పాతబస్తీ చాంద్రాయణగుట్ట దారుణం
ఐదు రోజులుగా గదిలో నిర్బందం..నిఖా పేరుతో అరబ్‌షేక్ చిత్రహింసలు
హైదరాబాద్ మార్చ్ 2
పాతబస్తీలోని చాంద్రాయణగుట్ట దారుణం చోటుచేసుకుంది. నిఖా పేరుతో అరబ్‌షేక్ ఐదు రోజులుగా ఓ గదిలో నిర్బంధించి యువతిని చిత్రహింసలకు గురి చేశాడు. సిగరెట్‌తో కాల్చాడు. యువతి పట్ల మృగంగా ప్రవర్తించాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రుద్రభాస్కర్ తెలిపిన వివరాల ప్రకారం.. అంబర్‌పేట్ తురాబ్‌నగర్‌లో నివసించే ఫాతిమా ఉన్నిసాకు కొత్తపేట నబీల్ కాలనీలో ఓ ఇల్లు ఉంది. గత కొన్ని రోజులుగా ఈ ఇల్లును విక్రయిస్తానని ఫాతీమా ఉన్నిసా బ్రోకర్లకు తెలిపింది. దీంతో దళారీ మహ్మద్ సాబెర్ అలియాస్ వోల్టా సాబెర్ ఫిబ్రవరి 25న ఫాతీమా ఉన్నిసాకు ఫోన్ చేసి కొత్తపేట్ నబీల్‌కాలనీలోని మీ ఇంటిని కొనుగోలు చేయడానికి పార్టీ సిద్ధంగా ఉందని తెలిపాడు.దీంతో, ఇల్లు చూపించేందుకు ఫాతీమా ఉన్నిసా చెల్లెలు రఫత్ ఉన్నిసా (25)తో కలిసి వెళ్లింది. వీరు అక్కడికి వెళ్లే లోపే దళారీ మహ్మద్‌సాబెర్ అతడి భార్య సమీనాతో పాటు అరబ్ షేక్ ఇబ్రహీం (60) ఉన్నాడు. నీవు ఒప్పుకుంటే పెండ్లి చేసుకుంటానని అరబ్ షేక్ ముందుగా అక్క ఫాతీమా ఉన్నిసాకు ఆఫర్ చేశాడు. ఆమె ఒప్పుకోకపోవడంతో చెల్లెలు రఫత్ ఉన్నిసాకు ఆఫర్ చేశాడు. అక్కా చెల్లెలు ఇద్దరు అభ్యతరం చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు. వీరు వెళ్లిపోయిన తరువాత దళారీ మహ్మద్ సాబెర్ అతని భార్య సమీనా రఫత్ ఉన్నిసాను మీకు ఏలాగానై అప్పగిస్తామని షేక్‌కు మాట ఇచ్చి డబ్బులు తీసుకున్నారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకునేందుకు మహ్మద్ సాబెర్ భార్య సమీనా అంబర్‌పేట్ తురాబ్‌నగర్‌కు వెళ్లి మా ఇంటికి రావాలంటూ రఫత్‌ను ఆహ్వానించింది.సమీనా మాట కాదనలేక రఫత్ వారి ఇంటికి ఒక్కతే వెళ్లింది. అప్పటికే ఆ ఇంట్లో ఓ గదిలో షేక్ ఉన్నాడు. ఐదు రోజులుగా యువతిని చిత్రహింసలకు గురి చేశాడు. చెల్లెలు అదృశ్యం కావడంతో ఆందోళనలో ఉన్న ఫాతీమా ఉన్నిసాకు దళారీ మహ్మద్ సాబెర్‌పై అనుమానం వచ్చింది. వెంటనే నిలదీయగా జరిగిన విషయం చెప్పాడు. ఆమె ఆదివారం చాంద్రాయణగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రఫత్‌ను బంధించిన ఇంటికి వెళ్లారు. అప్పటికే రఫత్‌ను చిత్రహింసలకు గురి చేసిన షేక్ అక్కడి నుంచి పారిపోయాడు. పోలీసులు బాధితురాలిని వైద్య పరీక్షలకు తరలించారు. ఇబ్రహీం షేక్‌తో పాటు దళారీ మహ్మద్ సాబెర్, అతడి భార్య సమీనా ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. కేసును చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.