దోచేస్తున్నారు (కర్నూలు)
కర్నూలు, మార్చి 05 ఎంతో చారిత్రక, ఆధ్యాత్మిక ప్రాధాన్యమున్న రవ్వల కొండను అక్రమార్కులు ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. పరిరక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ఫలితంగా పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం రాసిన రవ్వల కొండ కాలగర్భంలో కలిసిపోయే ప్రమాదం పొంచి ఉంది. బనగానపల్లి పట్టణానికి ఆనుకుని రవ్వల కొండ ఉంది. అచ్చమాంబ ఇంట్లో పశువుల కాపరిగా ఉన్న పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి రవ్వల కొండ పరిసర ప్రాంతాల్లో పశువులను మేపేవారు. ఎంతో ప్రశాంత వాతావరణం కలిగిన రవ్వల కొండలో పశువుల చుట్టూ గీత గీసి సమీపంలోని గుహలో కూర్చుని కాలజ్ఞాన తత్వాలు రాసేవారట. ఆయన గీసిన గీతను పశువులు దాటేవి కావని చెబుతుంటారు. కాలజ్ఞానం రాసిన రవ్వల కొండ గుహలో బ్రహ్మంగారు, అచ్చమాంబ విగ్రహాలున్నాయి. ఈ గుహలోంచి శ్రీశైలం, యాగంటికి మార్గాలున్నట్లు అక్కడ రాసి ఉంది. వీరేబ్రహ్మేంద్రస్వామి విగ్రహానికి నిత్య పూజలు జరుగుతుంటాయి. వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు, పర్యాటకులు బ్రహ్మంగారు నడయాడిన ప్రాంతాలను తిలకిస్తుంటారు. రవ్వల కొండ చుట్టూ మెటల్ తవ్వకాలకు పది క్రషర్ యంత్రాలకు గనుల శాఖ అధికారులు అనుమతులిచ్చారు. సర్వే నెంబరు 313లో నాలుగు పరిశ్రమలకు రెండు ఎకరాల్లో లీజు ఇచ్చారు. సర్వే చేయని కొండ ప్రాంతంలో ఆరు పరిశ్రమలకు సుమారు రెండు ఎకరాల్లో లీజులిచ్చారు. ఇలా అనుమతులు తీసుకున్నట్లు చెబుతూ.. అక్రమార్కులు లీజు ప్రదేశాన్ని వదిలి పరిధి దాటి ఇతర ప్రదేశాల్లో తవ్వకాలు చేపడుతున్నారు. బాంబులతో ఇష్టారాజ్యంగా పేలుళ్లు జరుపుతున్నారు. దేవాలయాలకు 300 మీటర్ల పరిధిలో ఎలాంటి మైనింగ్ చేయకూడదన్న నిబంధనలున్నా ఇవేవీ పట్టకుండా ఏకంగా రవ్వల కొండనే తవ్వేస్తున్నారు. రాత్రి, పగలు తేడా లేకుండా బ్లాస్టింగ్ చేస్తూ తవ్వకాలు జరుపుతున్నా పట్టించుకునే నాథుడు కరవయ్యారు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో వాహనాల్లో మెటల్‌ను తరలిస్తున్నారు. ఎంతో ప్రాధాన్యమున్న ఈ కొండలో కనీస వసతులు కల్పించలేకపోయారు. యథేచ్ఛగా నిబంధనలకు విరుద్ధంగా మైనింగ్ చేస్తున్నారు. ఇలా తవ్వకాల కారణంగా రవ్వల కొండ గుహలో పగుళ్లు వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి. ప్రస్తుతం ఏకంగా కొండ పైనే డంప్‌ను ఏర్పాటు చేసుకోవటంతోపాటు భారీ వాహనాలను సైతం అక్కడే పార్కింగ్ చేస్తున్నారు. ఇదే విధంగా కొండను తవ్వడం, బ్లాస్టింగులు చేస్తుంటే ఏదో ఒకనాడు గుహ కూలిపోయే ప్రమాదం ఉంది. కాలజ్ఞానం రాసిన బ్రహ్మంగారు తిరిగిన ప్రదేశంలో మైనింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు.