తిరుమలలో మద్యం, మాంసం అమ్మకాలు...
తిరుమల, మార్చి 7
తిరుమలలో మద్యం, మాంసం కలకలరేపింది. నిబంధనలకు విరుద్దంగా.. ఏడుకొండల పవిత్రతకు భంగం కలిగేలా చేశారు. కలియుగ దైవం ప్రత్యక్ష దైవం కొలువైన కొండపై మద్యం సేవిస్తూ.. మాంసం తిన్నారు. తిరుమలలోని ఎఫ్ టైప్ క్వార్టర్స్ దగ్గర స్థానిక బాటగంగమ్మ ఆలయం సమీపంలో కొంతమంది గుంపుగా కూర్చుని మద్యం సేవిస్తున్నట్టు తిరుమల వన్‌టౌన్ పోలీసులకు సమాచారం అందింది.. వెంటనే పోలీసులు స్పాట్‌కు వెళ్లారు.. మద్యం సేవిస్తున్న 14మందిని అరెస్ట్ చేశారు. అరెస్టైన 14 మంది తిరుమల, తిరుపతికి చెందిన వ్యక్తులగా పోలీసులు గుర్తించారు. వారి దగ్గర నుంచి మద్యం సీసాలను స్వాధీనపరుచుకున్నారు. వీరు మాంసం వంటకాలు తినే ప్రయత్నం కూడా చేశారని పోలీసులు తెలిపారు. ఈ 14మందిపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ చట్టం కింద కేసు నమోదు చేశారు. మద్యం బాటిళ్లు, మాంసం తిరుమలకు ఎలా వచ్చిందనే అంశంపై పోలీసులు ఫోకస్ పెట్టారు.. ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు.మద్యం కొండపైకి తీసుకురావడానికి ఎవరు సహకరించారో ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఎవరి హస్తమైనా ఉంటే చర్యలు తప్పవంటున్నారు పోలీసులు. తిరుమల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇదిలా ఉంటే తిరుమలలో ఇలా మద్యం, మాంసం కనిపించడంపై భక్తులు మండిపడుతున్నారు.