YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్ దేశీయం

జగన్ కు సీఏఏ టెన్షన్

జగన్ కు సీఏఏ టెన్షన్

జగన్ కు సీఏఏ టెన్షన్
విజయవాడ, మార్చి 3
తెలుగు రాష్ట్రాలు వేరైనా... ఒక ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ప్రభావం కచ్చితంగా మరో రాష్ట్రంపై ఉంటోంది. ఈ మేరకు మరో రాష్ట్రం ఆ నిర్ణయం తీసుకుంటుందా ? లేదా అనే విషయం పక్కనపెడితే... కచ్చితంగా ఆ మేరకు ఒత్తిడి మాత్రం తెలుగు రాష్ట్రాలపై పడుతోంది. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ తీసుకున్న ఓ నిర్ణయం... ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు ఇబ్బందికరంగా మారిందనే ప్రచారం జోరందుకుంది. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏ చట్టాన్ని వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు కేబినెట్‌లో తీర్మానం కూడా చేసింది.త్వరలోప్రారంభం కాబోయే బడ్జెట్ సమావేశాల్లో ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టి ఆమోదింపజేసేందుకు రంగం సిద్ధమైంది. ఈ తీర్మానం కారణంగా కేంద్రంపై ఏ మేరకు ఒత్తిడి ఉంటుందనే అంశం పక్కనపెడితే... పొరుగు రాష్ట్రమైన ఏపీపై మాత్రం ఒత్తిడి పెరుగుతోందనే ప్రచారం సాగుతోంది. ఇప్పటికే వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అసెంబ్లీలో సీఏఏ, ఎన్‌ఆర్‌సీను వ్యతిరేకించాలని సీఎం జగన్‌పై ఒత్తిడి తీసుకొచ్చారు. తాజాగా గుంటూరులో జరిగిన సమావేశంలో వైసీపీ ఎమ్మెల్యే ముస్తఫా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీలో సీఏఏ, ఎన్‌ఆర్‌‌సీకు వ్యతిరేకంగా తీర్మానం పెట్టకపోతే ఎమ్మెల్యే పదవికి, వైసీపీకి రాజీనామా చేస్తానని ఆయన ప్రకటించడం సంచలనం సృష్టిస్తోంది.అయితే వైసీపీ నేతలు చేస్తున్న ఈరకమైన వ్యాఖ్యలు ఈ విషయంలో జగన్‌పై ఒత్తిడి తీసుకొస్తున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. అయితే ఏపీ ప్రభుత్వంపై ఈ రకమైన ఒత్తిడి పెరగడానికి అసలు కారణంగా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే అనే వాదన కూడా వినిపిస్తోంది. అసెంబ్లీలో సీఏఏ, ఎన్‌ఆర్‌‌సీకు వ్యతిరేకంగా తీర్మానం చేయాలని కేసీఆర్ నిర్ణయించడంతో... జగన్ కూడా ఇదే రకంగా చేయాలని ఏపీలోని వైసీపీకి చెందిన మైనార్టీ నేతలు ఆశిస్తున్నారు.అయితే కేంద్రంతో సఖ్యతగా ఉంటూ తన పనులు చక్కబెట్టుకోవాలని భావిస్తున్న సీఎం జగన్... ఈ రకమైన నిర్ణయం తీసుకునే అవకాశం లేదనే వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తానికి కేసీఆర్ నిర్ణయం కారణంగా తనపై పెరుగుతున్న ఈ ఒత్తిడిని సీఎం జగన్ ఏ రకంగా అధిగమిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.

Related Posts