28 తర్వాత చైతన్య, నారాయణ కాలేజీల మూసివేత
హైద్రాబాద్, ఫిబ్రవరి 29,
రాష్ట్రంలో 68 కార్పొరేట్ జూనియర్ కాలేజీలకు ఫైర్ సేఫ్టీ పర్మిషన్లు లేవని, వీటిలో శ్రీచైతన్య 18, నారాయణ 26 కాలేజీలున్నాయని హైకోర్టుకు రాష్ట్ర ఇంటర్ బోర్డు తెలిపింది. స్టూడెంట్స్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షలు పూర్తయ్యే వరకు మాత్రం ఆ కాలేజీలను కొనసాగిస్తామని, వచ్చే నెల 28 నుంచి మూసేస్తామని స్పష్టం చేసింది. నారాయణ, శ్రీచైతన్య విద్యా సంస్థలు అనుమతులు లేకుండానే కాలేజీల్ని నిర్వహిస్తున్నాయని మేడ్చల్ పట్టణానికి చెందిన రాజేశ్వేసిన పిల్పై గురువారం చీఫ్ జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అభిషేక్‌రెడ్డితో కూడిన డివిజన్ బెంచ్ ముందు విచారణ జరిగింది. ఇంటర్ బోర్డు సెక్రటరీ కౌంటర్ పిటిషన్ వేశారు. బోర్డు తరఫున ప్రభుత్వ ప్రత్యేక లాయర్ సంజీవ్‌కుమార్ వాదించారు. ఈ నెల 20న హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ నిర్వహించిన సమీక్ష సమావేశానికి విద్య, ఇంటర్ బోర్డు, ఫైర్, హోం ఇతర శాఖల ఉన్నతాధికారులు హాజరై తీసుకున్న నిర్ణయానికి లోబడి 68 కాలేజీలకు షోకాజ్ నోటీసులిచ్చినట్లు తెలిపారు. చైతన్య కాలేజీ అయితే వచ్చే ఏడాది నుంచి ఎన్వోసీ లేని కాలేజీలను నడపబోమని చెప్పిందని, ఇతర కాలేజీలు సంజాయిషీ ఇస్తున్నాయని చెప్పారు. ఇప్పటికిప్పుడే కాలేజీలను మూసేయలేమని, మార్చి 4 నుంచి పరీక్షలు కూడా ఉన్నాయని, ఇప్పటికే ప్రాక్టికల్స్ అయ్యాయని తెలిపారు. ఈ కాలేజీల్లో 29, 808 మంది చదువుతున్నారని, వాళ్ల మానసిక స్థితిగతులను దృష్టిలో పెట్టుకుని పరీక్షలు పూర్తయ్యే వరకూ 68 కాలేజీలను మార్చి 28 వరకు యథాతథస్థితిలోనే కొనసాగిస్తామన్నారు. మార్చి 28 తర్వాత వాటిని మూసివేసేందుకు హైకోర్టు కూడా ఆర్డర్ ఇవ్వాలని ఇంటర్ బోర్డు కోరింది.సర్కారీ కాలేజీల్లో అన్ని వసతులు లేకనే ప్రైవేటు కాలేజీలకు అనుమతులు ఇచ్చినట్లు హైకోర్టుకు ఇంటర్ బోర్డు తెలిపింది. రాష్ట్రంలో 404 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, 680 ప్రభుత్వరంగ కాలేజీల్లో 2,70,492 మంది స్టూడెంట్స్ ఉన్నారని, 1,476 ప్రైవేట్ కాలేజీల్లో 6,95,347 మంది స్టూడెంట్స్ ఉన్నారని వివరించింది. ఇకపై ఎన్వోసీ లేని బిల్డింగ్స్‌లో కాలేజీలు పెట్టేందుకు పర్మిషన్ ఇవ్వబోమని స్పష్టం చేసింది. ఈ విషయాలన్నీ రికార్డుల్లో నమోదు చేసిన హైకోర్టు.. అగ్నిమాపక శాఖ నుంచి ఎన్వోసీలు పొందని కాలేజీలు, వాటిలో తనిఖీలపై రిపోర్టును ఏప్రిల్ 3నాటికి ఇవ్వాలని సూచించింది. విచారణను ఏప్రిల్ 7కు వాయిదా వేసింది.