*మనో మందిరం*
మానవ శరీరమే ధర్మక్షేత్రం. ఆ క్షేత్రానికి చైతన్యాన్ని, జాగృతిని కలిగించేది మనసు. ఇహపర సాధనలకు, ఆధ్యాత్మిక ఉన్నతికి, మన చర్యలకు, వాటి ఫలితాలకు- మనసే కేంద్ర బిందువు. పంచ జ్ఞానేంద్రియాల్ని, పంచ కర్మేంద్రియాల్ని మనసే నియంత్రిస్తుంది. ఆ మనసే అంతఃకరణం. ఈ అంతఃకరణం ఎంత పరిశుద్ధంగా ఉంటే మన జీవనం అంత సుసంపన్నంగా ఉంటుంది. మన శరీరంలో అరిషడ్వర్గాలు, చంచలమైన మనసుతో సమ్మిళితమై ఉన్నాయి. ఏదైనా విషయాన్ని సంకల్పిస్తే అది మనసు. అదే విషయాన్ని ఆలోచిస్తే అది చిత్తం. ఆ విషయాన్నే నిశ్చయిస్తే అది బుద్ధి. ధర్మమార్గంలో చరించాలని నిశ్చయాత్మకమైన బుద్ధి హెచ్చరిస్తున్నా- చివరకు చంచలమైన మనసు మాటే వింటున్నాం. అనేక రీతుల్లో ఇబ్బందులు పడుతున్నాం. మన మనసులోని యోచనలన్నింటినీ పంచేంద్రియాలు ఆచరణలో పెడతాయి. వివేచనా శక్తి, విచక్షణా యుక్తితో వ్యవహరించడం ద్వారా మనసు నియంత్రణలో ఉంటుంది.మనసు త్రిగుణాల సమ్మిశ్రితం. సాత్విక, రాజస, తామస గుణాలతో మనసు విలసిల్లుతోంది. సాత్విక మనోధర్మమే సర్వోత్కృష్టమైనది. అయితే, ఎంత ప్రయత్నించినా స్థిరంగా ఉండనిది మనసే! మనసుపై అదుపు సాధించడమే ఆధ్యాత్మిక మార్గంలో అంతిమ లక్ష్యం. ‘ఇంద్రియ ద్వారాల్ని నిరోధించి, వాటి లోపల మనసును బంధిస్తే, అప్పుడు మనసు మన చెప్పుచేతల్లో ఉంటుంది. మనసును ఒడిసి పట్టడానికి ఇదే కర్తవ్యం’ అని జగద్గురువు ఆదిశంకరులు ఉపదేశించారు. అలాంటి మనసు ఎల్లప్పుడూ శుభ సంకల్పాలు చేయాలని యజుర్వేదం ఆకాంక్షించింది. ‘ఏ మనసు జ్ఞాన సాధనంగా, ఆలోచనాత్మకంగా, ధైర్యయుతంగా, దివ్య ప్రకాశయుక్తంగా శోభిల్లుతుందో- ఆ మనసు శుభ సంకల్పాల్ని చేస్తూ నాకు శ్రేయస్సు కలిగించాలి’ అని సర్వదా ఆకాంక్షించాలనేది వేదోక్తి.‘అన్నింటికంటే వేగవంతమైనదేది’ అని ధర్మరాజును యక్షుడు ప్రశ్నించాడు. ఈ సృష్టిలో మనసు మాత్రమే అత్యంత వేగవంతమైనదని ధర్మరాజు జవాబిచ్చాడు. మనసు వడి, వేగాలు మనిషి ఊహల్ని మించి పరుగెత్తుతాయి.ఈ అద్భుతమైన దేహాన్ని మనకు పరమాత్మ ప్రసాదించాడు. మన మనోమందిరంలో ‘అంతర్యామి’గా వర్ధిల్లుతున్నాడు. అంతఃకరణాన్ని, అంతర్యామితో సమన్వయం చేస్తే ఆత్మజ్ఞానం తేజోమయమవుతుంది. మన శరీరంలో దుర్యోధన, దుశ్శాసనుల వంటి కామక్రోధాలు, రావణ కుంభకర్ణుల వంటి మోహ మత్సరాలు ఉంటాయి. ఆ ప్రతికూల భావాల్ని మనోబలంతో అణచివేయాలి. పాండవుల వంటి భక్తిశ్రద్ధలు, వినయ విధేయతల్ని సర్వత్రా ప్రకటించాలి. ‘మనిషి ఆలోచించాల్సింది అల్లకల్లోలమైన మనసుతో కాదు, సుస్థిరమైన బుద్ధితో’ అని పోతన మహాభాగవతం పేర్కొంది. భౌతిక, మానసిక శక్తులపై ఆధిపత్యాన్ని సాధించినవారే యోగులని భగవద్గీతలో శ్రీకృష్ణుడు సందేశమిచ్చాడు. అభ్యాసంతో కూడిన సాధన ద్వారా మనసుపై గెలుపొందవచ్చు. ప్రతికూల ఆలోచనలు, సానుకూల భావాలు మనసు నుంచే ఉద్భవిస్తాయి. మంచి చెడుల్ని విశ్లేషించుకుని సాధువర్తనంతో జీవన గమనాన్ని కొనసాగించాలి. అన్ని సంస్కారాలూ మనసు నుంచే ఉత్పన్నమవుతున్నాయి. మనోవాక్కాయ కర్మల్ని భగవంతుడిపై కేంద్రీకరిస్తే ఆధ్యాత్మికత అంకురిస్తుంది. ‘మనం తినే ఆహారాన్నిబట్టి మనసు ఆకృతి దాలుస్తుంది. మనో మాలిన్యాలు తొలగాలంటే సత్యాన్ని ఆశ్రయించాలి’ అని బృహదారణ్యకోపనిషత్తు చెబుతోంది. సాత్వికాహారం స్వీకరిస్తూ, సత్వగుణమయ జీవితాన్ని అవలంబిస్తూ, ధర్మ చింతనతో అలుపెరుగని బాటసారిగా ఆధ్యాత్మిక మార్గంలో పయనించాలి. అలాంటి ప్రయాణమే సార్థకమవుతుంది. అదే మహాప్రస్థానం. జీవితాన్ని మలుపు తిప్పే దివ్య సోపానం.
వరకాల మురళి మోహన్ సౌజన్యంతో