YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

మామిడి రైతులతో మ్యాంగో మీట్

మామిడి రైతులతో మ్యాంగో మీట్

మామిడి రైతులతో మ్యాంగో మీట్
విజయవాడ, మార్చి 4
మామిడి రైతులకు మంచి ధర లభించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం మ్యాంగో మీట్‌ను నిర్వహించనుంది. రాష్ట్రంలో విజయనగరం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, ప్రకాశం, కడప, చిత్తూరు, కర్నూలు, అనంతపురం, విశాఖపట్నం జిల్లాల్లో 3.82 లక్షల హెక్టార్లలో దిగుబడినిచ్చే మామిడి తోటలున్నాయి. వీటి నుంచి సగటున 40 లక్షల టన్నుల దిగుబడి వస్తుంది. అత్యధికంగా బంగినపల్లి రకం 1,70,048 హెక్టార్లలో సాగవుతోంది. వీటి దిగుబడి 21,25,600 టన్నులు ఉంటోంది. ఆ తర్వాత స్థానంలో తోతాపురి (కలెక్టర్‌) 1.02 లక్షల హెక్టార్లలో సాగవుతూ 12,24,350 టన్నుల దిగుబడినిస్తోంది. ఆ తర్వాత స్థానాల్లో పెద్ద రసాలు, చిన్న రసాలు, చెరుకు రసం, సువర్ణరేఖ వంటివి ఉన్నాయి.  ఈనెల 7న రాష్ట్ర ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సుకు కృష్ణాజిల్లా నూజివీడులోని వేపర్‌ హీట్‌ ట్రీట్‌మెంట్‌ సెంటర్‌ వేదిక కానుంది. విదేశాలకు మామిడిని ఎగుమతి చేసే దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన 50 మంది ప్రముఖ ఎగుమతిదారులు, ఎగుమతికి వీలుగా ఉండే నాణ్యమైన మామిడిని పండించే రాష్ట్రంలోని సుమారు వంద మంది రైతులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు.సదస్సు రోజు రైతులు తమతమ మామిడి శాంపిళ్లను ప్రదర్శిస్తారు. ఎగుమతికి అనువైన రకాలను ఎగుమతిదారులు ఎంచుకుని అక్కడికక్కడే రైతులతో కొనుగోలు ఒప్పందాలు చేసుకుంటారు. ఈ మ్యాంగో మీట్‌ ద్వారా రైతులకు మంచి ధర లభిస్తుందని.. ఫలితంగా రైతుల్లో మామిడి సాగుపై ఆసక్తి పెరుగుతుందని ఉద్యానవన శాఖ అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఫ్రూట్స్‌) పీవీ రమణ  చెప్పారు. రైతులకు మేలు చేకూర్చేందుకే ప్రభుత్వం ఈ మీట్‌ను నిర్వహిస్తోందని తెలిపారు. ఎగుమతిదారులు చుట్టుపక్కల మామిడి తోటలను కూడా సందర్శిస్తారు.  మన రాష్ట్రం నుంచి ఇతర దేశాలకు ఎక్కువగా బంగినపల్లి, చిన్న రసాలు, చెరుకు రసాలు, సువర్ణరేఖ రకాలు ఎగుమతి అవుతాయి. జర్మనీ, దక్షిణ కొరియా, బ్రిటన్, అమెరికా, రష్యా, మధ్య ఈశాన్య దేశాలకు ఏటా సగటున 1,200 మెట్రిక్‌ టన్నుల మామిడిని ఎగుమతి చేస్తుంటారు. 

Related Posts