కర్నూలు పార్లమెంటు సభ్యురాలు బుట్టా రేణుక ఈరోజు ప్రధాన మంత్రి నరేంద్ర మోడిని కలిసిన వార్త చంద్ర బాబు నాయుడుని షాక్ కి గురి చేసింది. పైగా వచ్చే ఎన్నికల్లో తాను తెలుగుదేశం పార్టి తరపునే పోటీ చేస్తానని స్పష్టం చేయలేదు, పైగా అప్పటి పరిస్తితులను బట్టి తన నిర్ణయాలు ఉంటాయని ఆమె చేసిన వ్యాఖ్య తెలుగుదేశం శిభిరంలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. గత ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి తరపున మొదటి సారిగా ఎన్నికైన రేణుక ఆనక పార్టి ఫిరాయించి తెలుగుదేశం లో చేరారు. ఆమె టిడిపి లోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టి సంక్షోభాలు ఎదుర్కొంటోంది. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కోసం కేంద్రం తో చంద్ర బాబు , తెలుగుదేశం పార్టి చేస్తున్న పోరాటం లో బుట్ట రేణుక ఎక్కడా పాల్గొన లేదు. ఆమె ప్రవర్తన తెదేపా పార్లమెంటు సభ్యులకు కాస్త కలవరపాటు కలిగించినా బాబు పిలిచి మాట్లాడితే అంతా సర్దుకుంటుందని భావించారు. ఈలోగా ఆమె ఎకాయికిన ప్రధాన మంత్రిని తన కుటుంబ సభ్యులతోపాటు కలవడం తెలుగు దేశం పార్టిలో గుబులు పుట్టిస్తోంది. ఇటీవలే మరో పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత కూడా తెలుగు దేశం పార్టికి షాక్ ఇవ్వడం చూస్తుంటే భాజాపా అధ్యక్ష్యుడు కూడా “ఆపరేషన్ ఆకర్ష్” మొదలు పెట్టాడా అనే సందేహం రాజధానిలో వ్యక్తం అవుతోంది. ఎన్డిఏ ప్రభుత్వం నుంచి, కూటమి నుంచి తెలుగుదేశం పార్టి వైదిలగినా మళ్ళీ కలిసే అవకాశం కోసమే బాబు వ్యూహాలు రచిస్తున్నారు. అవిశ్వాస తీర్మానం పై సాచివేత కూడా బేరసారాల కోసమే అని అంతా భావిస్తున్న తరుణంలో తమ సభ్యులకు ప్రధాన మంత్రి దర్శన భాగ్యం కల్పించడం బాబుకు ప్రతికూల సంకేతాలను పంపిస్తున్నాయి.
కుర్నిశెట్టి సామాజిక వర్గానికి చెందిన బుట్ట రేణుక భర్తది వ్యాపార కుటుంబం. ఒరభుత్వ స్థలాల్లో వారు అనేక హోటల్లు నడుపుతున్నారు. అవన్నీ సజావుగా సాగడానికి ప్రభుత్వ దీవెనలు అవసరము, అందుచేతే ఆనే అప్పట్లో అధికార తెలుగుదేశం గూటికి చేరారని అంతా భావించారు. అయితే వ్యాపార సామ్రాజ్యాన్ని జాతీయ స్థాయిలోకి తీసుకుపోయే తలంపుతోనే రేణుక జాతీయ పార్టీల వైపు మొగ్గుచూపి ఉంటారు. హోదాపై పార్లమెంటు లోపల, వెలుపల పోరాటం చేస్తూనే, సుప్రీం కోర్టు తలుపులు తట్టడానికి ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు చెక్ పెట్టడానికే భాజాపా రేణుక కు స్వాగతం పలికి ఉంటారని కూడా అర్థం చేసుకోవచ్చు. ఏతావాతా చెప్పేదేమిటంటే, రాజకీయాల్లో ఈ ఆయారాం-గయారాం సంస్కృతి ఏ పార్టీ అధికారం లో వున్నా సమసిపోదని తేటతెల్లం అవుతోంది.
పి.వి.భరత్ మోహన్