YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం వాణిజ్యం ఆంధ్ర ప్రదేశ్

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ వేగవంతం

ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ వేగవంతం

 ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ వేగవంతం
విజయవాడ, మార్చి 6
తెలుగుదేశం ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలపై జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం చాప కింద నీరులా తన పని తాను చేసుకుపోతోంది. సిట్ ప్రస్తుతం రాజధాని ప్రాంతంలో జరిగిన ఇన్ సైడర్ ట్రేడింగ్ పైనే దృష్టి పెట్టింది. రాజధాని ప్రకటించకముందు జరిగిన రిజిస్ట్రేషన్లు, బినామీల ద్వారా కొనుగోళ్లపైనే సిట్ ఎక్కువగా దృష్టి పెట్టింది. ఇప్పటికే కొన్ని ఆధారాలు సేకరించినట్లు తెలుస్తోంది. అయితే సిట్ రంగంలోకి దిగడంతో బినామీలు, కొనుగోలు చేసిన వారి గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి.ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ కు ప్రత్యేక అధికారాలను కల్పించారు. ఇంటలిజెన్స్ డీఐజీ కొల్లి రఘురామిరెడ్డిని సిట్ కు ప్రత్యేక అధికారిగా నియమించారు. ప్రత్యేక అధికారాలను కల్పించారు. ప్రత్యేకంగా పోలీస్ స్టేషన్ ను ఏర్పాటు చేశారు. సిట్ ఎవరినైనా, ఎప్పుడైనా పిలిపించి విచారించేలా ప్రభుత్వం సర్వాధికారాలను కట్టబెట్టింది. దీంతో సిట్ ఇటీవలే క్షేత్రస్థాయిలో సోదాలకు రంగంలోకి దిగింది. తొలుత తమకు పక్కా ఆధారాలున్నాయని భావిస్తున్న వారినే సిట్ టార్గెట్ చేసింది.మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు బంధువు ఇంట్లో సోదాలు నిర్వహించారు. రామవరప్పాడు లోని ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో కొన్ని కీలక పత్రాలు లభించాయని చెబుతున్నారు. అలాగే మాజీ అడ్వొకేట్ జనరల్ దమ్మాల పాటి శ్రీనివాస్ మామ నన్నపనేని లక్ష్మీనారాయణ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. కంచికచర్లలో సిట్ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. త్వరలో విచారణకు కొందరు ముఖ్యనేతలను పిలిపించే అవకాశముందని తెలుస్తోంది.ఇక త్వరలోనే మాజీ మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణలను కూడా స్టేషన్ కు పిలిపించి విచారిస్తారని ప్రచారం జరుగుతోంది. ఎక్కువగా రాజధాని ప్రాంతంలో వీరిద్దరి పేర్లే విన్పిస్తుండటం, వీరిపై కొందరు దళితులు ఫిర్యాదు చేయడంతో పిలిచి విచారించాలని సిట్ అధికారులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. రాజధాని భూముల ఇన్ సైడర్ ట్రేడింగ్ పై ఇప్పటికే సిట్ కు కొన్ని కీలక ఆధారాలు లభించడంతో ఇక దూకుడు పెంచేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. మరి ఎవరెవరు ఈ జాబితాలో ఉన్నారన్నది కొద్దిరోజుల్లోనే తెలిసిపోనుంది.

Related Posts