YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు రాజకీయం ఆంధ్ర ప్రదేశ్

గుడివాడపై టీడీపీ గురి

గుడివాడపై టీడీపీ గురి

గుడివాడపై టీడీపీ గురి
విజయవాడ, మార్చి 7
గుడివాడ అంటేనే గుర్తుకొచ్చేది కొడాల నాని. ఇప్పుడు కొడాలి నాని మంత్రి కావడంతో ఇక ఆయనకు తిరుగే లేకుండా పోయింది. తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని వ్యక్తిగతంగా తన సొంత నియోజకవర్గంగా మార్చుకున్నారు. పార్టీ ఏది అన్నది కాదు.. అభ్యర్థి ఎవరన్నదే ముఖ్యమన్నది గుడివాడ నియోజకవర్గ ప్రజల అభిప్రాయంగా గత ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తున్నాయి. అయితే ఇక్కడ కొడాలి నానికి ధీటైన అభ్యర్థి తెలుగుదేశం పార్టీకి దొరకడం లేదు.తెలుగుదేశం పార్టీ గుడివాడ నియోజకవర్గం నుంచి అనేక సార్లు గెలుపొందింది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు సయితం గుడివాడ నుంచి గెలుపొందారు. ఇప్పటికి ఏడు సార్లు టీడీపీ ఇక్కడ గెలుపొందింది. కాంగ్రెస్ ఆరుసార్లు, సీపీఐ రెండు సార్లు, వైసీపీ రెండు సార్లు విజయం సాధించాయి. కొడాలి నాని మాత్రం నాలుగుసార్లు వరసగా గెలుపొంది రికార్డు సృష్టించారు. కొడాలి నాని రెండుసార్లు టీడీపీ నుంచి రెండుసార్లు వైసీపీ నుంచి గెలుపొందారు.తాజాగా గుడివాడ నియోజకవర్గానికి రావి వెంకటేశ్వరరావును ఇన్ చార్జిగా పార్టీ అధిష్టానం నియమించింది. అయితే రావి వెంకటేశ్వరరావు నియామకంపై లోకల్ లీడర్స్ పెదవి విరుస్తున్నారు. కొడాలి నానికి ఏమాత్రం ధీటైన అభ్యర్థి రావి వెంకటేశ్వరావు కాదన్నది వారందరి అభిప్రాయం. అయితే దేవినేని ఉమామహేశ్వరరావు సిఫార్సుతోనే రావి వెంకటేశ్వరరావును నియోజకవర్గ ఇన్ ఛార్జిగా నియమించారు. పార్టీ నేతలు పిన్నమనేన వెంకటేశ్వరరావు, పిన్నమనేని బాబ్జీలు రావి వెంకటేశ్వరరావు నియామకం పట్ల బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.గుడివాడ నియోజకవర్గాన్ని తొలి నుంచి టీడీపీ అధిష్టానం నిర్లక్ష్యం చేస్తుందని తెలుగు తమ్ముళ్లు వాపోతున్నారు. 2009 నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తర్వాత ఈ నియోజకవర్గం టీడీపీకి అందకుండా పోతోంది. కొడాలి నానికి ధీటైన నేతను నియమించకపోవడంతో పాటు తరచూ అభ్యర్థులను మారుస్తుండటం కూడా టీడీపీకి కలసి రావడం లేదంటున్నారు. రావి వెంకటేశ్వరరావు ప్రజల్లో ఉండరని ఇక్కడ టీడీపీ నేతలు ఆయన నియామకాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నారు. ఆయననే కొనసాగిస్తే ఇక కొడాలి నానికి ఎదురే ఉండదని కూడా వారు అధిష్టానానికి కుండబద్దలు కొట్టారు. అయినా అధిష్టానం మాత్రం రావి వెంకటేశ్వరరావు వైపు మొగ్గు చూపింది.

Related Posts