YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం తెలంగాణ

280 రూపాయిల తయారీ...160 రూపాయిలకు అమ్మకం

280 రూపాయిల తయారీ...160 రూపాయిలకు అమ్మకం

280 రూపాయిల తయారీ...160 రూపాయిలకు అమ్మకం
హైద్రాబాద్, మార్చి 7
మార్కెటింగ్‌లో సరైన వ్యూహాలు అవలంబించకపోవడతో విజయ డెయిరీ దాదాపు రూ.15 కోట్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఉత్పత్తి ధర కంటే అతి తక్కువ రేటుకు పాల పౌడర్‌ను అమ్ముకోవడమే ఇందుకు కారణం. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఒకవైపు విజయ ఉత్పత్తులను ప్రజల్లోకి విరివిగా తీసుకెళ్లాలని, ప్రైవేట్‌కు ధీటుగా మార్కెటింగ్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుంటే కొందరు అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరించడంతో విజయ డెయిరీ నష్టాల పాలవుతోంది. ముఖ్యమంత్రి కెసిఆర్ లీటరుకు రూ.4 పాల ప్రోత్సాహాకం ప్రకటించడంతో విజయ డెయిరీకి గణనీయంగా పాల సేకరణ పెరిగింది. రెండేళ్ల కింద సగటున రోజుకు మూడున్నర లక్షల లీటర్లకు బదులు నాలుగున్నర లక్షల నుంచి ఐదు లక్షల లీటర్ల వరకు పాలు వచ్చాయి. ఇలా ఉత్పత్తుల అవసరాలకు మించి పాలు వస్తే, వాటిని పాల పౌడర్‌గా మారుస్తారు.మళ్లీ పాల సేకరణ తగ్గినప్పుడు పౌడర్‌ను పాలగా మార్చడంతో పాటు ఇతర పాల ఉత్పత్తులకు వినియోగిస్తారు. ఇలా 2018లో అధిక మొత్తంలో వచ్చిన పాల ద్వారా ఏకంగా 1200 టన్నుల పౌడర్‌ను తయారు చేశారు. ఒక్క కిలో పాల పౌడర్‌ను తయారు చేయడానికి రూ.280 ఖర్చు అవుతుందని విజయ డెయిరీ అధికారులు తెలిపారు. ఇక తయారు చేసిన పౌడర్‌కు దాదాపు ఏడాది వరకు వ్యాలిడెటి ఉంటుందని పేర్కొంటున్నారు. వ్యాలిడెటి ముగుస్తుందన్న కారణంతో 2018 డిసెంబర్ నుంచి 2019 జవనరి సమయంలోనే పౌడర్‌ను విక్రయించారు. సాధారణంగా కిలో పౌడర్‌కు మార్కెట్‌లో రూ.350 నుంచి రూ.380 వరకు ఉంటుందంటున్నారు. అయితే కిలోకు రూ.280 ఖర్చు చేసిన పౌడర్‌ను కిలోకు రూ.160కు విక్రయించారు. అంటే ఒక్క కిలోకు రూ.120ల చొప్పున నష్టపోయారు. ఇలా 1200 టన్నులకు దాదాపు రూ.15 కోట్లు డెయిరీ నష్టపోయింది. పాల పౌడర్‌ను విక్రయ బాధ్యతను ఎన్‌సిడిఎఫ్‌ఐకు అప్పజెప్పారు.వ్యాలిడెటి పేరుతో పాల పౌడర్‌ను ఆగమేఘాల మీద నష్టాలకు అమ్ముకున్న విజయ డెయిరీపై విమర్శలు వస్తున్నాయి. ఇందులో ఏదో మతలబు ఉందని ఆరోపణలు వస్తున్నాయి. రెగ్యులర్‌గా సేకరిస్తున్న పాలను పౌడర్‌గా మార్చుకుంటూ, వాల్యిడెటి ముగుస్తున్న పౌడర్‌ను పాలగా మార్చడం, ఇతర ఉత్పత్తులను తయారు చేయడం వంటిది చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అలా చేయడం ద్వారా కోట్ల రూపాయల నష్టం వచ్చేది కాదంటున్నారు. ఇదిలా ఉండగా గతంలో పాలు ఎక్కువగా వచ్చిన సందర్భంలో అసలు హైదరాబాద్‌కు పాలు రావొద్దని, జిల్లాల్లోనే తగ్గించాలని మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. అందులో భాగంగానే ఇప్పుడు పాల సేకరణ గణనీయంగా పడిపోయిందని ఒక జిల్లా డెయిరీ అధికారి తెలిపారు. మళ్లీ ఇప్పుడేమో పాల సేకరణ పెరగాలని, స్పెషల్ ఆఫీసర్లను వేస్తున్నారని అ అధికారి వాపోయారు. ఇటీవల మన తెలంగాణలో వచ్చిన కథనాలపై స్పందించిన డెయిరీ ఉన్నతాధికారులు ప్రక్షాళన మొదలుపెట్టారు. అర్హత లేని వారికి పోస్టింగ్ మార్చడంతో పాటు జిల్లాల నుంచి వచ్చిన ప్రతి ఫిర్యాదును, విజ్ఞప్తిని పరిశీలిస్తున్నట్లు తెలిసింది.

Related Posts