బెజవాడ ఆర్టీసీలో లక్కీ డీప్
విజయవాడ, మార్చి 6
బస్సులో ప్రయాణించే వారి సంఖ్య పెంచడానికి ఏపీఎస్‌ఆరీ్టసీ సరికొత్త ఆలోచనలతో ముందుకు వెళుతోంది. మరింతగా ఆదాయాన్ని ఆర్జించే లక్ష్యంతో బస్సు ప్రయాణికులకు బహుమతులను అందజేయనుంది. ఇందుకోసం ప్రాథమికంగా కొన్ని రూట్లను ఎంపిక చేసింది. ఆయా రూట్లలో తిరిగే బస్సుల్లో ప్రయాణించే వారు టిక్కెట్టు వెనక ఫోన్ నంబరు, చిరునామా రాసి దిగేటప్పుడు బాక్సులో వేయాల్సి ఉంటుంది. ఈ బస్సుల్లో టిక్కెట్లు వేయడానికి బాక్స్‌లను ఏర్పాటు చేస్తున్నారు. పదిహేను రోజులకొకసారి ఈ టిక్కెట్లను లాటరీ తీస్తారు. ఇందులో ముగ్గురిని విజేతలుగా ఎంపిక చేస్తారు. వారికి ఆకర్షణీయమైన (కుక్కర్లు, హాట్ బాక్స్‌లు, లంచ్ బాక్సులు వంటి) బహుమతులను అందజేస్తారుఈ గిఫ్ట్ స్కీమ్‌ను ఆదివారం నుంచి అమలుకు శ్రీకారం చుట్టారు. విజయవాడ ఆర్టీసీ రీజియన్ పరిధిలో తొలిదశలో 12 రూట్లలో తిరిగే బస్సుల్లో ఈ స్కీమ్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉన్న (ఆక్యుపెన్సీ 65–85 శాతం) రూట్లలోనే వీటిని ప్రవేశపెడుతున్నారు. ఈ రూట్లలో ఆటోల్లోనూ ఎక్కువ మంది ప్రయాణిస్తున్నారు. వీరిని ఆర్టీసీ బస్సుల్లోకి మళ్లించేందుకు బహుమతులను ప్రకటించారు. ఈ గిఫ్ట్ ప్రయోగం విజయవంతమైతే వచ్చే నెల నుంచి మరిన్ని రూట్లకు ఈ స్కీమ్‌ను విస్తరించాలని ఆర్టీసీ అధికారులు యోచిస్తున్నారు.