కరోనాతో ప్రపంచకప్కు దూరం
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 29
చైనాను వణికిస్తున్న కరొనా వైరస్.. ప్రపంచవ్యాప్తంగాను తన ప్రభావం చూపిస్తోంది. తాజాగా క్రీడారంగంలోని ఓ టోర్నీ దీని ప్రభావానికి గురయ్యింది. సైప్రస్‌లో వచ్చేనెల నుంచి జరిగే ఐఎస్ఎస్ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, ఈ విషయాన్ని ఆ టోర్నీలో పాల్గొనాల్సిన ఇద్దరు భారత ప్లేయర్లు ధ్రువీకరించారు. కేంద్ర ప్రభుత్వం సలహా మేరకే ఈ టోర్నీ నుంచి భారత్ తప్పుకున్నట్లు సమాచారం.ఆటగాళ్లు, సహాయక సిబ్బంది ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత జాతీయ రైఫిల్స్ సంఘం (ఎన్ఆర్ఏఐ) ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సైప్రస్‌లో వచ్చేనెల 3 నుంచి ఈ టోర్నీ జరుగనుంది. భారత్‌తో కలిపి ఇప్పటికే ఈ టోర్నీ నుంచి ఏడు దేశాలు తప్పుకున్నట్లు తెలుస్తోంది.మరోవైపు చైనాలో కరోనా ఉధృతి పెరుగుతోంది. ఇప్పటికే ఈ మహమ్మారి వైరస్ కారణంగా మూడు వేలమందికిపైగా మరణించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రపంచవ్యాప్తంగా 80వేల మంది ప్రభావితులైనట్లు సమాచారం. మరోవైపు వచ్చే జూలైలో జరిగే ఒలింపిక్స్ నిర్వహణ కూడా ఈ వైరస్ కారణంగా ప్రభావితం అవనున్నట్లు తెలుస్తోంది.