలతో మానసిక తృప్తి లభిస్తుందని మహర్షులు మానవాళికి ఎన్నో స్తోత్రాలు, సహస్రనామాలు అందించారు. శ్రీరాముడు ప్రియభాషణుడు. అసత్యం నోటివెంట రాదు. త్రికరణశుద్ధిగా మనసు, మాట, క్రియలో మార్పు రాదు. ఎవరెన్ని చెప్పినా తండ్రిమాట ప్రకారం వనవాసదీక్ష కొనసాగించాడు. సుగ్రీవుణ్ని, విభీషణుణ్ని మిత్రులుగా భావించాడు. చివరకు వాలి పరుషంగా నిందించినా తన సత్యభాషణతో సంతృప్తిపరచాడు.రామకృష్ణ పరమహంసను కలిసిన నరేంద్రుడికి ఆయన మాట ఆధ్యాత్మిక బాట చూపింది. భగవంతుడి ఉనికి గురించి సత్యం తెలిపింది. ఆత్మవిశ్వాసంతో వివేకానందుడిగా జ్ఞానసుగంధాలను దేశమంతా వ్యాపింపజేశాడు.సుగ్రీవుణ్ని వెతుకుతూ పంపాతీరానికి చేరిన రామలక్ష్మణులకు హనుమ భిక్షురూపంలో కలిశాడు. వారి గురించి ప్రశ్నించాడు. తన గురించి తన ప్రభువు సుగ్రీవుడి విషయం విన్నవించాడు. నవవ్యాకరణ పండితుడైన హనుమ మాట్లాడే విధానం రాముణ్ని ఆకట్టుకుంది. లక్ష్మణుడికి హనుమ మాట చాతుర్యం వివరించాడు.మాట్లాడేటప్పుడు హావభావాలు ఎలా ఉండాలో కనురెప్పలు ఎగరవేయకుండా, ఎగతాళిగా నవ్వకుండా ప్రియంగా ఎలా మాట్లాడాలో హనుమ అలాగే ప్రవర్తించాడు. తడబడకుండా, పునరుక్తి దోషం రాకుండా గబగబా కాక, అతినెమ్మదిగా కాక ప్రసంగం సాగాలని, ఎదుటివ్యక్తిలో నమ్మకాన్ని కలిగించాలని, అదే మాటకు ప్రాణమని తెలిపాడు శ్రీరాముడుహనుమంతుడు అశోకవనంలో సీతాదేవిని దర్శించినప్పుడు తాను ఎలా మాట్లాడితే ఆమెకు నమ్మకం కలుగుతుందో అలాగే సంభాషించాడు. సంస్కృతంలో కాక కోసలదేశ భాషలో ప్రసంగించాడు. రావణసభలో గట్టిగా, నిష్కర్షగా నిజాల్ని తెలియజేశాడు. భయపడకుండా తన మనసులోని భావాల్ని వివరించాడు. ఎప్పుడు ఎక్కడ ఏ మాట వాడాలో తెలియడం ఒక కళ. అది హనుమలోని ఘనత. సీతాదేవిని చూసి, లంకను కాల్చి శ్రీరాముడి దగ్గరికి రాగానే ‘చూశాను సీతను, లంకలో పాతివ్రత్య నియమంతో ఉన్నది’ అని ఒకే వాక్యంలో శ్రీరాముడికి చెప్పడం- ఆయనలోని ప్రతిభకు నిదర్శనం. ఒక మంచిమాట సమాజంలో మార్పు తెస్తుంది. గాంధీజీ సత్యాన్వేషణ కేవలం ఏ కొందరి కోసమో కాదు. భారతదేశంలోని పౌరలందరూ దేశభక్తిని చాటాలి. దేశాన్ని ప్రేమించాలి. తూటాకన్నా మాట బలమైనది. తూటా అమాంతం ప్రాణం తీయగలదు. ఇతరులకు తగిలే పరుషమైన పదం విషంలా మారి కృశింపజేస్తుంది.మాట్లాడేటప్పుడు ఆవేశం పనికిరాదు. ఆలోచన చేయాలి. తన మాట విశ్వశ్రేయస్సుకు నాంది కావాలి అనుకునేదే దైవత్వ లక్షణం. మాటలు సమాజంలో మానవతా విలువలను పెంపొందించాలి!

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts