ఆదాయపన్ను వసూళ్లలో తెలంగాణది 7వ స్థానం
14వ స్థానంలో ఆంధ్రప్రదేశ్
మొదటి స్థానంలో నిలిచిన మహారాష్ట్ర
న్యూఢిల్లీమార్చ్ 3
ఆదాయపన్ను వసూళ్లలో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఏడో స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ 14వ స్థానానికి పరిమితమైంది. దేశంలో ఈ ఏడాది ఫిబ్రవరి 15 వరకు రూ.9 లక్షల కోట్ల ఆదాయపన్ను కేంద్ర ఖజానాకు జమకాగా అందులో తెలంగాణ నుంచి రూ.37,806 కోట్లు(4.1%), ఆంధ్రప్రదేశ్‌నుంచి రూ.13,446 కోట్లు (1.4%) వసూలైనట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. ఈ మేరకు ఆయన లోక్‌సభలో ఓ లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. 2016-17 నుంచి 2019-20 ఫిబ్రవరి 15 వరకు నాలుగేళ్లలో దేశ ఖజానాకు ఆదాయపన్ను కింద రూ.30.39 లక్షల కోట్లు రాగా అందులో 3.98% తెలంగాణ నుంచి, 1.57% ఆంధ్రప్రదేశ్ నుంచి వసూలైంది. దేశంలో గత మూడేళ్లలో ఆదాయపన్ను వసూళ్లు సగటున 13.14% వృద్ధి చెందగా తెలంగాణలో 15.16%, ఆంధ్రప్రదేశ్‌లో 11.95% వృద్ధి నమోదైంది. ఆదాయపన్ను రూపంలో దేశ ఖజానాకు మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 34.23% వాటా అందుతోంది. జనాభా పరంగా దేశంలో తొలిస్థానంలో ఉండే ఉత్తర్‌ప్రదేశ్ పన్ను విషయానికొచ్చేసరికి 9వ స్థానానికి పరిమితమైంది. బిహార్ చివరి వరుసలో నిలిచింది. ఆర్థిక సంస్థల నుంచి మూడేళ్లలో రూ.11 వేల కోట్ల రుణం నాబార్డు, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, హడ్కోల నుంచి తెలంగాణ ప్రభుత్వం గత మూడేళ్లలో రూ.11,648.70 కోట్ల రుణం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ సహాయమంత్రి అనురాగ్‌సింగ్ ఠాకూర్ తెలిపారు. లోక్‌సభలో కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానం ఇచ్చారు. దేశంలోని అన్ని రాష్ట్రాల రుణాలూ ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోనే ఉన్నాయని చెప్పారు. రాష్ట్రంలో మరో 3120 కి.మీ. జాతీయ రహదారులు!తెలంగాణలో 3120 కి.మీ.మేర 31 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించడానికి సూత్రప్రాయ అంగీకారం తెలిపినట్లు కేంద్ర రహదారి రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ఉన్నతీకరించడానికి సాధ్యాసాధ్యాలు పరిశీలించి, డీపీఆర్ రూపొందించి తగిన నిధులు కేటాయిస్తామని తెలిపారు. తెలంగాణలో ఇప్పటి వరకు 1365 కి.మీ.మేర 13 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించినట్లు తెరాస ఎంపీ ధర్మపురి శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు రాజ్యసభలో కేంద్రమంత్రి లిఖితపూర్వక సమాధానమిచ్చారు.