కండక్టర్‌పై దాడిచేసిన కానిస్టేబుళ్లు సస్పెన్షన్
హైదరాబాద్ మార్చ్ 6
ఒక మహిళా కండక్టర్ పట్ల దురుసుగా ప్రవర్తించిన ఇద్దరు ఎస్కార్ట్ ఏఆర్ కానిస్టేబుళ్లు సత్యనారాయణరెడ్డి, రామకృష్ణా గౌడ్‌ను హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ సస్పెండ్ చేశారు. అంబర్‌పేట ఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌లో విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కానిస్టేబుళ్లు హైదరాబాద్ చర్లపల్లి జైలు నుంచి ఒక ఖైదీని గురువారం జడ్చర్ల న్యాయస్థానంలో హాజరుపరిచారు. తిరుగు ప్రయాణంలో వారు కొల్లాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఎక్కారు. వారిని మహిళా కండక్టర్ శ్రీలత టికెట్టు అడగ్గా వారెంటు ఉందని చెప్పారు. కానీ చూపించేందుకు నిరాకరించడంతో కండక్టర్‌కు, కానిస్టేబుల్ రామకృష్ణాగౌడ్‌కు మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో కానిస్టేబుల్ ఆమెపై చేయి చేసుకోగా శ్రీలత ముఖంపై గాయం అయ్యింది. ఈ ఘటనపై బాధితురాలు జడ్చర్ల ఠాణాలో ఫిర్యాదు చేసింది. సీఐ వీరస్వామి కండక్టరును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళ పట్ల దురుసుగా ప్రవర్తించినందుకు గాను ఇద్దరు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేస్తూ సీపీ అంజనీ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.