వారం రోజులు - ఏ రోజు ఏ విశేషము?
వారములు 7. అవి ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం.
ఆకాశంలో చంద్రుని స్థానంలో సూర్యుడు, సూర్యుడున్న స్థానంలో చంద్రుని భావించగా, కక్ష్యాక్రమం వారాలుగా ఏర్పాడతాయి. శని, గురు, కుజ, రవి, శుక్ర, చంద్ర. ఆ క్రమంలో హోర (1గంట)లు ఏర్పడతాయి. శనివారం శని హోరతో ఆరంభం అవుతుంది.
సూర్యోదయం నుంచి వరుసగా శని, గురు, కుజ, రవి, శుక్ర, బుధ, చంద్ర హోరలు నడుస్తాయి. (మందామరేజ్య భూపుత్రః సూర్య శ్శుక్రేంద్రుజేందవః) అవే మరల పునరావృతం అవుతాయి. 3×7=21 గంటలు పూర్తి అయిన తర్వాత 22 వ గంట శనిహోర, 23వ గంట గురుహోర, 24వ గంట కుజహోర పూర్తికాగా ఆదివారం రవిహోరతో ప్రారంభం అవుతుంది. ఆ విధంగా ఏ వారం ఆ గ్రహానికి చెందిన హోరతో ఆరంభం అవుతుంది.
ఏ వారం ఎలాంటి ఫలితం ఉంటుందో ఆ వారం జన్మించిన వారి లక్షణాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం.
ఆదివారం
రాజకార్యములు. ఉద్యోగప్రయత్నములు, కోర్టుపనులు, విక్రయపనులు, విద్యారంభం. సీమంతములకు శుభం.
ఆదివారం జన్మించినవారి లక్షణాలు
ఆదివారం జన్మించినవారు ఛామనచాయ శరీరము కలిగి ఉంటారు. పైత్య తత్త్వమును చురుకుదనం స్వయంకృషి కలిగి జీవిస్తారు. ఇతరుల మనస్సులను ఇట్టే గ్రహిస్తారు. సువర్ణాభరములు ధరించుట వీరికి ప్రీతి. ఏ పనినైనా వీరు త్వరగా పూర్తిచేయుటలో నేర్పరులు.
సోమవారం
అన్నప్రాశన, కేశఖండన. అక్షరాభ్యాసం, యాత్రలు, బావులు తవ్వుటకు, ప్రతిష్టాదులు, విత్తనములు చల్లుట, ఉద్యోగ, ఉపనయన, గృహారంభములకు శుభం.
సోమవారం జన్మించినవారి లక్షణాలు
సోమవారం జన్మించిన వారు అందమైన రూపముతో అలరారుచుందురు. సత్వగుణము ప్రధానమైనవారు. విశేష శాస్త్ర కృషి గావింతురు. నిర్మలమైన మనస్సు గలిగి పరోప కారబుద్ధిగలిగి జీవింతురు. ఆరోగ్య పరిరక్షణ వీరికి ఇష్టమైనపని. నీటివద్ద వీరు భయపడతారు.
మంగళవారం
శుభకార్యాలకు మంచిది కాదు. అగ్నిసంబంధ పనులు, పొలం దున్నుట, అప్పు తీర్చుట, సాహసకార్యములు, ఆయుధ విద్యలకు మంచిది.
మంగళవారం జన్మించినవారి లక్షణాలు
మంగళవారం జన్మించినవారు నీరువుతో కూడిన శరీరఛాయగల వారును, ఆలస్యముగా విద్యను అభ్యసించెదరు. తామస ప్రవృత్తితో సంచరించువారును. అడపాదడపా అనారోగ్యములకు గురికావచ్చు.
బుధవారం
సమస్త శుభకార్యాలకు, ప్రయాణాలకు, నూతన వస్త్రదారణకు, గృహారంభ, గృహప్రవేశ, దేవతా ప్రతిష్టాదులకు, హలకర్మ, విత్తనములు జల్లుటకు, క్రయ విక్రయాది వ్యాపారాది పనులకు, అప్పుచేయుటకు, ఉద్యోగములో చేరుటకు మంచిది.
బుధవారం జన్మించినవారి లక్షణాలు
బుధవారం జన్మించినవారు చామనఛాయతో వెలయు శరీరముగల వారును, సౌమ్యమైన మాటలను పలుకువారును, సూక్ష్మగ్రాహులును, వ్యవహార జ్ఞానము గలవారును, వృత్తీ ఉద్యోగములలో రాణించువారును. సభలయందు అనర్గళంగా ఉపన్యసించుగలవారు.
గురువారం
సమస్త శుభకార్యములకు మంచిది. వివాహ యాత్రాధులకు, నూతన వస్త్ర ఆభరణ ధారణకు, గృహారంభం, గృహప్రవేశ దేవతాప్రతిష్టాదులకు, చెరువులు, తవ్వుటకు, పదవీస్వీకారం చేయుటకు మంచిది.
గురువారం జన్మించినవారి లక్షణాలు
గురువారం జన్మించినవారు మధ్యమ దేహమును సుందర వదనము గలవారై ధైర్యవంతులై ప్రవర్తిస్తారు. ఇతరులకు తమ ప్రజ్ఞచూపి మెప్పుపొందుదురు. అనేక విషములందును, ఆరితేరినవారై ఉంటారు.
శుక్రవారం
వివాహాది శుభకార్యాలకు పంచదశ సంస్కారాలకు, క్రయవిక్రయాది వ్యాపారాలకు, ఔషధసేవకు, స్త్రీలకు సంబంధించిన కార్యక్రమాలకు, లలిత కళలు అధ్యయనం చేయుటకు మంచిది.
శుక్రవారము జన్మించినవారి లక్షణాలు
శుక్రవారము జన్మించినవారు తేజోవంతులును రజోగుణ ప్రధానులు అయి విచ్చలవిడిగా సంచరింతురు. సర్వశాస్త్రకోవిదులుగా ప్రఖ్యాతులు కాగలరు. స్వల్ప విషయాలకే నొచ్చుకొందురు. కొందరు కార్యాలయ ప్రధానులుగా పనిచేయుదురు. వంశోద్ధారకులైపొగడ్తలొందుదురు.
శనివారం
ఇనుము, ఉక్కు సంబంధిత పనులకు, నూనె వ్యాపారమునకు, స్థిరాస్తులను అమ్ముటకు, ఉద్యోగ స్వీకరణకు మంచిది. గృహారంభం, గృహప్రవేశ వివాహాదులకు మాధ్యమం.
శనివారంము జన్మించినవారి లక్షణాలు
శనివారంము జన్మించినవారు నల్లని దేహముకలిగి మందమతులై సంచరించెదరు. పొట్టికాళ్ళ వెడల్పు పాదములు కలిగి ఆలస్యముగా నడచుచుందురు. భాగ్యవంతులగుటకై ఎన్నో ప్రయత్నములు జరుపుచుందురు...
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో