YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

బీసీ బ్రాండింగ్ కోసం నేతలు తహతహ

బీసీ బ్రాండింగ్ కోసం నేతలు తహతహ

బీసీ బ్రాండింగ్ కోసం నేతలు తహతహ
విజయవాడ, మార్చి 5
తెలుగుదేశం, వైసీపీ పార్టీలకు పంచాయతీ ఎన్నికల ముంగిట్లో వెనకబడిన తరగతులపై అపార ప్రేమ పుట్టుకొచ్చేస్తోంది. బీసీ రిజర్వేషన్ల విషయంలో ఎదుటిపక్షమే అన్యాయం చేస్తోందంటూ ఈ రెండు పార్టీల నాయకులు వేలెత్తి చూపించుకుంటున్నారు. తిట్టిపోసుకోవడానికి, పరస్పరం ఆరోపణలు గుప్పించుకోవడానికి వారికి ఇదొక కొత్త అంశం మాత్రమే. చట్టసభలు, రాజ్యాంగబద్ధ పదవుల్లో సమ ప్రాతినిధ్యం కల్పించడానికి ఈ పార్టీలు ఎప్పుడూ చొరవ చూపలేదు. ఎంపీ, ఎమ్మెల్యే స్థానాల్లో ఈ రెండు పార్టీల గణాంకాలు నిరూపించే నిజం ఇదే. పంచాయతీ టిక్కెట్ల విషయంలోనూ ఇప్పుడు టీడీపీ, వైసీపీలు న్యాయస్థానాల తీర్పు సాకుగా మరోసారి తప్పించుకో జూస్తున్నాయి. సీట్లు ఇవ్వకుండానే బీసీ వర్గాల మెజార్టీ ఓట్లు తెచ్చుకునేందుకు ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ రెండు పార్టీలు స్థానిక సంస్థల్లో బీసీలకు అన్యాయం జరగడంలో సమాన పాత్ర పోషించాయన్న విషయాన్ని వారి నిర్ణయాలే చాటిచెబుతున్నాయి. బీసీల పార్టీగా క్లెయిం చేసుకుంటున్న తెలుగుదేశం, నామినేటెడ్ పోస్టుల నుంచి బీసీలకు తమ హయాంలోనే పెద్దపీట వేస్తున్నామంటున్న వైసీపీ దొందూ దొందే . వీటి రాజకీయ సూత్రమూ ఒకటే. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో గ్రామాలలో ఈ పార్టీలు రాజకీయ సెగలు పుట్టించబోతున్నాయి.పంచాయతీలు, స్థానిక సంస్థలంటే రాష్ట్రప్రభుత్వాలకు చిన్నచూపు. 73,74 రాజ్యాంగ సవరణల ప్రకారం దఖలైన 29 అధికారాల్లో కీలకమైన వాటిని ఇప్పటికీ పంచాయతీలు, మునిసిపాలిటీలకు కేటాయించలేదు. తమ పెత్తనం దెబ్బతింటుందనే ఉద్దేశంతో వాటిని మూలనపెట్టేసి దొడ్డిదారి పెత్తనం చేస్తున్నాయి రాష్ట్రప్రభుత్వాలు. ఈ విషయంలో రాష్ట్రంలో తెలుగుదేశానిదే పెద్దన్న పాత్ర. వైసీపీ తాజాగా ఆ కోవలోకి చేరింది. రాష్ట్ర విభజన తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం స్థానిక సంస్థలను బలోపేతం చేసేందుకు ఏరకమైన చర్యలూ తీసుకోలేదు. పైపెచ్చు జన్మభూమి కమిటీల ద్వారా పరోక్షపెత్తనం చెలాయించేందుకు ప్రయత్నించింది. 2018లోనే గడువు తీరినప్పటికీ ఎన్నికలు నిర్వహించేందుకు ముందుకు రాలేదు. అధికారుల ద్వారా పరిపాలన సాగించడమే తమకు అచ్చి వస్తుందని భావించింది. అందులోనూ టీడీపీ వారసుడు నారా లోకేశ్ నేతృత్వంలోనే పంచాయతీరాజ్ శాఖ నడిచింది. ప్రజాస్వామ్య స్ఫూర్తిని తుంగలో తొక్కింది. ఏ వర్గానికి ఎన్ని సీట్లు ఇవ్వాలనే అంశాన్ని పక్కనపెడితే అసలు స్థానిక సంస్థల్లో తగిన సమయంలో ఎన్నికలే జరపకపోవడం టీడీపీ ప్రభుత్వ రికార్డు. అందువల్లనే ఈరోజున వైసీపీ సర్కారు టీడీపీకి ప్రశ్నించే నైతిక అర్హత లేదంటూ నిందిస్తోంది. అంతేకాకుండా పంచాయతీల ఎన్నికలకు సంబంధించి 2018లో హైకోర్టులో ఒక వ్యాజ్యం సందర్భంగా టీడీపీ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ ఇప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 60.55 శాతం రిజర్వేషన్లతో సాగిన ఎన్నికలు ఒక్కసారికి మాత్రమే పరిమితం. ఆ విధానాన్ని తాము అనుసరించము అనే ధోరణిలో టీడీపీ సర్కార్ ప్రమాణ పత్రం దాఖలు చేసింది. వెంటనే ఎన్నికలు జరపకుండా తప్పించుకునే ఎత్తుగడ కావచ్చు. కానీ తమ చిత్తశుద్ధి లేమిని మాత్రం చాటిచెప్పేదే.వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చిన ఈ తొమ్మిది నెలల్లోనూ పంచాయతీలపై పెద్దగా దృష్టి పెట్టలేదు. కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చిన రిజర్వేషన్ల ప్రాతిపదికను అనుసరిస్తూ ఎన్నికలకు ఏర్పాట్లు చేసుకుంటే సరిపోయేది. రాష్ట్ర విభజన తర్వాత ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా అదే పద్దతిని పాటిస్తున్నామంటూ న్యాయస్థానానికి సమాధానం ఇస్తే కొంతమేరకు సహేతుకంగా ఉండేది. కానీ 59 శాతం అంటూ కొత్త రిజర్వేషన్ విధానానికి చర్యలు తీసుకోవడంతోనే న్యాయస్థానంలో ప్రశ్నలు మొదలయ్యాయి. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన అనుమతి సంగతి పక్కన పడిపోయింది. ఎప్పటివో పాత తీర్పుల ప్రకారం 50 శాతమే అనుమతిస్తామంటూ న్యాయస్థానం తేల్చి చెప్పేసింది. 60 శాతం పైగా పెంచిన రిజర్వేషన్లు విషయాన్ని తిరిగి పాటించే అవకాశం లేదంటూ అఫిడవిట్ దాఖలు చేసింది టీడీపీ సర్కారు, కొత్త రిజర్వేషన్ల పద్ధతితో 59 శాతం పైచిలుకుతో ముందుకు వచ్చింది వైసీపీ సర్కారు . అన్యాపదేశంగానో, ఉద్దేశపూర్వకంగానే ఈ రెండు సర్కారులు తప్పులు చేశాయి. బీసీ రిజర్వేషన్లపై తాజా పరిస్థితికి అవే కారణమని నిందించకతప్పదు. పార్టీ పరంగా అధికంగా సీట్లు కేటాయించేందుకు ఎలాగూ ఈ రెండు పార్టీలు పూనుకోవు. చట్టపరంగా చిత్తశుద్ధిని సైతం కననబరచలేకపోయాయి. చట్టసభల్లో సీట్ల కేటాయింపే ఈ రెండు పార్టీల సామాజిక న్యాయానికి నిదర్శనం. అధికార కులాలుగా దశాబ్దాలుగా రాష్ట్రాన్ని ఏలుతున్న రెండు సామాజిక వర్గాలకు తమ తమ పార్టీల తరఫున 20 శాతం పైచిలుకు సీట్లను కేటాయించుకోవడంలో రెండు పార్టీలదీ ఒకటే పంథా. కనీసం స్థానిక సంస్థల విషయంలోనూ విదిలింపే. చట్టం పరిధిలో మాత్రమే బీసీలకు కుదించి సీట్లు ఇస్తుంటాయి.పాలక పెద్దలకు నిజానికి ఇప్పుడు కూడా పంచాయతీ ఎన్నికలు జరిపేయాలనే ధ్యాస ఉందనుకోలేం. కానీ 14 వ ఆర్థిక సంఘం నిబంధనల ప్రకారం మార్చిలోపు ఎన్నికలు జరిపి తీరాలి. లేకపోతే దాదాపు మూడువేల కోట్ల రూపాయలను రాష్ట్రం నష్టపోతుంది. అందుకే హడావిడి. మమ అనిపించేయాలని కంగారు పడుతున్నారు. ఏ సామాజిక వర్గం అన్న సంగతి పక్కనపెడితే పంచాయతీల్లో ప్రజాప్రాతినిధ్య పాలకవర్గాలు ఏర్పడటం ముఖ్యం. తప్పనిసరి పరిస్థితుల్లోనే రాష్ట్రాలు ఇందుకు పూనుకుంటున్నాయి. చట్టసభల తరహాలోనే అయిదేళ్లకోసారి కచ్చితంగా ఎన్నికలు జరిపేలా దేశవ్యాప్తంగా ఒక చట్టం తెస్తే తప్ప స్థానిక సంస్థలు రాష్ట్రప్రభుత్వాల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండాల్సిందే. నిధులు, విధులను సైతం బదలాయించేందుకు రాజ్యాంగ బద్ధ వ్యవస్థలు ఏర్పాటు కావాలి. కేంద్ర ప్రభుత్వం ఈవిషయంలో చొరవ చూపితేనే గ్రామస్వరాజ్యం వస్తుంది. ప్రస్తుతం పంచాయతీలు పవర్ లెస్ బాడీలుగా మిగిలిపోతున్నాయి. నిధులన్నిటినీ ఒడిసిపట్టిన రాష్ట్రప్రభుత్వాలు సంక్షేమ పథకాల సంతర్పణ చేస్తున్నాయి. సామాజిక సంపద అయిన మౌలిక వసతులు గ్రామాల్లో సమకూరడం లేదు. ఈ విషయంలో పార్టీలకు అతీతంగా ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైంది

Related Posts