భారీగా పచ్చబంగారం..
రైతుళ్ల కళ్లలో ఆనందం
నిజామాబాద్, మార్చి 5,
పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపు పంట దిగుబడులు ఈసారి రైతుల కళ్లలో ఆనందం నింపుతున్నాయి. వర్షపాతం సరిగా లేకపోయినప్పటికీ, పసుపుపంటకు ఎలాంటి తెగుళ్లు సోకకపోవడంతో దిగుబడుల పరిణామం పెరుగుతూ వస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న బెడ్ విధానంలో సాగు కూడా ఈసారి అనుకున్న ఫలితాలు అందిస్తున్న నేపథ్యంలో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. దేశంలోనే పసుపు సాగులో ఆర్మూర్ డివిజన్ అగ్రగామిగా ఉంది. ఉద్యానవన శాఖ అధికారుల లెక్కల ప్రకారం ఈ డివిజన్‌లోని 8మండలాల్లోనే రమారమి 34వేల హెక్టార్లలో పసుపు పంట సాగు చేశారు. గత సంవత్సరం వర్షాభావ పరిస్థితులు తీవ్ర స్థాయిలో నెలకొన్న విషయం విదితమే. మొదట్లో కురిసిన వర్షాలు అనంతరం ముఖం చాటేయడంతో రైతులు భూగర్భ జలాలపైనే ఆధారపడి పసుపు పంట పండించారు. గడచిన 45రోజులుగా గ్రామాల్లో ఎటుచూసినా పసుపు తవ్వకాలు, ఉడకబెట్టడం, మార్కెట్‌కు తరలిస్తున్న దృశ్యాలే కనిపిస్తున్నాయి. అయితే ఏ రైతును కదిపినా పంట దిగుబడిపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా ఒక ఎకరం విస్తీర్ణంలో పసుపు సాగు కోసం రైతులు 80వేలు నుండి లక్ష రూపాయల వరకు పెట్టుబడులు ఖర్చు చేస్తారు. సేంద్రియ ఎరువులు, పూడికమట్టి తదితర అవసరాలతో పాటు నాణ్యమైన పసుపు విత్తనాలను కూడా రైతులు ఎంపిక చేసుకుంటారు. వారి లెక్కల ప్రకారంగా ఎకరం విస్తీర్ణంలో సగటున 20 నుండి 22క్వింటాళ్ల వరకు పసుపు దిగుబడులు చేతికందుతాయి. భూసారాన్ని బట్టి ఒక్కో రైతు 25క్వింటాళ్ల వరకు కూడా దిగుబడులు సాధించిన సంఘటనలు ఉన్నాయి. ఈసారి మాత్రం ఆ సగటు 28క్వింటాళ్ల వరకు చేరుకుందని రైతులే చెబుతున్నారు. సాధారణంగా పసుపు పంటకు దుంపకుళ్లు, ఆకు ఎండుతెగులు, మర్రిఆకు వంటి తెగుళ్లు సోకుతాయి. ఈసారి వర్షాలు లేకపోవడం, సరిపడా స్థాయిలోనే నీటి వినియోగం జరగడంతో ఎక్కడా కూడా పసుపు పంటకు తెగుళ్లు సోకిన
దాఖలాలు కనిపించలేదు. ఉద్యానవన శాఖ అధికారులే ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. అక్కడక్కడా తెగుళ్లు సోకినా, ఆ ప్రభావం దిగుబడులపై కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. ప్రస్తుతం ఒక ఎకరాన గరిష్ఠంగా 30క్విం టాళ్ల దిగుబడి పొందినట్టు అధికారులు తెలిపారు. గత ఏడాది ఉద్యానవన శాఖ అధికారులు నూతనంగా బెడ్ విధానాన్ని అమలు చేశారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ వంద మంది రైతులను ఎంపిక చేసి, వందెకరాలలో ఈ పద్ధతి ద్వారా పసుపు పంట పండించారు. పరిస్థితులు అనుకూలించకపోవడం, యాభై శాతానికి పైగా రైతులు నష్టాన్ని చవిచూడడంతో ఈసారి బెడ్ విధానానికి రైతులు ముందుకు రాకపోవచ్చని అధికారులు భావించారు.అయితే వారి అంచనాలు తలకిందులై ఒక్కో గ్రామంలో కనీసం వంద మంది వరకు రైతులు బెడ్ విధానంలోనే పసుపు పంటను పండించారు. పాత విధానానికి స్వస్తి పలికి, అధిక దిగుబడులు ఇచ్చే ఏ.సీ79, 49వంటి రకాలతో పాటు ఆర్మూర్, దుగ్గిరాల, జగిత్యాల తదితర రకాల విత్తనాలను ఎక్కువగా వినియోగించారు. బెడ్ విధానం సాగు వల్ల పసుపు పంటను ఆశించే దుంపకుళ్లు అసలు సోకదని అధికారులు స్పష్టం చేయడంతో రైతులు దీనిని ఎంచుకున్నారు. ఇలాంటి మార్పులతో రైతులు పసుపు పండించగా, ఈసారి దిగుబడులు గణనీయంగా పెరిగాయి. అధికారుల లెక్కల ప్రకారం సగటున ఒక్కో రైతు 28క్వింటాళ్ల వరకు పసుపు దిగుబడులు సాధించినట్టు స్పష్టమవుతోంది. పెరిగిన దిగుబడులకు అనుగుణంగా గిట్టుబాటు ధర కూడా ఉంటే బాగుండేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. సీజన్ ప్రారంభంలో క్వింటాలుకు 7,500రూపాయల వరకు పలికిన ధర, ప్రస్తుతం 6వేలకు పడిపోయింది. చాలామంది రైతులు మహారాష్టల్రోని సాంగ్లీ మార్కెట్ వైపు దృష్టిసారిస్తున్నారు. సాంగ్లీ మార్కెట్‌లో పసుపు నాణ్యతను బట్టి 9వేల రూపాయల వరకు మద్దతు ధర అందుతోందని, రవాణా ఖర్చులు పోను క్వింటాలుకు 1500రూపాయల వరకు అదనంగా డబ్బులు లభిస్తున్నాయని రైతులు అంటున్నారు. రానున్న ఖరీఫ్ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని చాలామంది రైతులు పది నుండి 12క్వింటాళ్ల వరకు నూతన పసుపు రకాలను విత్తేందుకు సిద్ధంగా ఉంచుకుంటున్నారు. ప్రస్తుత పరిస్థితిని బట్టి చూస్తే రానున్న సీజన్‌లో బెడ్ విధానం ద్వారా పసుపు సాగు రెట్టింపయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వారం రోజుల క్రితమే కమ్మర్‌పల్లి పసుపు పరోధనా కేంద్రంలో శాస్తవ్రేత్తలు రైతులకు అధిక దిగుబడులపై అవగాహన కల్పించారు. ఏదిఏమైనప్పటికీ పచ్చ బంగారంగా పిలుచుకునే పసుపుపంట ఈసారి మంచి ఫలితాలు అందించడం పట్ల ఈ పంటను సాగు చేసిన రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.