సహనాన్ని పరీక్షిస్తున్న ఈ కార్లు
గుంటూరు, మార్చి 7,
ఈ–కార్లు అధికారులకు చుక్కలు చూపిస్తున్నాయి. తరచూ చార్జింగ్ సమస్యలతో ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. ఏడాదిన్నర క్రితం ప్రభుత్వం రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థలకు ఈ–కార్లను అందజేసింది. ఇలా ఆంధ్రప్రదేశ్ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్‌పీడీసీఎల్) పరిధిలోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, సీఆర్‌డీఏ సర్కిళ్లకు 40 ఈ–కార్లను సమకూర్చింది. వీటికి ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని డివిజన్ కేంద్రాల్లో చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేశారు. ఇవి అందుబాటులోకి వచ్చిన కొన్ని నెలల నుంచే సమస్యలు తెచ్చిపెడుతున్నాయివాస్తవానికి ఈ–కార్లకు బ్యాటరీ ద్వారా చార్జింగ్ (డీసీ) పెడితే గంటలోను, విద్యుత్‌తో చార్జింగ్ (ఏసీ)కు ఎనిమిది గంటల సమయం తీసుకుంటుంది. ఇలా రాత్రంతా చార్జింగ్ పెట్టి ఉదయాన్నే బయల్దేరుతున్నారు. కారుకు పూర్తిగా చార్జింగ్ పెడితే 120–140 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. కానీ అవి 80–90 కిలోమీటర్లకు మించి రావడం లేదని, మరికొన్ని కార్లకు ఉన్నట్టుండి అకస్మాత్తుగా చార్జింగ్ పడిపోతోందని ఇటు అధికారులు, అటు డ్రైవర్లు చెబుతున్నారు. దీంతో ఈ కార్లలో విధులకు వెళ్తున్న అధికారులకు ఇబ్బందులు పడుతున్నారు. అంతేకాక.. కొన్నింటికి గేర్లు, బ్రేకులు, సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, కొన్ని కార్లలో ఏసీలు కూడా సరిగా పనిచేయడం లేదని వీటిని నడుపుతున్న డ్రైవర్లు చెబుతున్నారు. ఈ విద్యుత్ కార్ల నిర్వహణ బాధ్యత ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్‌ఎల్) చూస్తోంది. ఒక్కో కారుకు నెలకు రూ.20 వేల చొప్పున డిస్కంలు ఈఈఎస్‌ఎల్‌కు అద్దెగా చెల్లిస్తున్నాయి. ఈ–కార్లకు ఏమైనా సమస్యలపై ఫిర్యాదు చేస్తే షెడ్డుకు పంపించమని చెబుతున్నారని, అక్కడ కొన్నిసార్లు రెండు మూడు రోజుల పాటు కూడా ఉంచాల్సి వస్తోందని అంటున్నారు. కార్లకు వస్తున్న సాంకేతిక సమస్యలపై చేస్తున్న ఫిర్యాదులకు ఈఈఎస్‌ఎల్ నుంచి సరైన స్పందన ఉండడం లేదని అధికారులు పెదవి విరుస్తున్నారు. ఈ–కార్ల వల్ల ఇబ్బంది లేదు. చార్జింగ్ ఇబ్బందులు నామమాత్రమే. మాకు ఏమైనా ఫిర్యాదులొస్తే వెంటనే సరిచేస్తున్నాం. విద్యుత్ కార్లకు సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయన్నది అవాస్తవమంటున్నారు కంపెనీ హెడ్