మున్సిపల్ వసూళ్లపై టార్గెట్
హైద్రాబాద్, మార్చి 6,
పురపాలక సంఘాలు ఆర్థికంగా బలోపేతం కావాలంటే ప్రతి మున్సిపాలిటీలు పన్ను వసూళ్ళను పెంచుకోవాలని పురపాలక శాఖ ప్రత్యేక మార్గనిర్దేశకాలను జారీచేసింది. ఈనెల 31వ తేదీలోపు రూ. 953.01 కోట్లుగా ఉన్న పన్నులను వసూలు చేయాలని మున్సిపల కమిషనర్‌లకు పురపాలక శాఖ ప్రత్యేకంగా( ఆదేశించింది. సరైన పద్దతిలో బారీగా పన్ను బకాయిపడుతున్న ప్రైవేట్, ప్రభుత్వ సంస్థల, వ్యక్తుల వివరాలను మున్సిపాలిటీ వెబ్‌సైట్‌లోనూ, కార్యాలయం నోటీసు బోర్డులోనూ తెలియజేయాలని పురపాలక శాఖ సూచించింది.ఈ ఆదేశాలను పెడచెవినబెడుతూ, ప్రతిభ కనబరచని అన్ని మున్సిపల్ కమిషనర్‌లను, సంబంధిత అధికారులను తీవ్రంగా పరిగణించబడుతుందని ఆదేశాల్లో స్పష్టంచేసింది. జిహెచ్‌ఎంసి మినహాయించి 140 పట్టణ స్థానిక సంస్థలు 100 శాతం పన్నులు, పన్నులేతర రుసుంలను కూడా వసూలు చేయాలంటూ ఆదేశాల్లో పేర్కొన్నది. 140 పట్టణ స్థానిక సంస్థల్లో ఆస్తిపన్ను రూపేణా రూ. 672.30 కోట్లు డిమాండ్‌గా ఉండగా వసూలు చేసింది రూ. 416.85 కోట్లు, ప్రభుత్వ భవనాల నుంచి రూ. 172.65 కోట్లు డిమాండ్ ఉంటే వసూలైంది మాత్రం రూ. 15.12 కోట్లు, ట్రేడ్ లైసెన్సుల నుంచి ర. 21.88 కోట్లుగా ఉంటే అందులో వసూలు రూ. 8.81 కోట్లు, అడ్వర్టైజ్‌మెంట్ పన్నుల రూపేణా రూ. 42.92 కోట్లుగా రావాల్సి ఉంటే 62.05 లక్షలు మాత్రమే మున్సిపాలిటీలకు చేరాయి. షాపుల గదుల అద్దెలుగా రూ. 38.26 కోట్లు మున్సిపాలిటీలకు రావాల్సి ఉండగా రూ. 15.95 కోట్లు వసూలయ్యాయి. మొత్తం బకాయిగా రూ. 452.63 కోట్లుగా ఉన్నదిమున్సిపాలిటీలోని ఇంజనీరింగ్, ప్లానింగ్‌ల లేదా శానిటేషన్ విభాగపు అధిపతి పర్యవేక్షణలో బిల్ కలెక్టర్, రెవెన్యూ అధికార, జూనియర్, సీనియర్ అసిస్టెంట్‌లను సభ్యులుగా చేసి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని పురపాలక శాఖ అన్ని మున్సిపాలిటీలకు ఈ నెల 29వ తేదీన ఆదేశాలు జారీచేసింది. ఈ బృందాలకు సమానమైన పనులను కేటాయించాలని, ప్రాంతాన్ని బట్టి లక్ష్యాలను నిర్ణయించాలని, అన్ని సెక్షన్‌ల అధికారులు పన్నువసూలులో భాగస్వాములు కావాలని ఆదేశాల్లో వివరించింది. రోజువారి వసూలు లక్ష్యాన్ని నిర్ణయించి, పర్యవేక్షణ చేయాలని సూచించింది. పన్ను వసూలుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో పాటు మైక్‌ల ద్వారా, సినిమా స్లైడ్‌లు, అనుమతించే ప్రాంతాల్లో క్లాత్ బ్యానర్లు ఏర్పాటు చేసి పన్ను చెల్లింపుల విస్తృత ప్రచారం చేయాలని పురపాలక శాఖ పేర్కొన్నది.పన్ను చెల్లింపుదారుల ఫోన్‌లకు రోజువారి సమాచారం తరహాలోనే ఎస్‌ఎంఎస్‌లు చేయాలని తెలిపింది. భారీగా పన్ను బకాయి పడిన 500 మందిని గుర్తించి బిల్‌కలెక్టర్లకు తెలిపి వసూలు చేయాలని స్పష్టంచేసింది. కొత్త మున్సిపల్ చట్టం 2019 ప్రకారంగా దీర్ఘకాలికంగా పన్నులు చెల్లించని వారికి లీగల్ నోటీసులు పంపడం, కమిషనర్ వద్దకు పిలిచి చర్చిండం చేయాలని ఆదేశాల్లో వివరించింది. 85 శాతం పన్ను డిమాండ్‌ను బిల్ కలెక్టర్ల ద్వారా, 10 శాతం బృందాల పర్యవేక్షణాధికారితో, 5 శాతం వసూలును సంబంధిత ఆస్తిని సీజ్ చేయడం ద్వారా వసూలు చేయాలని పురపాలక శాఖ మున్సిపాలిటీలకు సూచించింది. ప్రభుత్వ భవనాల నుంచి రావాల్సిన పన్ను విషయమై సంబంధిత కలెక్టర్లను నేరుగా కలిసి, ‘అర్బన్ డే’ సమావేశం నిర్వహించి అన్ని విభాగాల నుంచి రావాల్సిన పన్నును వసూలు జరిగేలా చూడాలి. ప్రత్యేక బృందాలతో ప్రతి రోజు సమీక్షను కమిషనర్ నిర్వహించాలి.