YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

వేడుకోలు

వేడుకోలు

వేడుకోలు
వేడుకుంటే మాధవుడు ఆదుకుంటాడు అంటారు భాగవతులు. అలా ఆదుకునే భగవంతుణ్ని చూసే, చేరే, తెలుసుకునే, అవగాహన చేసుకునే మార్గాలను చూపుతుంది భాగవతం. అందులో భాగంగానే వేడుకోలు ప్రాధాన్యాన్ని, శక్తిని పాఠకులకు ఎరుక పరుస్తుంది ఆ పురాణం. అనువాద ప్రారంభంలో పోతన చేసిన ప్రార్థనా పూర్వక వేడుకోలుతో ఈ ప్రస్థానం మొదలవుతుంది. ‘కాటుక కంటి నీరు...’ అనే పద్యంలో సరస్వతీ దేవిని వేడుకుంటూ ‘అమ్మా! నేను అనువదించే ఈ కావ్యాన్ని సామాన్యులకు అంకితం ఇవ్వను’ అని నమ్మబలికే విధంగా దేవికి మాట ఇచ్చాడు. తన భాగవత అనువాదానికి ఆ అమ్మను అండగా ఉండమని అడిగాడు. ‘శ్రీకైవల్య పదంబు...’ అనే పద్యంలో అదే హామీని మళ్ళీ విష్ణువుకు ఇచ్చాడు. ‘భాగవతాన్ని ఆంధ్రీకరించి రాజులు జమీందారులు లాంటివారికి ఇచ్చి వారిచ్చే బహుమానాలతో జీవించాలనే తాపత్రయం నాకు లేదు’ అని చెప్పి తన రచన సాఫీగా సాగేలా చేయమని శ్రీహరిని వేడుకున్నాడు. వేడుకోవడం ఎలాగో, దాని ప్రభావం ఎలాంటిదో అనుభవపూర్వకంగా తెలిసినవాడు కాబట్టి ఆయన వేడుకోలులో ఎన్నో రకాలు ఉన్నాయని, ఎవరి స్థాయి/స్థితిని బట్టి వారు ఆయా విధాలుగా వేడుకుంటే ముక్తి కలుగుతుందని భాగవతం ద్వారా ఎరుకపరచాడు. దానికోసం అనేక కథలు చెప్పాడు. ప్రార్థన, ఆప్యాయత, శరణాగతి, వైర, మూఢ... లాంటి అనేక భక్తి మార్గాల ద్వారా వేడుకోవడం ఎలాగో భాగవతంలో తెలిపాడు. ప్రథమ స్కంధంలోని అశ్వత్థామ గర్వపరిహార ఘట్టంలో ఉత్తర గర్భరక్షణ కోసం చేసిన వేడుకోలు, శుకుణ్ని పరీక్షిత్తు మోక్షమార్గం కోరే ఘట్టం; తృతీయ స్కంధంలో దితి, కశ్యప సంవాద ఘట్టంలో హిరణ్యాక్ష హిరణ్యకశిపుల వేడుకోలు లాంటివి ప్రార్థనా పూర్వకమైనవి. యశోద వేడుకోలు ఆప్యాయతా భక్తికి అద్దంపడుతుంది. ‘మన ఇంట్లో పాలు, పెరుగులకు ఏమి కొరత? ఇతరుల ఇళ్ళలో వాటిని దొంగిలించి నలుగురి నోట్లో పడవద్దు’ అని మందలిస్తుంది. మందలింపైనా వేడుకోలు అనిపించేలా ఉంటుంది. రుక్మిణి వేడుకోలు ఆత్మీయతా భక్తికి నిదర్శనం. నీయందు నా మనసు ఎల్లప్పుడూ స్థిరంగా నిలిచి ఉండేటట్లు చూడు’ అని కృష్ణుణ్ని కోరుకుంది రుక్మిణి. అలాగే, సుదాముడి భక్తికి మెచ్చి ఏదైనా వరం కోరుకో అన్నాడు కృష్ణుడు. అప్పుడు సుదాముడు నిరంతరం నీ పాదపద్మాల సేవ చేసుకునే భాగ్యం, అలాంటి సేవకులతోటి స్నేహం, ఎప్పటికీ తరిగిపోని భూతదయ నాకు ప్రసాదించు’ అని వేడుకున్నాడు. ఇది అనురాగపు వేడుకోలు.గోపికల వేడుకోలులో ప్రేమ, ఆప్యాయత అనురాగం, ఆత్మీయతలు కనిపిస్తాయి. గజేంద్రుడి వేడుకోలు నిరహంకారానికి ప్రతీక. నా శక్తియుక్తులన్నీ ఉడిగి పోయాయి. నీవు తప్ప ఇతరులెవరూ నన్ను రక్షించలేరు... కాబట్టి వచ్చి రక్షించు’ అని వేడుకున్నాడు. ధ్రువుడి వేడుకోలు నిర్వికల్ప స్థితికి ఉదాహరణగా నిలుస్తుంది. ధ్రువుడు చేస్తున్న తపస్సువల్ల ఏర్పడిన అల్లకల్లోల పరిస్థితిని గమనించి విషయం తెలుసుకోవడానికి విష్ణువు స్వయంగా ఆ బాలుడి దగ్గరకి వెళ్ళాడు. పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు ధ్రువుడు. ‘స్వామీ, ఈ శరీరం పడిపోతున్నదని మృత్యుభయం పొందకుండా, ఆఖరి శ్వాసలోనూ నిన్నే తలచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్న మహా భాగవతులు నిన్నే పొందుతున్నారు. వారు నీలో ఐక్యం అయిపోతున్నారు. అటువంటివారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రీ’ అని అడిగాడు. ఈ విధంగా ‘వేడుకోవడం’ అనే భక్తిభావంతో ఆ అంతర్యామి కృపకు పాత్రులైనవారు ఆయనలోనే ఐక్యమయ్యారు.

వరకాల మురళి మోహన్ సౌజన్యంతో 

Related Posts